విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ–2026 ప్రక్రియలో భాగంగా ఎన్యుమరేషన్ ప్రక్రియను బూత్ స్థాయి అధికారులు 2026 జూన్ 15వ తేదీ నుంచి జూలై 24వ తేదీ వరకు ఇంటింటి సందర్శన ద్వారా నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ తెలిపారు. ఈ ప్రక్రియలో జిల్లాలో మొత్తం 1,23,714 మంది ఓటర్లు ఎ.ఎస్.డి.డి (Absent.. అందుబాటులో లేని వారు, Shifted – వేరే ప్రాంతానికి తరలిపోయిన వారు, Dead – మరణించిన వారు, Duplicate – ఒకటి కంటే ఎక్కువసార్లు నమోదైన వారు) జాబితాలో ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. అనంతరం జూలై 31,2026న ప్రచురించిన ముసాయిదా ఓటర్ల జాబితాలో జిల్లాలో మొత్తం 15,89,731 మంది ఓటర్లు నమోదై ఉన్నారని పేర్కొన్నారు. తదుపరి నోటీసుల ప్రక్రియలో భాగంగా అక్టోబర్ 6, 2026 వరకు మరో 12,786 మంది అనర్హులుగా గుర్తించినట్లు తెలిపారు. ఈ వివరాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని అక్టోబర్ 16,2026న తుది ఓటర్ల జాబితా ప్రచురించనున్నట్లు జిల్లా కలెక్టర్ వెల్లడించారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అర్హత కలిగిన ఒక్క వ్యక్తి కూడా ఓటరుగా నమోదు కాకుండా మిగిలిపోకూడదనే ఉద్దేశంతో ఎ.ఎస్.డి.డి జాబితాపై మరోసారి ఇంటింటి పరిశీలన నిర్వహించడంతో పాటు, కొత్త ఓటర్ల నమోదుకు మరియు ఓటర్ల జాబితాలో పేరు లేని అర్హులైన వ్యక్తులను గుర్తించి ఓటర్లుగా నమోదు చేయడానికి చర్యలు చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ మేరకు అక్టోబర్ 8,2026 నుంచి బూత్ స్థాయి అధికారులు ఎ.ఎస్.డి.డి జాబితాలోని తొలగించబడిన పేర్లకు సంబంధించి మరోసారి ఇంటింటి సందర్శన చేపడతారని తెలిపారు. పరిశీలనలో ఎవరైనా పొరపాటున ఓటర్ల జాబితా నుంచి తొలగించబడినట్లు తేలితే, వారి నుంచి వెంటనే ఫారం–6 ద్వారా ఓటరుగా నమోదు కోసం దరఖాస్తు స్వీకరించి, నిరంతర ఓటర్ల జాబితా నవీకరణ ప్రక్రియలో భాగంగా వారికి ఓటు హక్కు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఓటర్ల జాబితా నిరంతర నవీకరణ ప్రక్రియను ప్రతి సంవత్సరం జనవరి 1, ఏప్రిల్ 1, జూలై 1 మరియు అక్టోబర్ 1 తేదీలను అర్హత తేదీలుగా పరిగణిస్తూ నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. తుది ఓటర్ల జాబితాలో పేరు లేని అర్హులైన పౌరులు తమ అర్హతకు సంబంధించిన పత్రాలతో ఫారం–6 ద్వారా దరఖాస్తు చేసుకుని ఓటరుగా నమోదు చేసుకోవచ్చని ఆయన సూచించారు. అర్హత కలిగిన ప్రతి పౌరుడు ఓటరుగా నమోదు చేసుకుని తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ డా.జి.లక్ష్మీశ కోరారు.
Prajavartha Online Telugu News