-అత్యవసర చికిత్స కోసం తొలిసారిగా యాంటీ స్నేక్ వీనం (ఏఎస్‌వీ) ఇంజక్షన్ ను అందుబాటులోనికి తెచ్చిన వైద్య ఆరోగ్యశాఖ
-బాధితుల ప్రాణాలకు భరోసా
-రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ వెల్లడి
-వైద్యుల సూచన మేరకే ఏఎస్‌వీని.. బాధితులకు ఈఎంటీలు ఇచ్చేలా చర్యలు
-ఎన్టీఆర్ వైద్య సేవ సీఈఓ చక్రధర్ బాబు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
పాముకాటు బాధితుడిని ఆసుపత్రికి తరలించేలోపే విషప్రభావం తీవ్రం కాకుండా ముందస్తు చికిత్స అందించేందుకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఇకపై 108 అంబులెన్సుల్లోనే యాంటీ స్నేక్ వనం (ASV) అందుబాటులో ఉంటుంది. పాముకాటు అత్యవసర కాల్స్ పెరుగుతున్న నేపథ్యంలో ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని అమల్లోకి వైద్య ఆరోగ్యశాఖ తెచ్చింది. జూన్ 2025 నుంచి ఇప్పటివరకు 3,104 పాముకాటు అత్యవసర కాల్స్ రావడంతోపాటు వివిధ రూపాల్లో ప్రభుత్వానికి అoదిన విజ్ఞప్తుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. కడప, నంద్యాల, కర్నూలు జిల్లాలో ఒక్కొక్కరికి చొప్పున ముగ్గురికి ఈఎంటిలు పాముకాటు విరుగుడు చికిత్స అందించారు. వారికి ప్రాణాపాయం తప్పింది.
వైద్యుడిని సంప్రదించిన తర్వాతే
అంబులెన్స్‌లోని ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ (ఈఎంటీ) తనంతట తానుగా ఏఎస్‌వీ ఇవ్వరు. బాధితుడిలో విషం శరీరమంతా వ్యాపిస్తున్నట్లు అనుమానించే లక్షణాలు కనిపిస్తే వెంటనే మంగళగిరి ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్ (ఈఆర్‌సీ) వైద్యుడిని సంప్రదించాలి. అంబులెన్స్‌లో ఏర్పాటు చేసిన డోమ్ కెమెరా ద్వారా ఈఆర్‌సీ వైద్యుడు బాధితుడి పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించి.. అవసరమైతే ఏఎస్‌వీ ఇవ్వాలని సూచిస్తారు. వైద్యుడి సూచన మేరకే ఈఎంటీ మందును వినియోగించేల చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ నేడు ఒక ప్రకటన తెలిపారు.
ప్రయాణ సమయమే.. ప్రాణరక్షణ సమయం
పాముకాటుకు గురైన వ్యక్తిని వీలైనంత త్వరగా ఆసుపత్రికి చేర్చడం అత్యంత కీలకం. అయితే అంబులెన్స్ ప్రయాణ సమయంలో విషప్రభావం పెరిగి పరిస్థితి విషమించే అవకాశం ఉంటుంది. దీంతో ఆసుపత్రికి చేరేలోపు సమయాన్ని వృథా కాకుండా ప్రయాణంలోనే అవసరమైన ప్రాణరక్షక చర్యలు ప్రారంభించేలా ఈ విధానాన్ని తీసుకొచ్చారు.
ఈఎంటీ బాధితుడి పరిస్థితిని అంచనా వేసి క్లినికల్ వివరాలను ఈఆర్‌సీ వైద్యుడికి తెలియజేస్తారు. డోమ్ కెమెరా ద్వారా వైద్యుడు ప్రత్యక్షంగా పరిశీలించి సూచనలు ఇస్తారు. ఏఎస్‌వీ అవసరమని వైద్యుడు నిర్ధారిస్తే ఈఎంటీ దాన్ని అందిస్తారు. అదే సమయంలో బాధితుడిని సమీపంలోని తగిన ఆసుపత్రికి తరలిస్తారు.
విష ప్రభావ అనుమాన సంకేతాలు ఇవే
పాముకాటు తర్వాత కింది లక్షణాలు కనిపిస్తే శరీరమంతా విషప్రభావం (సిస్టమిక్ ఎన్‌వెనమేషన్) ఉన్నట్లు అనుమానించాలి.
