Breaking News

రాష్ట్రాన్ని పచ్చదనంతో సస్యశ్యామలం చేద్దాం

-హరిత ఆంధ్రప్రదేశ్‌ నిర్మాణానికి కడియం నర్సరీ రైతుల భాగస్వామ్యం ఎంతో కీలకం
– ⁠రాష్ట్రాన్ని హరితాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దడమే సీఎం, డిప్యూటీ సీఎం ధ్యేయం
– నర్సరీ రైతులకు స్థిరమైన మార్కెట్‌ అవకాశాలు కల్పిస్తాం.
-పర్యావరణ పరిరక్షణకు పచ్చదనం పెంపు మరింత కీలకం
– కడియంలోని సర్‌ ఆర్థర్‌ కాటన్‌ నర్సరీ ఫార్మర్స్‌ అసోసియేషన్‌ రైతుల సమావేశంలో ఏపీ గ్రీన్‌ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ ఛైర్మన్‌ నాగబాబు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రాన్ని గ్రీన్‌ ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ ప్రత్యేక దృష్టితో కృషి చేస్తున్నారని ఏపీ గ్రీన్‌ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ ఛైర్మన్‌  నాగబాబు  పేర్కొన్నారు. రాష్ట్రంలో 50 శాతం గ్రీన్‌ కవర్‌ సాధించాలనే లక్ష్యాన్ని చేరుకోవాలంటే కడియం నర్సరీ రైతులతోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రతి రైతు భాగస్వామ్యం, సహకారం ఎంతో అవసరమన్నారు. తూర్పుగోదావరి జిల్లా కడియపులంకలో బుధవారం సర్‌ ఆర్థర్‌ కాటన్‌ నర్సరీ ఫార్మర్స్‌ అసోసియేషన్‌ రైతులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో చేపట్టనున్న భారీ స్థాయి మొక్కల పెంపకం, సేకరణ కార్యక్రమాలపై నర్సరీ రైతులతో చర్చించారు.
ఈ సందర్భంగా శ్రీ నాగబాబు గారు మాట్లాడుతూ “2026–27 ఆర్థిక సంవత్సరంలో సుమారు 10 కోట్ల మొక్కలను నర్సరీల్లో సిద్ధం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 500 నుంచి 1,000 నర్సరీల వరకు అవసరమవుతాయి. ప్రభుత్వం కొన్ని నర్సరీలను ఏర్పాటు చేస్తున్నప్పటికీ, ఇంత భారీ స్థాయిలో మొక్కలను అందుబాటులోకి తీసుకురావాలంటే కడియంతో పాటు రాష్ట్రంలోని నర్సరీ రైతులందరి భాగస్వామ్యం అత్యంత కీలకం. రాష్ట్రవ్యాప్తంగా పచ్చదనం పెంపునకు ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తుంది. పట్టణాలు, రహదారులు, ప్రభుత్వ కార్యాలయాల ప్రాంగణాలతోపాటు ప్రభుత్వ శాఖల పరిధిలోని ఖాళీ స్థలాలను గుర్తించి విస్తృతంగా మొక్కలు నాటే కార్యక్రమాలను చేపడుతున్నాం. పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ భూములు, పట్టణాల్లోని ఓపెన్‌ స్పేస్‌లను సైతం హరిత ప్రాంతాలుగా అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నాం.  రైతులకు నష్టం లేకుండా మొక్కల కొనుగోలు భారీ స్థాయిలో మొక్కల సేకరణలో భాగంగా నర్సరీ రైతులకు కూడా మేలు జరిగేలా చర్యలు తీసుకుంటాం. అధిక ధరలు విధించకుండా, అదే సమయంలో నర్సరీ రైతులకు నష్టం కలగకుండా మొక్కలను అందించేందుకు సహకరించాలి. ప్రభుత్వం చేపట్టే హరిత కార్యక్రమాల్లో నర్సరీ రైతులను భాగస్వాములను చేయడం ద్వారా వారికి స్థిరమైన మార్కెట్‌ అవకాశాలు కల్పిస్తాం.  పచ్చదనంతో సస్యశ్యామలం చేయడమే లక్ష్యం
ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షపాతం తగ్గుతున్న పరిస్థితుల్లో పర్యావరణ పరిరక్షణకు పచ్చదనం పెంపు మరింత కీలకమైంది. ఏపీ గ్రీన్ నిర్దేశించిన లక్ష్యాలను సమష్టి కృషితో సాధించగలిగితే ఆంధ్రప్రదేశ్‌ను పచ్చదనంతో సస్యశ్యామలమైన రాష్ట్రంగా తీర్చిదిద్దవచ్చ”న్నారు. అనంతరం కడియం నర్సరీ రైతులు మాట్లాడుతూ… రాష్ట్ర హరిత కార్యక్రమాలకు తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు.  మహా పుష్కర నగరవనాన్ని సందర్శించిన  నాగబాబు
కడియపులంక పర్యటనకు ముందు  నాగబాబు రాజమహేంద్రవరంలోని గోదావరి మహాపుష్కర నగరవనాన్ని సందర్శించారు. నగరవనంలో కలియ తిరిగి అక్కడి పచ్చదనం, మొక్కల పెంపకం, వన సంరక్షణ చర్యలను పరిశీలించారు. ఈ సందర్భంగా నగరవనంలో రుద్రాక్ష మొక్కలతోపాటు అత్యంత అరుదైన అండమాన్‌ పడాక్‌ మొక్కలను స్వయంగా నాటారు.
పలు నర్సరీలను పరిశీలించిన  నాగబాబు
కడియపులంకలోని సత్యదేవ నర్సరీతో పాటు పలు నర్సరీలను  నాగబాబు  పరిశీలించారు. నర్సరీల్లో అందుబాటులో ఉన్న వివిధ రకాల మొక్కలు, వాటి నాణ్యత, ధరలను తెలుసుకున్నారు. నర్సరీల నిర్వాహకులతో మాట్లాడి మొక్కల ఉత్పత్తి, సరఫరా, డిమాండ్‌, ధరలకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. రైతుల కోరిక మేరకు అరుదైన బ్లాక్‌ వేప మొక్కను నాటారు. అనంతరం ఒకటి నుంచి మూడు సంవత్సరాల వయసు కలిగిన స్థానిక మొక్కలను పరిశీలించి, వాటి పెరుగుదల, నాణ్యతపై వివరాలు తెలుసుకున్నారు. అలాగే మలేషియా గ్రీన్‌ కొబ్బరి బొండాన్ని రుచి చూశారు. బనానా మ్యాంగో వివరాలు అడిగి తెలుసుకున్నారు. నర్సరీల్లో పనిచేస్తున్న మహిళా సిబ్బందితో నాగబాబు  కాసేపు ముచ్చటించి, వారి పని, ఉపాధి అవకాశాల గురించి తెలుసుకున్నారు. అనంతరం వారితో కలిసి ఫొటో దిగారు. ఈ కార్యక్రమంలో ఏపీ గ్రీన్ కమిషనర్, సీఈవో శ్రీ బిఎన్ఎన్ మూర్తి, తూర్పుగోదావరి జిల్లా డిఎఫ్ఓ  ప్రభాకరరావు, రీసెర్చ్ డిఎఫ్ఓ శ్రీ శ్రీనివాస్, ఎఫ్ఆర్ఓ  దావీద్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలకు నాందిగా.. నగరంలో ‘స్పేస్ వాక్’

-విద్యార్థుల్లో అంతరిక్ష విజ్ఞానంపై అవగాహన పెంపొందించడమే లక్ష్యం రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాజమహేంద్రవరం నగరంలో ఈ నెల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *