-కక్ష సాధింపుతో కాలిపోయిన ఆటో… మానవత్వంతో వెలిగిన కొత్త జీవితం
-జీవనాధారాన్ని కోల్పోయిన కుటుంబానికి మళ్లీ ఉపాధి బాట చూపిన రోజా చారిటబుల్ ట్రస్ట్
నగరి, నేటి పత్రిక ప్రజావార్త :
ఒకప్పుడు ఆ ఆటోనే ఆ గిరిజన యువకుడి కుటుంబానికి జీవనాధారం… కానీ రాజకీయ కక్ష సాధింపుతో ఆ ఆటో అగ్నికి ఆహుతి కావడంతో ఒక్కసారిగా అతని బతుకు బండి ఆగిపోయింది. ఉపాధి కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ఉన్న పుత్తూరుకు చెందిన గిరిజన యువకుడు రాజాకు ఆదివాసీ దినోత్సవం సందర్భంగా మాజీ మంత్రి ఆర్కే రోజా మానవీయ హృదయంతో అండగా నిలిచారు.
రాజా కష్టాలను తెలుసుకున్న రోజా శనివారం తన నివాస కార్యాలయంలో నిర్వహించిన ఆదివాసి దినోత్సవం లో తన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కొత్త ఆటోను వితరణగా అందించారు. దీంతో కేవలం ఒక వాహనాన్ని అందించడమే కాకుండా, ఉపాధిని కోల్పోయిన ఓ గిరిజన యువకుడికి తిరిగి జీవనాధారాన్ని, ఆత్మవిశ్వాసాన్ని, భవిష్యత్తుపై భరోసాను అందించారు.
ఉపాధిని కోల్పోయి కుటుంబ పోషణ కోసం ఇబ్బందులు పడుతున్న రాజాకు ఆటో అందడంతో అతని ముఖంలో చిరునవ్వు కనిపించింది. తన కాళ్లపై తాను నిలబడి కుటుంబాన్ని పోషించుకునేందుకు మరోసారి అవకాశం లభించింది. ఈ సందర్భంగా రాజా కుటుంబ సభ్యులు రోజాకు కృతజ్ఞతలు తెలిపారు.
అధికారం ఉన్నప్పుడు సహాయం చేయడం కంటే… అధికారం లేని సమయంలోనూ బాధితుడి కన్నీటిని తుడవడం గొప్ప మానవత్వం అని స్థానికులు పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా కష్టాల్లో ఉన్నవారికి అండగా నిలవాలన్న రోజా చారిటబుల్ ట్రస్ట్ సేవా దృక్పథానికి ఈ ఘటన నిదర్శనమని కొనియాడారు.
ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఒక గిరిజన యువకుడి చేతికి ఆటో తాళాలు అందించడం ద్వారా రోజా అతనికి వాహనం మాత్రమే ఇవ్వలేదు… ఆగిపోయిన అతని జీవన ప్రయాణానికి మళ్లీ చక్రాలు తిప్పారు.
Prajavartha Online Telugu News