రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
బుధవారం అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ మరియు జిల్లా వైద్య విభాగం సంయుక్త ఆధ్వర్యంలో కోటిపల్లి బస్టాండ్ సమీపంలోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల నందు న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ . కె. ప్రత్యూష కుమారి “పోక్సో చట్టం, 2012” “బాల్య వివాహ నిషేధ చట్టం, 2006” మొదలగు చట్టాల పై అవగాహన కల్పించారు. బాలికలు బాగా చదువుకుని సమాజంలో గుర్తింపు తెచ్చుకోవాలని అన్నారు. వారి పట్ల జరిగే అన్యాయాలను మౌనంగా భరించరాదని, అలాంటి వారిపై వెంటనే ఫిర్యాదు చేయాలని తెలిపారు. వారికి ఎలాంటి సమస్యలు ఉన్నా జిల్లా న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించాలన్నారు. బాలికలకు మంచి, చెడు స్పర్శలకు తేడా తెలిసేలా పోస్టర్లను పాఠశాల ప్రాంగణంలో, తరగతి గదులలో ఏర్పాటు చేయాలని ఉపాధ్యాయులకు చెప్పారు. ఈ సదస్సులో యు.పి.హెచ్.సి. ఎం.ఓ. డా. మాణిక్యాంబ, డి.ఎం.హెచ్.ఓ సభ్యులు ఎం. అర్జున రావు, జి. వసంత లక్ష్మీ, పాఠశాల ప్రధానోపా ధ్యాయురాలు బి. వి. శారదదేవి, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News