కోరుకొండ , నేటి పత్రిక ప్రజావార్త :
కోరుకొండ మండలం కనుపూరు గ్రామ పంచాయతీ కార్యాలయంలో పర్మనెంట్ లోక్ అదాలత్ ఫర్ పబ్లిక్ యుటిలిటీ సర్వీసెస్ (PLAPUS-ప్లాపస్) ఆధ్వర్యంలో నల్సా – శిక్షా SIKSHA 2026 (సహాయం మరియు ప్రాప్యత ద్వారా సమగ్ర సమ్మిళితం, జ్ఞానం మరియు పాఠశాల విద్య కోసం పథకం 2026, నల్సా జాగృతి – 2025 (క్షేత్రస్థాయి సమాచారం మరియు పారదర్శకత చొరవ కోసం న్యాయ అవగాహన) పథకాలపై అవగాహన కార్యక్రమంతో పాటు మధ్యవర్తిత్వం, న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పర్మనెంట్ లోక్ అదాలత్ ఫర్ పబ్లిక్ యుటిలిటీ సర్వీసెస్ చైర్మన్ సి.హెచ్. రాజగోపాల్ రావు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి శ్రీలక్ష్మి యార్లగడ్డ హాజరై ప్రజలకు న్యాయపరమైన అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పర్మనెంట్ లోక్ అదాలత్ చైర్మన్ సి.హెచ్. రాజగోపాల్ రావు మాట్లాడుతూ విద్యుత్ సరఫరా, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, వైద్య సేవలు, తపాలా, టెలిఫోన్, బ్యాంకింగ్ తదితర ప్రజా వినియోగ సేవలకు సంబంధించిన వివాదాలను పర్మనెంట్ లోక్ అదాలత్‌లో పరిష్కరించుకోవచ్చని తెలిపారు. ఇటువంటి వివాదాలను కోర్టు ఫీజు లేకుండా, ముందుగా రాజీ, సమరసత ద్వారా సత్వర పరిష్కారం పొందే అవకాశం ఉందన్నారు. ప్రజా వినియోగ సేవలకు సంబంధించిన వివాదాలను చట్టపరంగా నిర్దేశించిన పరిధి మేరకు, రూ. కోటి వరకు విలువ కలిగిన కేసులను పర్మనెంట్ లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకునే అవకాశం ఉందని తెలిపారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు సంబంధించిన ప్రజా వినియోగ సేవల వివాదాలను రాజమహేంద్రవరంలోని తూర్పు గోదావరి జిల్లా ప్రధాన న్యాయస్థాన ప్రాంగణంలో ఉన్న పర్మనెంట్ లోక్ అదాలత్ ఫర్ పబ్లిక్ యుటిలిటీ సర్వీసెస్‌లో పరిష్కరించుకోవచ్చని వివరించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి శ్రీలక్ష్మీ యార్లగడ్డ మాట్లాడుతూ నల్సా జాగృతి 2025 ద్వారా అట్టడుగు స్థాయిలో ప్రజలకు న్యాయ హక్కులు, చట్టపరమైన అంశాలపై అవగాహన కల్పించడం, న్యాయ సహాయం అందుబాటులోకి తీసుకురావడం లక్ష్యమని తెలిపారు. విద్యా హక్కు చట్టం (ఆర్ టి ఈ చట్టం 2009) సెక్షన్ 12(1)(సి) ప్రకారం ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు , బలహీన వర్గాలు , వలస కార్మికుల పిల్లలు, దివ్యాంగ పిల్లలకు పాఠశాలల్లో ప్రవేశాలు కల్పించేందుకు అవసరమైన న్యాయ సహాయం, మార్గదర్శకత్వం అందించడంపై అవగాహన కల్పిస్తున్నట్లు ఆమె తెలిపారు. ప్రజలు తమ న్యాయపరమైన సందేహాలు, సమస్యలపై ఉచిత న్యాయ సలహాలు, సూచనల కోసం టోల్‌ఫ్రీ నంబర్ 15100కు సంప్రదించవచ్చని శ్రీలక్ష్మి తెలిపారు. ఎటువంటి న్యాయ సమస్య ఎదురైనా జిల్లా న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించి ఉచిత న్యాయ సహాయం పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కనుపూరు గ్రామ పంచాయతీ కార్యదర్శి, గ్రామ ప్రజలు, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్స్, పారా లీగల్ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News