-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత
-రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ సీట్లు కేటాయింపు
-దేవస్థాన పాలక మండళ్లలో సభ్యులుగా అవకాశం
-త్వరలో గుడికట్ల పూజారులకు గౌరవ వేతనాలు
-విద్యతోనే కురుబలు శాసించే స్థాయికి… : మంత్రి సవిత
-కుప్పం కోడెళ్ల రాయస్వామి ఉత్సవంలో పాల్గొన్న మంత్రి సవిత
-ఆలయంలో ప్రత్యేక పూజలు
కుప్పం/చిత్తూరు, నేటి పత్రిక ప్రజావార్త :
టీడీపీతోనే కురుబలకు రాజకీయ ప్రాధాన్యం లభిస్తోందని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు పలు దేవస్థాన బోర్డు సభ్యులగానూ కురుబలకు అవకాశమివ్వనున్నట్లు తెలిపారు. చిత్తూరు జిల్లా కుప్పం మండలం కేంద్రంలో జరుగుతున్న కోడెళ్ల రాయస్వామి ఉత్సవంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆమె ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మంత్రి సవిత మాట్లాడుతూ, కోడెళ్ల రాయస్వామి ఉత్సవంలో పాల్గొనడం తన అదృష్టమన్నారు. గతేడాది జరిగిన ఉత్సవాల్లో సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పాల్గోన్న విషయాన్ని ఆమె గుర్తు చేశారు. సీఎం చంద్రబాబునాయుడు నిధులు మంజూరు చేసి, ఆలయ అభివృద్ధితో పాటు మౌలిక సదుపాయల కల్పించారన్నారు. కురుబల తరఫున సీఎం చంద్రబాబుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో ప్రాధాన్యం…
టీడీపీ ఆవిర్భావం నుంచి కురుబలకు రాజకీయ ప్రాధాన్యమిస్తోందని మంత్రి సవిత తెలిపారు. 2014 సాధారణ ఎన్నికల్లోనూ కురుబలకు రెండు ఎంపీలు, ఒక ఎమ్మెల్యేగా సీట్లు ఇచ్చి గెలిపించుకున్నారన్నారు. కురుబ సామాజిక వర్గానికి చెందిన తనకు బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా అవకాశమిచ్చి ప్రోత్సాహిస్తున్నారన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కురుబల అధికంగా ఉన్నచోట్ల టీడీపీ తరఫున ఎన్నికల బరిలో దింపనున్నట్లు తెలిపారు. పలు దేవస్థాన బోర్డుల్లోనూ కురుబలకు సభ్యులుగా అవకాశమివ్వనున్నట్లు సీఎం చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారన్నారు. ఇలా అన్నింటా కురుబలకు టీడీపీ ప్రోత్సాహంతో రాజకీయ ప్రాధాన్యం లభిస్తోందన్నారు. గుడికట్ల పూజారులకు త్వరలోనే గౌరవ వేతనాలు అందించనున్నామన్నారు. గుడి కట్ల దేవాలయాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి సవిత వెల్లడించారు.
విద్యతోనే శాసించే స్థాయికి…
విద్యతోనే అన్ని రంగాల్లోనూ ముందంజ వేయొచ్చునని, శాసించే స్థాయికి చేరుకోవొచ్చునని మంత్రి సవిత తెలిపారు. కురబలు తమ బిడ్డలకు ఉన్నత విద్య చదివించేలా కృషి చేయాలన్నారు. రాష్ట్ర ఐటీ, విద్య శాఖ మంత్రి నారా లోకేశ్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో విద్యా వ్యవస్థల్లో ఎన్నో సంస్కరణలు తీసుకొస్తున్నారన్నారు. పేదలు, బీసీల విద్య కోసం అధిక నిధులు కేటాయిస్తున్నారన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో విద్యలో కురుబల రాణించాలని మంత్రి సవిత పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రి సవిత వెంట ఎమ్మెల్సీ శ్రీకాంత్, కురబ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మల్లికార్జున. ఇతర కురుబ సామాజిక ప్రతినిధులు, వర్గీయులు అదిక సంఖ్యలో ఉన్నారు.
Prajavartha Online Telugu News