-వినియోగదారులకు నాణ్యమైన, నిరంతర విద్యుత్ సరఫరానే ప్రధాన లక్ష్యం – గౌరవ సీఎండీ
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (APCPDCL) ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ పి. పుల్లారెడ్డి అధ్యక్షతన విజయవాడలోని విద్యుత్ నిలయంలో డిస్కమ్ పరిధిలోని CGMs ,GMs ,SEs ,EEs తో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో విద్యుత్ సరఫరా నాణ్యత, వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కారం, రెవెన్యూ వసూళ్లు, లైన్ లాస్ తగ్గింపు, విద్యుత్ చౌర్యం నియంత్రణ, విద్యుత్ భద్రత, లైన్‌లు మరియు ట్రాన్స్‌ఫార్మర్ల నిర్వహణ, వర్షాకాల అత్యవసర సన్నద్ధత, సబ్‌స్టేషన్లు, ఫీడర్ల పనితీరు, విద్యుత్ అంతరాయాల నియంత్రణ, పీక్ డిమాండ్ నిర్వహణ తదితర అంశాలపై సవివరంగా సమీక్షించారు.
ఈ సందర్భంగా CMD పి. పుల్లారెడ్డి మాట్లాడుతూ, వినియోగదారులకు నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ సరఫరా అందించడం సంస్థ ప్రధాన లక్ష్యమని తెలిపారు. విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడినప్పుడు అధికారులు, సిబ్బంది తక్షణమే స్పందించి నిర్ణీత సమయంలో సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. ప్రతి అధికారి క్షేత్రస్థాయిలో పర్యవేక్షణను మరింత బలోపేతం చేసి, విద్యుత్ పంపిణీ వ్యవస్థలో లోపాలను ముందుగానే గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు.
విద్యుత్ అంతరాయాలపై ప్రత్యేక దృష్టి
విద్యుత్ సరఫరాలో అంతరాయాలను కనిష్ట స్థాయికి తీసుకురావాలని, తరచూ ట్రిప్పింగ్‌కు గురయ్యే ఫీడర్లు, ఓవర్‌లోడ్ అవుతున్న ట్రాన్స్‌ఫార్మర్లు, బలహీనంగా ఉన్న విద్యుత్ లైన్లను గుర్తించి ముందస్తు నిర్వహణ చర్యలు చేపట్టాలని CMD సూచించారు. సబ్‌స్టేషన్లు, ఫీడర్లు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్ల పనితీరును నిరంతరం పర్యవేక్షిస్తూ సరఫరా నాణ్యతను మెరుగుపరచాలని అధికారులను ఆదేశించారు.
పీక్ డిమాండ్‌కు అనుగుణంగా ముందస్తు చర్యలు
విద్యుత్ డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో పీక్ అవర్స్‌లో ఎటువంటి అంతరాయాలు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో పనిచేయాలని సూచించారు. అధిక లోడ్ ఉన్న ప్రాంతాలను గుర్తించి అవసరమైన చోట లోడ్ బ్యాలెన్సింగ్, అదనపు సామర్థ్యాల ఏర్పాటు, ట్రాన్స్‌ఫార్మర్ల నిర్వహణ వంటి చర్యలను వేగవంతం చేయాలని తెలిపారు.
PM సూర్య ఘర్, RDSS పథకాలపై సమీక్ష
ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న PM సూర్య ఘర్ – ముఫ్త్ బిజ్లీ యోజన, RDSS, సబ్‌స్టేషన్ల నిర్మాణం, ఫీడర్ బలోపేతం తదితర పథకాల అమలు పురోగతిని గౌరవ CMD సమీక్షించారు. నిర్దేశించిన లక్ష్యాలను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పథకాల అమలులో నాణ్యతా ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని సూచించారు.
1912 ద్వారా కొత్త విద్యుత్ సర్వీస్ కనెక్షన్లు
వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని విద్యుత్ సేవలను పూర్తిస్థాయిలో డిజిటలైజేషన్ దిశగా తీసుకెళ్తున్నామని CMD తెలిపారు. ఇప్పటికే ఫిర్యాదుల నమోదు, సేవలకు సంబంధించిన సమాచారం, వినియోగదారుల సమస్యల పరిష్కారంలో 1912 సేవలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయని పేర్కొన్నారు.
