-ఏపీఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షులు అలపర్తి విద్యాసాగర్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
80వ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా విజయవాడ ఎ పి ఎన్ జి ఓ హోమ్ లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఎన్జీఓ సంఘం రాష్ట్ర అధ్యక్షులు అలపర్తి విద్యాసాగర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఎందరో మహనీయుల త్యాగాలు, పోరాటాల ఫలితంగానే మనకు స్వాతంత్ర్యం లభించిందని, వారి త్యాగాలను స్మరించుకుంటూ దేశ ప్రగతి, సమాజ సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని పిలుపునిచ్చారు.
స్వాతంత్ర్య సమరయోధుల ఆశయాలకు అనుగుణంగా ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ, ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించడంలో ప్రభుత్వ ఉద్యోగులు ముందుండాలని విద్యాసాగర్ అన్నారు. ఉద్యోగుల సంక్షేమంతో పాటు రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం ఏపీఎన్జీఓ సంఘం నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు.
దేశ సమైక్యత, సమగ్రత, సౌభ్రాతృత్వాన్ని పరిరక్షించుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అని పేర్కొంటూ, యువత దేశ నిర్మాణంలో చురుకైన పాత్ర పోషించాలని ఆయన ఆకాంక్షించారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, ఉద్యోగులకు విద్యాసాగర్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి.వి. రమణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, క్యాపిటల్ సిటీ కార్యవర్గ సభ్యులు, ఎన్టీఆర్ జిల్లా కార్యవర్గ సభ్యులు, రాష్ట్ర మహిళా సభ్యులు, విజయవాడ నగరశాఖ కార్యవర్గ సభ్యులు, ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News