Breaking News

రూ.8.29 లక్షల ఏపీ సేవా చలానాలు పెండింగ్‌!

-రేపటిలోగా ప్రభుత్వ ఖాతాకు జమ చేయాలి
-పెండింగ్‌ ఉంచితే నిబంధనల మేరకు చర్యలు :జిల్లా GSWS అధికారి కె. రత్న కుమారి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పుగోదావరి జిల్లాలో ఏపీ సేవా (AP Seva) పోర్టల్‌కు సంబంధించిన రూ.8,29,419/- చలానా మొత్తాలు ప్రభుత్వ ఖాతాకు జమ కాకుండా పెండింగ్‌లో ఉన్నట్లు గుర్తించామని జిల్లా గ్రామ, వార్డు సచివాలయాల అధికారి (GSWS) కె. రత్న కుమారి తెలిపారు. పెండింగ్‌ మొత్తాలను అక్టోబర్ 08వ తేదీలోగా తప్పనిసరిగా ప్రభుత్వ ఖాతాకు జమ చేయాలని సంబంధిత అధికారులను, సిబ్బందిని ఆదేశించారు. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఐఏఎస్ ఆదేశాల మేరకు ఏపీ సేవా పోర్టల్‌కు సంబంధించిన చలానాల పెండింగ్ మొత్తాలపై ప్రత్యేక దృష్టి సారించి సమీక్ష చేపట్టినట్లు జిల్లా గ్రామ, వార్డు సచివాలయాల అధికారి (GSWS) కె. రత్న కుమారి తెలిపారు. ప్రభుత్వానికి జమ కావాల్సిన చలానా మొత్తాలు ఎక్కడా పెండింగ్‌లో ఉండకుండా తక్షణమే ప్రభుత్వ ఖాతాకు జమ చేయాలని, చలానాల వసూళ్లు, జమ ప్రక్రియలో పూర్తి పారదర్శకత పాటించాలని జిల్లా కలెక్టర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు ఆమె పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని సంబంధిత మండల అధికారులు, గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది పెండింగ్ మొత్తాలను అక్టోబర్ 08, 2026లోగా తప్పనిసరిగా ప్రభుత్వ ఖాతాకు జమ చేయాలని ఆదేశించినట్లు తెలిపారు.

పాత పెండింగ్‌ రూ.1.42 లక్షలు
2022 జనవరి 01 నుంచి 2025 డిసెంబర్ 31 వరకు ఏపీ సేవా పోర్టల్‌కు సంబంధించి రూ.1,42,302/- చలానా మొత్తం ప్రభుత్వానికి జమ కావాల్సి ఉండగా పెండింగ్‌లో ఉన్నట్లు తెలిపారు.

2026లో మరో రూ.6.87 లక్షలు
2026 జనవరి 01 నుంచి అక్టోబర్ 07 వరకు జనరేట్‌ అయిన చలానాల్లో రూ.6,87,117/- ప్రభుత్వ ఖాతాకు ఇంకా జమ కాలేదని పేర్కొన్నారు. దీంతో రెండు కాలాలకు కలిపి జిల్లాలో మొత్తం రూ.8,29,419/- పెండింగ్‌లో ఉన్నట్లు తెలిపారు.

రేపటిలోగా జమ చేయాలి
ఇప్పటికే చలానాలు జనరేట్‌ చేసి, సంబంధిత మొత్తాలను ప్రభుత్వ ఖాతాకు జమ చేయకుండా పెండింగ్‌లో ఉంచిన సిబ్బంది అక్టోబర్ 08లోగా పూర్తి మొత్తాన్ని రెమిట్‌ చేయాలని ఆదేశించారు. నిర్ణీత గడువులోగా మొత్తాలను జమ చేయని వారిపై నిబంధనల మేరకు తగిన శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని కె. రత్న కుమారి హెచ్చరించారు.

అదనపు వసూళ్లపై కఠిన చర్యలు
ప్రభుత్వం నిర్ణయించిన నిర్దేశిత రుసుముకు మించి ఏపీ సేవా కేంద్రాల ద్వారా ప్రజల నుంచి అదనపు మొత్తాలను వసూలు చేసినట్లు గుర్తించినా, సంబంధిత సిబ్బందిపై శాఖాపరమైన చర్యలతో పాటు నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రజలకు అందించే సేవల్లో పారదర్శకత, జవాబుదారీతనం పాటించాలని, చలానాల సొమ్మును ఎలాంటి ఆలస్యం లేకుండా ప్రభుత్వ ఖాతాకు జమ చేయాలని సంబంధిత సిబ్బందికి సూచించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలకు నాందిగా.. నగరంలో ‘స్పేస్ వాక్’

-విద్యార్థుల్లో అంతరిక్ష విజ్ఞానంపై అవగాహన పెంపొందించడమే లక్ష్యం రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాజమహేంద్రవరం నగరంలో ఈ నెల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *