Breaking News

పుష్కర ఎత్తిపోతల పైప్‌లైన్ పనుల్లో జాప్యంపై మంత్రి నిమ్మల ఆగ్రహం

-షెడ్యూల్ ప్రకారం పనులు పూర్తి చేయకపోతే కఠిన చర్యలు: మంత్రి నిమ్మల

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పుష్కర ఎత్తిపోతల పథకం పైప్‌లైన్ పనుల పురోగతిపై బుధ‌వారం రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. పనుల పురోగతి ఆశించిన స్థాయిలో లేకపోవడంపై అధికారులు, కాంట్రాక్టు ఏజెన్సీల ప్రతినిధులపై మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సమీక్షలో పోలవరం జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఇరిగేషన్ అడ్వైజర్ వెంకటేశ్వరరావు, ఈఎన్సీ నరసింహమూర్తి, ఈఈలు, కాంట్రాక్టు ఏజెన్సీల ప్రతినిధులు పాల్గొన్నారు.

ఇటీవల పుష్కర ఎత్తిపోతల పథకం పైప్‌లైన్ పనులకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అధికారులు, ఏజెన్సీల ప్రతినిధులు వర్క్ షెడ్యూల్ అందజేశారని మంత్రి తెలిపారు. ఆ షెడ్యూల్ ప్రకారం పనులు జరుగుతున్నాయా లేదా అన్నదానిపై ఇరిగేషన్ అడ్వైజర్ వెంకటేశ్వరరావు క్షేత్రస్థాయిలో పరిశీలించి మంత్రికి నివేదిక అందించారు. వర్క్ షెడ్యూల్ ఇచ్చి కూడా పనుల్లో వేగం పెంచకపోవడం ఏమిటని మంత్రి అధికారులను ప్రశ్నించారు. ప్రజాప్రయోజనాలకు సంబంధించిన అత్యంత కీలకమైన పనుల్లో అలసత్వాన్ని ఎంతమాత్రం సహించబోమని స్పష్టం చేశారు.

షెడ్యూల్ ప్రకారం పనులు పూర్తి చేయకుండా నిర్లక్ష్యం వహించే కాంట్రాక్టు ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. ప్రజాప్రయోజనాలకు నష్టం కలిగించే విధంగా కాంట్రాక్టర్లు వ్యవహరిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేసి జైలుకు పంపించేందుకు కూడా వెనుకాడవద్దని కలెక్టర్, ఎస్పీలను ఆదేశించారు.
పనుల్లో అలసత్వం వహించిన ఈఈకి మెమో జారీ చేయాలని ఈఎన్సీ నరసింహమూర్తిని మంత్రి ఆదేశించారు. ఇకపై పుష్కర లిఫ్ట్ స్కీం పైప్‌లైన్ పనులపై ప్రతిరోజూ వర్క్ ప్రోగ్రెస్ రిపోర్ట్ అందించాలని అధికారులకు స్పష్టం చేశారు.

ఎల్‌నినో వంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రతి నీటి చుక్కను ఎంతో జాగ్రత్తగా కాపాడుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారని మంత్రి తెలిపారు. గోదావరి జలాలను సమర్థవంతంగా వినియోగించుకునేందుకు పుష్కర ఎత్తిపోతల పథకం పనులు కీలకమని పేర్కొన్నారు. ఈ నెలాఖరున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం ఎడమ కాలువ ద్వారా అనకాపల్లి వరకు గోదావరి జలాలు వెళ్లేలా నీటిని విడుదల చేయనున్న నేపథ్యంలో, పుష్కర ఎత్తిపోతల పథకం పైప్‌లైన్ పనులను వేగవంతం చేసి నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులను, కాంట్రాక్టు ఏజెన్సీలను ఆదేశించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *