రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలోని హస్తకళాకారుల సంక్షేమం, సంప్రదాయ కళల పరిరక్షణకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ (లేపాక్షి) చైర్మన్ డా. పసుపులేటి హరిప్రసాద్ పేర్కొన్నారు.
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాజమహేంద్రవరంలో జరిగిన కార్యక్రమంలో హస్తకళాకారులు ఎదుర్కొంటున్న సమస్యలపై పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా దృష్టి సారించారు. ముఖ్యంగా కొండపల్లి, ఏటికొప్పాక, శ్రీకాళహస్తి, ఉదయగిరి, తిరుపతి తదితర ప్రాంతాల్లో చెక్క బొమ్మలు, చెక్క కళాకృతులు తయారు చేస్తున్న కళాకారులు ఎదుర్కొంటున్న ముడి కలప సమస్యను పరిష్కరించేందుకు వుడ్ బ్యాంక్ ఏర్పాటు చేయాలనే నిర్ణయం తీసుకోవడం హర్షణీయమని డా. హరిప్రసాద్ తెలిపారు. కళాకారులకు అవసరమైన కలపను సరసమైన ధరలకు, సులభంగా అందుబాటులోకి తీసుకురావడం ద్వారా వారి ఉత్పత్తి వ్యయం తగ్గడంతో పాటు సంప్రదాయ హస్తకళలపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలకు మరింత స్థిరమైన జీవనోపాధి లభిస్తుందని ఆయన పేర్కొన్నారు.
అటవీ శాఖతో సమన్వయం చేసుకుని హస్తకళాకారులకు అవసరమైన ముడి పదార్థాల లభ్యతను సులభతరం చేయడం, సంప్రదాయ కళల అభివృద్ధికి అనుకూలమైన వాతావరణాన్ని కల్పించడం వంటి చర్యలు హస్తకళా రంగ అభివృద్ధికి ఎంతో దోహదపడతాయని తెలిపారు. కొండపల్లి బొమ్మలు, ఏటికొప్పాక లక్కబొమ్మలు, శ్రీకాళహస్తి కళాకృతులు, ఉదయగిరి కత్తులు తదితర సంప్రదాయ హస్తకళలు రాష్ట్ర సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకలని డా. హరిప్రసాద్ పేర్కొన్నారు. ఈ కళలను పరిరక్షించడంతో పాటు కళాకారులకు అవసరమైన ప్రభుత్వ సహకారం అందించడం ద్వారా హస్తకళా రంగాన్ని మరింత బలోపేతం చేయవచ్చని అన్నారు.
హస్తకళాకారుల సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకుని వాటికి పరిష్కార మార్గాలను చూపిస్తున్న పవన్ కళ్యాణ్ చొరవతో కళాకారుల్లో నూతన విశ్వాసం ఏర్పడిందని డా. హరిప్రసాద్ తెలిపారు. లేపాక్షి ద్వారా రాష్ట్రంలోని హస్తకళాకారుల ఉత్పత్తులకు మార్కెటింగ్, ప్రచారం, విక్రయ అవకాశాలను మరింత విస్తృతం చేయడంతో పాటు సంప్రదాయ కళల పరిరక్షణకు అవసరమైన చర్యలను నిరంతరం కొనసాగిస్తామని లేపాక్షి చైర్మన్ డా. పసుపులేటి హరిప్రసాద్ తెలిపారు.
Prajavartha Online Telugu News