-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నోటీసులు అందిన ఓటర్లు మీ ఓటును పరిరక్షించుకోవాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ–2026 (SIR-2026)లో భాగంగా బుధవారం ఉదయం శాఖాధిపతులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ నగర పరిధిలో గల ఇంటింటి ఓటర్ల వెరిఫికేషన్ ప్రక్రియ విజయవంతంగా పూర్తయిందని డెప్యూటీ జిల్లా ఎన్నికల అధికారి, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ తెలిపారు. ఈ ప్రక్రియలో భాగంగా రూపొందించిన ముసాయిదా ఓటర్ల జాబితా ప్రస్తుతం పరిధిలోని అన్ని పోలింగ్ కేంద్రాలతో పాటు AERO కార్యాలయాల్లో ప్రజల పరిశీలనకు అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు.
SIR-2002 మరియు SIR-2026 ఓటర్ల జాబితాల్లో పేర్లకు సంబంధించి చిన్నపాటి వ్యత్యాసాలు ఉన్న ఓటర్లకు, అలాగే గత SIR-2002లో సంబంధిత ఓటరు లేదా వారి కుటుంబ సభ్యులు ఓటరుగా నమోదు కాని సందర్భాల్లో కూడా BLOల ద్వారా నోటీసులు జారీ చేయనున్నట్లు తెలిపారు.
నోటీసులు అందుకున్న సంబంధిత ఓటర్లు నోటీసులో పేర్కొన్న తేదీ, సమయం మరియు వేదికకు తప్పనిసరిగా హాజరై, నోటీసు వెనుక భాగంలో సూచించిన సంబంధిత పత్రాలను సమర్పించాలని సూచించారు. ఈ ప్రక్రియ ద్వారా తమ ఓటు హక్కును పరిరక్షించుకోవచ్చని తెలిపారు.
ఓటర్ల జాబితాకు సంబంధించి ప్రజలకు ఏవైనా సందేహాలు లేదా అనుమానాలు ఉన్నట్లయితే వెంటనే సంబంధిత బూత్ లెవెల్ అధికారిని (BLO) లేదా సమీపంలోని స్వర్ణ వార్డు సచివాలయాన్ని సంప్రదించాలని సూచించారు. ఏ ఈ ఆర్ వో లు తమ పరిధిలో గల పోలింగ్ క్రేంద్రాలలో ఉన్న హియరింగ్ లను సమర్ధవంతంగా నిర్వహించాలని ఆదేశించారు.
Prajavartha Online Telugu News