Breaking News

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన ప్రత్యేక కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ PAC సభ్యులు, రాష్ట్ర జాయినింగ్ కమిటీ సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ… తెలుగు సినీ పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి సాధించిన ప్రస్థానం, ఆయన స్వయంకృషి, క్రమశిక్షణ, అంకితభావం ఎంతో స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. సాధారణ స్థాయి నుంచి తన ప్రతిభ, పట్టుదలతో అంచెలంచెలుగా ఎదిగి కోట్లాది మంది అభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన చిరంజీవి సినీ ప్రస్థానం భావితరాలకు ఆదర్శంగా నిలుస్తుందని తెలిపారు. చిరంజీవి ఆయురారోగ్యాలతో, ఆనందంగా మరెన్నో సంవత్సరాలు ప్రజల అభిమానాన్ని అందుకోవాలని ఆకాంక్షించారు. మెగాస్టార్ చిరంజీవి స్వయంకృషికి ప్రతీక అని అన్నారు.
శివశంకర వరప్రసాద్‌గా జన్మించిన చిరంజీవి నటనపై ఉన్న ఆసక్తి, నిరంతర కృషి వల్ల ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణ పూర్తి కాకముందే ‘పునాదిరాళ్లు’ చిత్రంలో అవకాశం లభించింది. ‘ప్రాణం ఖరీదు’ చిత్రం 1978లో విడుదలై ఆయన సినీ ప్రయాణానికి శ్రీకారం చుట్టిందన్నారు. విలన్‌గా ఆయన తొలి చిత్రంగా ‘కుక్క కాటుకి చెప్పు దెబ్బ’ నిలిచింది. 1979లో విడుదలైన ‘కోతలరాయుడు’ ఆయన తొలి సోలో హీరో చిత్రంగా నిలిచింది. 1980లో రాఘవేంద్రరావుతో తొలి చిత్రం ‘మోసగాడు’, అదే ఏడాది ‘పున్నమినాగు’ చిత్రానికి తొలి ఫిల్మ్‌ఫేర్ అవార్డు అందుకున్నారు. 1981లో ఎన్టీ రామారావుతో ‘తిరుగులేని మనిషి’ ఏకైక చిత్రంగా పేర్కొనబడింది. 1982లో కళాతపస్వి కె. విశ్వనాథ్‌తో తొలి చిత్రం ‘శుభలేఖ’ వచ్చింది. 1983లో విడుదలైన ‘ఖైదీ’ చిత్రం తెలుగు సినీ రంగంలో చిరంజీవి కెరీర్‌ను మరో కీలక మలుపు తిప్పిందన్నారు. ‘గ్యాంగ్ లీడర్’ యువతలో కొత్త ఉత్సాహాన్ని నింపగా, ‘ఘరానా మొగుడు’ ద్వారా బాక్సాఫీస్‌పై తన సత్తాను మరోసారి చాటుకున్నారు. కొంతకాలం విరామం అనంతరం ‘ఖైదీ నంబర్ 150’ చిత్రంతో తిరిగి వెండితెరపైకి వచ్చిన చిరంజీవి, తనపై ప్రేక్షకులు, ఆదరణ ఏమాత్రం తగ్గలేదని మరోసారి నిరూపించారన్నారు. చిరంజీవి సినీ ప్రస్థానం తెలుగు సినిమా చరిత్రలో ప్రత్యేకమైన అధ్యాయంగా నిలిచిందన్నారు.
ఈ కార్యక్రమంలో చిరంజీవి అభిమానులు, నిర్వాహకులు, అభిమాన సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కాకినాడలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

-జాతీయ జెండాను ఆవిష్కరించిన ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ కాకినాడ, నేటి పత్రిక ప్రజావార్త : కాకినాడ పోలీస్ పరేడ్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *