రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు తూర్పుగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంలో మధ్యవర్తిత్వంపై రెండు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి యార్లగడ్డ శ్రీలక్ష్మి మాట్లాడుతూ, మధ్యవర్తిత్వ విధానంపై అవగాహన, నైపుణ్యాలను పెంపొందించేందుకు అక్టోబర్ 07, 08 తేదీల్లో రెండు రోజుల పాటు ఈ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తమిళనాడుకు చెందిన సీనియర్ శిక్షకురాలు సుదర్శన సుందర్ శిక్షణను అందిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఐదు గ్రామాల్లో మధ్యవర్తుల ఎంపిక
‘తగాదాలు లేని గ్రామీణ భారతదేశం’ కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఐదు గ్రామాలను గుర్తించినట్లు శ్రీమతి యార్లగడ్డ శ్రీలక్ష్మి తెలిపారు. కోరుకొండ మండలంలోని శ్రీరంగాపట్నం, అమలాపురం మండలంలోని ఇమ్మిడివరప్పాడు, పెద్దాపురం మండలంలోని మర్లావ, కాకినాడ జిల్లా పరిధిలోని రామేశ్వరం, పిఠాపురం మండలంలోని గోకివాడ గ్రామాలను ఇందుకోసం ఎంపిక చేసినట్లు చెప్పారు. ప్రతి గ్రామం నుంచి స్థానికంగా ముగ్గురు మధ్యవర్తులను గుర్తించినట్లు తెలిపారు. గ్రామాల్లో తలెత్తే చిన్నచిన్న తగాదాలను న్యాయస్థానాలను ఆశ్రయించకుండానే పరస్పర అంగీకారంతో పరిష్కరించేందుకు వీరికి మొదటి రోజు శిక్షణ అందిస్తున్నట్లు వివరించారు.
మధ్యవర్తిత్వంపై నైపుణ్య శిక్షణ
రెండో రోజు అక్టోబర్ 08న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన శిక్షణ పొందిన మధ్యవర్తులకు మధ్యవర్తిత్వ ప్రక్రియలో అనుసరించాల్సిన విధానాలు, సమస్యలను పరిష్కరించే పద్ధతులు, ఇరుపక్షాల మధ్య సయోధ్య సాధించే అంశాలపై ప్రత్యేక శిక్షణ అందించనున్నట్లు తెలిపారు.
గ్రామస్థాయిలోనే తగాదాల పరిష్కారం
గ్రామీణ ప్రాంతాల్లో తలెత్తే తగాదాలను గ్రామ స్థాయిలోనే సామరస్య పూర్వకంగా పరిష్కరించడం, తద్వారా గ్రామాలను వ్యాజ్య రహితంగా తీర్చిదిద్దడం మధ్యవర్తిత్వ ప్రధాన ఉద్దేశమని యార్లగడ్డ శ్రీలక్ష్మి తెలిపారు. మధ్యవర్తిత్వ ప్రక్రియ పూర్తిగా స్వచ్ఛందంగా, గోప్యంగా, సుహృద్భావ వాతావరణంలో కొనసాగుతుందని చెప్పారు. మధ్యవర్తులు ఇరువర్గాలతో విడివిడిగా, ఉమ్మడిగా చర్చలు నిర్వహించి వారి సమస్యలను అర్థం చేసుకుని, పరస్పర అంగీకారంతో పరిష్కార మార్గాన్ని చూపుతారని తెలిపారు. దీనివల్ల న్యాయస్థానాల్లో వ్యాజ్యాల సంఖ్య తగ్గడంతో పాటు, సమయం, ఖర్చు ఆదా అవుతుందని పేర్కొన్నారు. ఈ శిక్షణ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది పి. శ్రీనివాసరావు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News