* కనురెప్పలు వాలిపోవడం
* కళ్ల కండరాల్లో బలహీనత లేదా పక్షవాతం
* శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది.. శ్వాస భారంగా మారడం
* ఆక్సిజన్ స్థాయి (SpO₂) పడిపోవడం
* మింగడంలో ఇబ్బంది
* మాట తడబడటం
* 20 నిమిషాల తర్వాత కూడా రక్తం గడ్డకట్టకపోవడం
* పెద్ద నల్లటి మచ్చలు ఏర్పడటం
* పాత గాయాల నుంచి రక్తస్రావం
* చిగుళ్లు, ముక్కు, మూత్రంలో కారణం లేకుండా రక్తం కనిపించడం
* కొన్ని గంటల్లోనే కరిచిన చేయి లేదా కాలిలో సగానికి మించి వేగంగా వాపు రావడం
* బొబ్బలు, తీవ్రమైన స్థానిక కణజాల నష్టం లేదా నెక్రోసిస్ ఏర్పడటం
ఇలాంటి లక్షణాలు కనిపించిన వెంటనే ఈఎంటీ ఈఆర్‌సీ వైద్యుడికి సమాచారం అందించాలి.
20 నిమిషాల రక్త పరీక్ష.. కీలకం
విషం రక్తం గడ్డకట్టే సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తోందా లేదా తెలుసుకునేందుకు ప్రత్యేక పద్ధతిని అనుసరిస్తారు. శుభ్రమైన, పొడిగా ఉన్న గాజు గొట్టంలో తీసిన రక్తం 20 నిమిషాల తర్వాత కూడా గడ్డకట్టకపోతే అది విషప్రభావానికి సూచనగా పరిగణిస్తారు. ఈ వివరాలను ఈఎంటీ ఈఆర్‌సీ వైద్యుడికి తెలియజేస్తారని, ఆ మేరకు వారికి శిక్షణ ఇచ్చామని ఎన్టీఆర్ వైద్య సేవ సీఈఓ చక్రధర్ బాబు తెలిపారు.
ప్రతి 108లో.. ఏఎస్‌వీ
జూన్ 2025కు ముందు 108 అంబులెన్సుల్లో ఏఎస్‌వీ అందుబాటులో లేదు. పాముకాటు అత్యవసర కాల్స్ పెరుగుతుండటంతో డాక్టర్ ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్ట్ సీఈఓ అన్ని 108 అంబులెన్సుల్లో ఏఎస్‌వీ అందుబాటులో ఉంచాలని సూచించారు.
ఒక్కో ఏఎస్‌వీ వయల్ ధర రూ.584.64. మొత్తం రూ.5,28,514.56 విలువైన ఏఎస్‌వీని కొనుగోలు చేశారు.
డోమ్ కెమెరాతో.. వైద్యుడి ప్రత్యక్ష పర్యవేక్షణ
108 అంబులెన్సుల్లో ఇప్పటికే డోమ్ కెమెరాలను ఈఆర్‌సీతో అనుసంధానించారు. అత్యవసర పరిస్థితుల్లో బాధితుడిని వైద్యుడు ప్రత్యక్షంగా పరిశీలిస్తూ దూరం నుంచే వైద్య సూచనలు అందించే సదుపాయం ఉంది. వాహనాల కదలికను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వెహికల్ ట్రాకింగ్ వ్యవస్థను కూడా అన్ని అంబులెన్సుల్లో ఏర్పాటు చేశారు. దీంతో పాముకాటు బాధితుడి పరిస్థితిని అంబులెన్స్‌లోనే ఈఆర్‌సీ వైద్యుడు గమనిస్తూ.. ఏఎస్‌వీ అవసరమా? ఇతర అత్యవసర చర్యలు చేపట్టాలా? అన్నదానిపై సూచనలు ఇస్తారు.
‘గోల్డెన్ అవర్’లో 95% మందికి చేరువ
అత్యవసర చికిత్సలో తొలి గంట (గోల్డెన్ అవర్) ప్రాధాన్యాన్ని దృష్టిలో ఉంచుకుని చర్యలు చేపట్టారు. అత్యవసర కేసుల్లో బాధితులను గోల్డెన్ అవర్‌లో ఆసుపత్రులకు తరలించడం 95 శాతం
దాటుతోoది. ఇక పాముకాటు బాధితులకు అంబులెన్స్ ప్రయాణ సమయాన్నే చికిత్స ప్రారంభించే అవకాశంగా మార్చడం ద్వారా గోల్డెన్ అవర్‌ను మరింత సమర్థంగా వినియోగించుకునేoదుకు వీలవుతుందని ఎన్టీఆర్ వైద్య సేవ సీఈఓ చక్రధర్ బాబు తెలిపారు. పాముకాటు బాధితుడికి ఏఎస్‌వీని ఈఎంటీ తనంతట తానుగా ఇవ్వకూడదని ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ సీఈఓ చక్రధబాబు తెలిపారు. బాధితుడి పరిస్థితిని ఈఆర్‌సీ వైద్యుడికి వివరించి.. డోమ్ కెమెరా ద్వారా వైద్యుడి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఆయన సూచన మేరకే వినియోగించాలని, ఏఎస్‌వీ ఇచ్చిన తర్వాత కూడా బాధితుడిని ఆలస్యం చేయకుండా త్వరగా సమీపంలోని ఆస్పత్రులకు తరలించాలని తెలిపారు.
Prajavartha Online Telugu News