విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రభ కాలనీలోని ఎమ్మెల్యే కార్యాలయంలో శాసనసభ్యులు మల్లాది విష్ణు ని ఆంధ్రప్రదేశ్ దళిత, గిరిజన, బహుజన క్రైస్తవ ఐక్య కార్యాచరణ కమిటీ సభ్యులు కలిసారు. దళితులు, గిరిజనులు ఏ మతంలోనైనా చేరే స్వేచ్ఛను కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రయత్నం చేయాలని కమిటీ సభ్యులు విన్నవించారు. 1950 లో తీసుకువచ్చిన ప్రెసిడెన్షియల్ ఆర్డర్ పేరా 3ను సవరించేలా అసెంబ్లీ తీర్మానం చేయడంతో పాటు తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్రపతికి పంపాలని వినతిపత్రం అందజేసారు. తమ విన్నపాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లేలా ప్రయత్నం చేయవలసిందిగా శాసనసభ్యులను కమిటీ సభ్యులు కోరారు. సానుకూలంగా స్పందించిన మల్లాది విష్ణు సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళతామని హామీనిచ్చారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో ఏ ఒక్క సామాజికవర్గానికి అన్యాయం జరగదని చెప్పడంతో కమిటీ సభ్యులు హర్షం వ్యక్తం చేసారు. ఎమ్మెల్యే ని కలిసిన వారిలో అన్నవరపు నాగేశ్వరరావు, లాము జయబాబు, కోట జయరాజు, పీతల శ్యామ్ కుమార్, కాసాని గణేష్ బాబు తదితరులు ఉన్నారు.
