రూ.41 వేల కోట్లు అవకతవకలు జరిగాయన్న పిఏసి ఛైర్మన్ ఆరోపణలు అవాస్తవం… : మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్

-అత్యుత్సాహం సరికాదు.. సరైన సమాచారంతో ఆరోపణలు చేస్తే బాగుంటుంది…
-ప్రజలను అయోమయానికి గురిచేయడం ప్రతిపక్షాలకు తగదు…
-ఈ ప్రభుత్వం సంక్షేమ పథకాల కింద రూ. లక్ష కోట్లు ప్రజల బ్యాంకు ఖాతాలకు నేరుగా జమచేశాం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వంలో రూ. 41 వేల కోట్ల రూపాయలు అవకతవకలు జరిగాయనే ఆరోపణలు అవాస్తవం అని ఇందుకు సంబంధించి అన్ని ఆధారాలు ఉన్నాయని అవాస్తవాలను ప్రచారం చేయడం పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఛైర్మనక్కు తగదని రాష్ట్ర ఆర్థిక శాఖా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తెలిపారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చేసిన ఆరోపణలపై వివరించేందుకు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ మంగళవారం విజయవాడలోని ఆర్ అండ్ బి భవన సముదాయంలో మీడియా ప్రతినిధుల సమావేశాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రూ. 41 వేల కోట్ల రూపాయలు అవకతవకలకు పాల్పడిందని ప్రతిపక్షం అత్యుత్సాహంతో ఆరోపణలు చేయడం హాస్యాస్పదం అన్నారు. చిన్న అవకతవకలకే స్పందించే వ్యవస్థలు ఉండగా ఇంత భారీమొత్తంలో అవకతవకలకు పాల్పడితే ఎలా స్పందించకుండా ఉంటాయని మంత్రి ప్రశ్నించారు. ప్రతీ చిన్నవిషయంలోనూ మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు స్పందించేవారని ఈసారి పిఏసి ఛైర్మన్ పయ్యావుల కేశవ్ ఆరోపణలు చేయడంలో ఆంతర్యంను ప్రజలు తెలుసుకోవాలన్నారు. ప్రభుత్వం 10161 బిల్లుల ద్వారా రూ. 41 వేల కోట్లు వ్యయం చేయడం జరిగిందని, దీనికి సంబంధించి అన్ని ఆధారాలు ఉన్నాయన్నారు. ఇందులో రూ. 10895 కోట్లు పెడి ఖాతాకు చెల్లించామని, కేంద్ర ప్రాయోజిత పధకాల కోసం 2020-21వ సంవత్సరంలో ఈమళ్లింపు చేసినట్లు మంత్రి వివరించారు. 2019-20లో రూ. 20899 కోట్లు, 2020-21వ సంవత్సరంలో రూ. 8869 కోట్లు కార్పోరేషన్కు నిధులు చెల్లించామన్నారు. రూ. 2728 కోట్లు ఇ-కుబేర్ ద్వారా చెల్లిస్తే కుదరక మళ్లీ ఆర్టిజియస్ ద్వారా చెల్లించినట్లు తెలిపారు. ఈచెల్లింపులకు సంబంధించి రూ. 8 లక్షల వ్యయం నుండి ప్రతిదానికీ ప్రభుత్వం వద్ద లెక్కలు ఉన్నాయని అవకతవకలకు తావు లేదన్నారు. ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేలా ఇటువంటి ఆరోపణలు చేయడం ప్రతిపక్షాలకు తగదని మంత్రి అన్నారు. ఈ సమస్యకు సియయంయస్ వ్యవస్థ కారణమన్నారు. సియయంయస్ ద్వారా చెల్లింపులు అన్నీ కేంద్రీకృతం కావడమేనన్నారు. సియ యంయస్ వ్యవస్థను గత ప్రభుత్వం 2018లో ప్రవేశ పెట్టి నిర్వహణ బాధ్యతలను ప్రైవేట్ వ్యక్తి చేతికి అప్పగించారన్నారు. సియయంయలో ఉన్న లోపాలను తమ ప్రభుత్వం ఎప్పటికప్పుడు సరిచేస్తున్నప్పటికీ కొన్ని సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. కోవిడ్ కారణంగా గత ఏడాది నుండి ఆర్ధిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రజలు ఇబ్బంది కలగకుండా చూడాలని ప్రతీ సంక్షేమ కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేస్తూ ఏపి ప్రభుత్వం ఉత్తమ పనితీరును కనబరిచిందన్నారు. గత ప్రభుత్వం అమలు చేసిన పధకాలకు సంబంధించి అన్ని బకాయిలను తమ ప్రభుత్వం చెల్లించిందన్నారు. గత రెండు సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాల ద్వారా రూ. లక్ష కోట్ల రూపాయలు నేరుగా రైతులు, మహిళలు, విద్యార్థుల ఖాతాలో సంక్షేమ నిధులు జమచేశామని మంత్రి వివరించారు. ప్రభుత్వ పరిపాలనలో సామాన్యులకు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసేందుకు రుణాలు తీసుకోవాల్సివస్తుందన్నారు. దేశంలో కేంద్ర ప్రభుత్వంతో పాటు అన్ని రాష్ట్రాలు ఇదే విధానాన్ని అవలంభిస్తాయని అప్పు చేయడమనేది కేవలం మన రాష్ట్రమే చేసింది కాదనేది ప్రతిపక్షాలు గుర్తె రెగాలన్నారు. 2019-20 లో రూ. 45 వేల 645 కోట్ల రూపాయలు, 2020-21లో రూ. 5602 కోట్లు రుణంగా తీసుకోవడం జరిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వం పరిమితులకు లోబడే రాష్ట్ర ప్రభుత్వం రుణాల ను తీసుకోవడం జరిగిందని మంత్రి వివరించారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తిని పరిగణనలోనికి తీసుకుని రాష్ట్రం రుణం తీసుకునే అవకాశం ఉందని, పరిమితికి మించి రుణం తీసుకోలేదని మంత్రి అన్నారు. గత ప్రభుత్వం కోట్లాది రూపాయలు రుణాలు చేసి ఏఒక్క సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయకపోగా ఒక్క పరిశ్రమను కూడా స్థాపించకుండా కాలయాపన చేసి ప్రజలను మభ్యపెట్టారన్నారు. డేటా ఎంట్రీ లోపం కారణంగా పొరుగురాష్ట్రం వాటాపై కూడా మన ప్రభుత్వం అప్పులు తీసుకున్నట్లు చూపించారని ఇందులో ఎటువంటి వాస్తవం లేదని, దీనికి సంబంధించి పూర్తి ఆధారాలు ప్రభుత్వం వద్ద ఉన్నాయని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు.

Check Also

చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కి కోటి విరాళం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ (CMRF) కోసం శశి విద్యా సంస్థల చైర్మన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *