-విద్యార్థుల్లో అంతరిక్ష విజ్ఞానంపై అవగాహన పెంపొందించడమే లక్ష్యం
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాజమహేంద్రవరం నగరంలో ఈ నెల 8, 9 తేదీల్లో ఇస్రో ఆధ్వర్యంలో నిర్వహించనున్న ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలకు నాందిగా బుధవారం ‘స్పేస్ వాక్’ నిర్వహించారు. ఆర్ట్స్ కళాశాల నుంచి శ్రీ వేంకటేశ్వర ఆనం కళాకేంద్రం వరకు విద్యార్థులతో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆర్. రామచంద్ర, ఆర్‌ఎంఈఈ మదర్స అలీ జెండా ఊపి ప్రారంభించారు.
వివిధ పాఠశాలలు, కళాశాలలకు చెందిన విద్యార్థులు ఉత్సాహంగా స్పేస్ వాక్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ రామచంద్ర మాట్లాడుతూ.. అంతరిక్ష విజ్ఞానం, శాస్త్ర సాంకేతిక రంగాల్లో వస్తున్న ఆధునిక మార్పులపై విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలు ఎంతో దోహదపడతాయని తెలిపారు. స్పేస్ వాక్‌లో పెద్ద సంఖ్యలో విద్యార్థులు, యువత పాల్గొనడం సంతోషదాయకమన్నారు. గురువారం నుంచి రెండు రోజుల పాటు వేంకటేశ్వర ఆనం కళాకేంద్రంలో ఇస్రో ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రాకెట్లు, అంతరిక్ష పరిశోధనలకు సంబంధించిన వివిధ పరికరాలు, నమూనాలతో ప్రదర్శన నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో విద్యార్థులు ప్రదర్శనను సందర్శించేలా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. సాధారణంగా ఇలాంటి కార్యక్రమాలను విద్యాసంస్థల పరిధిలో నిర్వహిస్తారని, అయితే రాజమహేంద్రవరంలో ప్రజల మధ్య అంతరిక్ష వారోత్సవాలను నిర్వహించడం ప్రత్యేకత అని పేర్కొన్నారు. విద్యార్థులు, యువతతో పాటు ప్రజలు కూడా ఈ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకుని అంతరిక్ష విజ్ఞానంపై అవగాహన పెంచుకోవాలని కోరారు.
శాస్త్ర సాంకేతిక, అంతరిక్ష పరిశోధన రంగాల్లో వస్తున్న అవకాశాలను విద్యార్థులు తెలుసుకుని, భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఇస్రో శాస్త్రవేత్తలు, వివిధ పాఠశాలలు, కళాశాలలకు చెందిన విద్యార్థులు, అధ్యాపకులు, ప్రజలు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News