ఇప్పుడు అదే వేదిక ద్వారా నూతన విద్యుత్ సర్వీస్ కనెక్షన్ దరఖాస్తులను కూడా స్వీకరించే విధానాన్ని ప్రవేశపెట్టడం ద్వారా వినియోగదారులకు మరింత సౌలభ్యం కల్పిస్తున్నామని తెలిపారు. ఈ సేవపై ఎన్టీఆర్ సర్కిల్ పరిధిలో విస్తృత ప్రచారం నిర్వహించి ప్రతి వినియోగదారునికి సమాచారం చేరేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
వినియోగదారులు కొత్త విద్యుత్ సర్వీస్ కనెక్షన్ కోసం ఇకపై ఈ-సేవ కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేదని గౌరవ CMD తెలిపారు. APCPDCL అధికారిక వెబ్‌సైట్ (www.apcpdcl.in) లేదా APCPDCL మొబైల్ యాప్ ద్వారా ఇంటి నుంచే సులభంగా కొత్త విద్యుత్ సర్వీస్ కనెక్షన్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.
ఎలనినో ప్రభావం నేపథ్యంలో డిస్కమ్ పరిధిలో విద్యుత్ సరఫరా పరిస్థితులు, తీసుకుంటున్న ముందస్తు చర్యలు, విద్యుత్ అంతరాయాలపై సమీక్ష నిర్వహించారు.
విద్యుత్ స్తంభాలు, విద్యుత్ లైన్లు, ట్రాన్స్‌ఫార్మర్లు తదితర విద్యుత్ మౌలిక వసతుల పరిస్థితిపై అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు.
విద్యుత్ సిబ్బంది విధి నిర్వహణ సమయంలో భద్రతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని, వ్యక్తిగత రక్షణ పరికరాలను వినియోగిస్తూ పనిచేయాలని స్పష్టం చేశారు. ప్రజలు కూడా తెగిపోయిన విద్యుత్ తీగలు, తడిసిన విద్యుత్ పరికరాలు, నీట మునిగిన విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లకు దూరంగా ఉండేలా విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు.
రెవెన్యూ వసూళ్లు, లైన్ లాస్ తగ్గింపుపై ప్రత్యేక దృష్టి
రెవెన్యూ వసూళ్లలో మెరుగైన ఫలితాలు సాధించాలని, పెండింగ్ బకాయిల వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలని CMD సూచించారు. అదే సమయంలో సాంకేతిక మరియు వాణిజ్య నష్టాలను తగ్గించేందుకు ఫీడర్ స్థాయిలో విశ్లేషణ నిర్వహించి అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
విద్యుత్ చౌర్యాన్ని అరికట్టేందుకు ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని, అక్రమ విద్యుత్ వినియోగంపై నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
వ్యవసాయ విద్యుత్ సరఫరాపై పర్యవేక్షణ
వ్యవసాయ రంగానికి అందిస్తున్న విద్యుత్ సరఫరాలో ఎటువంటి అంతరాయాలు తలెత్తకుండా ఫీడర్ల పనితీరును నిరంతరం పర్యవేక్షించాలని సీఎండీ సూచించారు. వ్యవసాయ విద్యుత్ సరఫరాకు సంబంధించిన సమస్యలను స్థానిక అధికారులు వేగంగా పరిష్కరించాలని ఆదేశించారు.
వినియోగదారుల సంతృప్తికి ప్రాధాన్యం
వినియోగదారులకు పారదర్శకమైన, వేగవంతమైన మరియు నాణ్యమైన సేవలు అందించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని CMD పి. పుల్లారెడ్డి ఆదేశించారు. వినియోగదారుల నుంచి వచ్చే ఫిర్యాదులను కేవలం నమోదు చేయడం కాకుండా, వాటి పరిష్కార నాణ్యతను కూడా పర్యవేక్షించాలని తెలిపారు.
ప్రతి స్థాయిలో అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ వినియోగదారుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే విధంగా చర్యలు చేపట్టాలని సూచించారు.
ఈ సమావేశంలో డైరెక్టర్ ప్రాజెక్ట్స్&హెచ్ ఆర్ డి టీవీఎస్ఎన్ మూర్తి,చీఫ్ జనరల్ మేనేజర్లు,జనరల్ మేనేజర్లు, సూపరిండెంట్ ఇంజినీర్లు, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు మరియు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News