గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగర శివారుప్రాంతాలను అధిక ప్రాధాన్యతతో అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, స్వర్ణాంధ్ర నగర్ బుడగ జంగాల కాలని ప్రాంతాల్లో రూ.1.60 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని నగర కమిషనర్ కీర్తి చేకూరి ఐఏయస్ తెలిపారు. శుక్రవారం నగరపాలక సంస్థ పరిధిలోని స్వర్ణాంధ్ర నగర్ బుడగ జంగాల కాలనిలోని కాటిపాపల సమస్యలపై ఎం.ఎల్.ఏ. మేకతోటి సుచరితతో కలిసి తురకపాలెం రోడ్ లోని దబ్బూరి కన్వెన్షన్ హాల్లో అధికారులతో కలిసి సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా స్థానిక కార్పొరేటర్ ఏరువ సాంబిరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో కమిషనర్ మాట్లాడుతూ నగరపాలక సంస్థ పరిధిలో ప్రతి ప్రాంతం అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ మేరకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. అలాగే స్థానికంగా ప్రజల అవసరాల మేరకు ఎంఎల్ఏ, కార్పొరేటర్ల నుండి అందిన సూచనల మేరకు పలు అభివృద్ధి పనులకు ఆమోదం తెలిపామన్నారు. స్వర్ణాంధ్ర నగర్, జన్మభూమి నగర్ ప్రాంతాల్లో ఇప్పటికే రూ.1 కోటి నిధులతో సిసి రోడ్లు, డ్రైన్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయని, ఒక్కో భవనంకు రూ.30 లక్షల అంచనాలతో బిసి, ఎస్.సి కమ్యూనిటి హాల్స్ నిర్మాణ పనులు కూడా జరుగుతున్నాయన్నారు. విలీన గ్రామాల్లో త్రాగునీటి సమస్య తీర్చేలా గోరంట్ల కొండ మీద రిజర్వాయర్ పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. ప్రస్తుతం బుడగ జంగాల కాలనిలో ప్రజల కోరిక మేరకు స్థానికంగా ఉన్న స్కూల్ పరిసరాల్లో ఉన్న స్థలాన్ని వెంటనే మెరక చేయడానికి చర్యలు తీసుకుంటామని, వీధి దీపాల ఏర్పాటుకు డిమాండ్ సిద్దం చేయాలని ఈ.ఈ.ని ఆదేశిస్తున్నామన్నారు. స్తంభాల గరువు రిజర్వాయర్ మరమత్తులు జరుగుతున్నాయని, రానున్న వేసవి లోపు సరిపడా త్రాగునీరు అందించడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆధార్ నంబర్ కు వారివి కాని ఆస్తులు లింక్ అవ్వడం వలన ప్రభుత్వ పధకాలకు అనర్హులు అవుతున్నామని తెలిపారని, అందుబాటులోని వార్డ్ సచివాలయంలో అర్జీలు ఇస్తే వాటిని పరిశీలించి, ఆధార్ లింక్ తొలగించడానికి ప్రభుత్వానికి పంపుతామన్నారు. స్థానిక ప్రజలు కూడా తమ పిల్లలకు చిన్న వయసులో వివాహాలు చేయకుండా ఉన్నతంగా చదివించాలని, వారు ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు.
ఎంఎల్ఏ మాట్లాడుతూ ఎన్నికల ముందు స్వర్ణాంధ్ర నగర్ తదితర ప్రాంతాలు వర్షం పడితే కనీసం నడవడానికి కూడా వీలులేని విధంగా ఉండేదని, ప్రస్తుతం సిసి రోడ్లు, డ్రైన్లతో అభివృద్ధి జరిగిందన్నారు. విలీన గ్రామాల్లో అనేక ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న సమస్యలు కూడా వేగంగా పరిష్కారం అవుతున్నాయని, ప్రాధాన్యత క్రమంలో ప్రతి ప్రాంతంలో సిసి రోడ్లు, డ్రైన్లు నిర్మాణాలు జరుగుతున్నాయన్నారు. నగరంలో ఉంటూ కూడా తమ ఆచార వ్యవహారాలు తూచ తప్పకుండా పాటించే కాటిపాపల సమస్యలు పరిష్కారానికి అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారన్నారు. ముఖ్యమంత్రి పిల్లల చదువుకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని, ప్రతి ఒక్కరూ చిన్న వయసులోనే తమ పిల్లలకు వివాహాలు చేయకుండా ఉన్నత చదువులు చదివించాలన్నారు. కుల వృత్తులు చేయడం తప్పు లేదు కాని చదువు కూడా వారి భవిష్యత్ ఉన్నతికి ఎంతో కీలకమన్నారు.
సమావేశంలో నగరపాలక సంస్థ ఈ.ఈ.లు శాంతిరాజు, కొండారెడ్డి, ఏసిపి బాబురావు, ఏడిహెచ్ రామారావు, గుంటూరు రూరల్ జెడ్.పి.టి.సి. తుమ్మల సుబ్బారావు, ఆర్ అండ్ బి కార్పోరేషన్ డైరెక్టర్ పిల్లి మేరి, కార్పొరేటర్ చల్లా రాజ్యలక్ష్మి, డి.ఈ.ఈ.లు శివకుమార్, కళ్యాణరావు, డిఎస్ఓ ప్రసాద్, తహసిల్దార్ సాంబశివరావు, టిపిఎస్ గోవర్ధన్, ఆర్.ఓ. బాలాజీ బాష, ఏ.ఈ.లు రాము, రవికిరణ్, నాగవేణి, లు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News