-సాగునీటిని ప్రణాళికా బద్ధంగా వినియోగించాలి
-జిల్లా సాగునీటి సలహా మండలి సమావేశంలో ఇన్చార్జి మంత్రి కందుల దుర్గేష్
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఎల్‌నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో రైతులకు అన్ని విధాలా అండగా నిలవాలని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి కందుల దుర్గేష్ వ్యవసాయ, ఇరిగేషన్ శాఖల అధికారులకు సూచించారు.
శనివారం కలెక్టరేట్‌లోని శంకరన్ హాల్లో జిల్లా సాగునీటి సలహా మండలి సమావేశం ఇన్చార్జి మంత్రి కందుల దుర్గేష్ అధ్యక్షతన నిర్వహించారు.
ఈ సమావేశంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి, సమాచార సాంకేతిక శాఖ సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్, పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్, ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఇన్చార్జి మంత్రి మాట్లాడుతూ, ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల్లో అందుబాటులో ఉన్న నీటి వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పరిమితంగా ఉన్న నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని త్రాగునీటికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా సాగునీటిని పొదుపుగా వినియోగించేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి రైతు తప్పనిసరిగా ఈ-క్రాప్ నమోదు చేయించుకునేలా అవగాహన కల్పించాలని, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకంలో రైతులు చేరేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రకృతి వైపరీత్యాలు, వర్షాభావ పరిస్థితుల కారణంగా రైతులకు నష్టం వాటిల్లినప్పుడు పంట బీమా ద్వారా భరోసా కల్పించేందుకు ఈ-క్రాప్ నమోదు ఎంతో కీలకమని తెలిపారు. పులిచింతల ప్రాజెక్టు ద్వారా అందుబాటులో ఉన్న నీటిని వినియోగించుకునే అవకాశాలను పరిశీలించాలని అధికారులను కోరారు. అదేవిధంగా గోదావరిలో నీటి లభ్యత పెరిగినప్పుడు పట్టిసీమ ద్వారా డెల్టా ప్రాంతానికి నీటిని అందించే అవకాశాలను పరిశీలించవచ్చని తెలిపారు. నీటి లభ్యతను ముందుగానే అంచనా వేసి, రైతులకు ఇబ్బందులు లేకుండా సాగునీటి ప్రణాళికను రూపొందించాలని సూచించారు. త్రాగునీటికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి స్పష్టంగా సూచించారని సమావేశంలో మంత్రి వివరించారు. త్రాగునీటి అవసరాలను పూర్తిగా తీర్చిన అనంతరం అందుబాటులో ఉన్న నీటి మేరకు సాగునీటి అవసరాలను ప్రణాళికాబద్ధంగా తీర్చేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.
కేంద్ర మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ, ప్రస్తుత పరిస్థితుల్లో నీటి వనరుల లభ్యత, సాగునీటి అవసరాలను సమగ్రంగా పరిశీలించి రైతులకు సాధ్యమైనంత మేరకు సాగునీరు అందించే చర్యలు చేపట్టాలని సూచించారు. తక్కువ నీటి వనరులతో సమగ్ర ప్రణాళికతో రైతులకు ఎక్కువ ప్రయోజనం పొందేలా చర్యలు తీసుకోవాలన్నారు.
నీటి వనరుల లభ్యత, సాగునీటి అవసరాలు, రైతుల సమస్యలను సమగ్రంగా పరిశీలించి, ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇరిగేషన్, వ్యవసాయ శాఖల మధ్య సమన్వయంతో చర్యలు చేపట్టాలని సమావేశంలో నిర్ణయించారు.
ఈ సమావేశంలో ఇరిగేషన్ ఎస్ ఈ వెంకటరత్నం, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి పద్మావతి, సాగునీటి సంఘాల అధ్యక్షులు, రైతు నాయకులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News