-ఒక్కో కిట్లో 6 రకాల మందులు
-మందులు వాడే విధానాన్ని వివరిస్తూ కరపత్రాలు
-వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు వెల్లడి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
తుపాను, భారీ వర్షాలు, వరదల కారణంగా ముంపునకు గురైన విజయవాడ నగరంలోని పలు ప్రాంతాల్లో దాదాపు 75,000 అత్యవసర మందుల కిట్ల పంపిణీకి వైద్య ఆరోగ్య శాఖ అన్ని ఏర్పాట్లూ చేసిందని ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు ఒక ప్రకటనలో తెలిపారు. గన్నవరం ఎయిర్ పోర్టు నుండి ఫుడ్ ప్యాకెట్లతో పాటు కొన్ని అత్యవసర మెడికల్ కిట్లను హెలీకాప్టర్ ద్వారా అధికారులు పంపించారన్నారు. నగరంలో ఏర్పాటు చేసిన 14 మెడికల్ రిలీఫ్ క్యాంపులకు అత్యవసర మందుల కిట్లను అధికారులు చేరవేశారన్నారు. అలాగే మరికొన్ని కిట్లను 10 మొబైల్ మెడికల్ వాహనాల(ఎంఎంయులు) ద్వారా చేరవేశారన్నారు. ఎపిఎంఎస్ ఐడిసి నుండి 50,000 కిట్లు, డ్రగ్ కంట్రోల్ విభాగం నుండి 25,000 కిట్లు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. మెడికల్ రిలీఫ్ క్యాంపుల్లో 24 గంటలూ వైద్య సేవలందించేందుకు డాక్టర్లు, సిబ్బందితో పాటు సరిపడా మందుల్ని అందుబాటులో ఉంచామన్నామన్నారు. అత్యవసర మందుల కిట్‌లో ఆరు రకాల మందులతో పాటు ఎలా వాడాలన్న వివరాలతో కరపత్రాల్ని కూడా ఉంచామన్నారు. పారిశుధ్యం, నీటి కాలుష్యం వల్ల సంభవించే జ్వరం, జలుబు, వాంతులు, విరేచనాలు వంటి ఆనారోగ్య సమస్యలకు ఏయే మందులు ఎలా వేసుకోవాలో కరపత్రాల్లో వివరించారన్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, వికలాంగుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలిచ్చామన్నారు. మొత్తం 75,000 అత్యవసర మందుల కిట్లను బాక్సుల్లో పెట్టి పంపిణీకి సిద్ధం చేశామన్నారు. 10 వేల అత్యవసర మెడికల్ కిట్లను హెలీకాప్టర్ ద్వారా బాధితులకు అందించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. మిగతా 65,000 కిట్లను ఎపిఎంఎస్ ఐడిసి, డ్రగ్ కంట్రోల్ విభాగం వాహనాల ద్వారా గమ్యస్థానాలకు చేర్చేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. బోట్ల ద్వారా ఫుడ్ ప్యాకెట్లతో పాటు బాధితులకు అత్యవసర మందుల కిట్లను పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. ఆరోగ్య సమస్యల విషయంలో బాధితులు ఎలాంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదని, రేయింబవళ్లూ వలందించేందుకు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలిచ్చామన్నారు. వైద్య ఆరోగ్య శాఖ ఎప్పటికప్పుడు జారీ చేసే సూచనలు, సలహాల్ని బాధితులు పాటించాలని కృష్ణబాబు కోరారు. ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ సి.హరికిరణ్, ఎపిఎంఎస్ ఐడిసి మేనేజింగ్ డైరెక్టర్ మరియు డ్రగ్స్ కంట్రోల్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ జి.లక్ష్మీషా, సెకండరీ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ ఎ.సిరి అత్యవసర మందుల పంపిణీని పర్యవేక్షించారు.