-ఏపీ జేఏసీ ఉద్యమ కార్యాచరణతోనే స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం
-హామీలు అమలు కాకపోతే ఉద్యమాలకు సిద్ధం
-సెప్టెంబర్ మూడవ వారంలో ఏపీ జేఏసీ రాష్ట్ర సమావేశం
-4 లక్షల మంది పెన్షనర్లకు, 24 లక్షల ఉద్యోగ కుటుంబ సభ్యులకు ప్రభుత్వ నిర్ణయాలతో ప్రయోజనం
ఎపి జేఏసి చైర్మన్ ఎ. విద్యా సాగర్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి ఏపీ జేఏసీ ప్రకటించిన ఉద్యమ కార్యాచరణ ఫలితంగానే సెప్టెంబర్ 5న రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్యోగ సంఘాల నాయకులను చర్చలకు ఆహ్వానించి పలు కీలక అంశాలపై సానుకూల నిర్ణయాలు తీసుకున్నారని ఈ పరిణామం పట్ల జేఏసీ హర్షం వ్యక్తం చేస్తూ స్వాగతిస్తున్నట్లు జేఎసి చైర్మన్ ఎ.విద్యాసాగర్ సెక్రటరీ జనరల్ కె ఎస్ ఎస్ ప్రసాద్ లు తెలిపారు.
ఉద్యోగ సంఘాలతో శనివారం జరిగిన చర్చలు ముఖ్యమంత్రి యిచ్చిన హామీ ల పరిణామాల పై ఆదివారం ఏపి జేఎసి చైర్మన్ విద్యా సాగర్ కార్యవర్గ సభ్యులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశం లో విద్యాసాగర్ మాట్లాడుతూ ఏపీజేఏసీలోని భాగమైన ఉపాధ్యాయ సంఘాలు ముందుగా పి ఆర్ సి వివిధ అంశాలపై మీద ఉద్యమo బాట పట్టారని, తర్వాత ఆ బాధ్యత ఏపీ జేఏసీ తీసుకొని ఆగస్టు 26 న చీఫ్ సెక్రటరీకి నోటీసి ఇచ్చి ఉద్యమానికి శ్రీకారం చుట్టామని, తదుపరి జిల్లా కలెక్టర్లకు, ఎమ్మెల్యేలకు ఎంపీలకు రిప్రజెంటేషన్ ఇచ్చే కార్యక్రమం నిర్వహించామని
ఆగస్టు 14 వ తారీఖున ఏపి జే ఏ సి సమావేశమై ఆగస్టు 31 వరకు ప్రభుత్వానికి సమయం ఇస్తూ దానిలోపు ముఖ్యమంత్రి గారు చర్చిలకు పిలవాలని లేని పక్షంలో ఉద్యమ కార్యాచరణ తప్పదని చెప్పామన్నారు. 5 వ తేదీ లోపు చర్చలకు పిలవని పక్షంలో ఏపీ జేఏసీ ఉద్యమ శంఖారావం పూరించటానికి సెప్టెంబరు 25 సమావేశం నిర్వహించిందని దాని జరిమిలా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి 5వ తేదీన చర్చలకు పిలవడం సానుకూలంగా పరిష్కారం కావడ ముదావహం అని తెలిపారు.
పీఆర్సీ కమిటీ నియామకం, రెండు డీఏల విడుదల, సరెండర్ లీవ్ బకాయిల చెల్లింపు, పెన్షనర్ల సమస్యల పరిష్కారం వంటి అంశాలపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని తెలిపింది. ముఖ్యంగా సుమారు 4 లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం చేకూరే విధంగా తీసుకున్న నిర్ణయాలను స్వాగతిస్తున్నామని తెలిపారు.
హెల్త్ కార్డుల అమలులో ఉన్న సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు జేఏసీ తెలిపింది. ఉద్యోగులు చెల్లిస్తున్న కాంట్రిబ్యూషన్‌తో పాటు ప్రభుత్వం చెల్లించాల్సిన వాటాను కూడా ప్రతి నెల 1వ తేదీన ట్రస్ట్ ఖాతాకు పూర్తిగా బదిలీ చేయాలని సూచించగా, ముఖ్యమంత్రి వెంటనే సానుకూలంగా స్పందించి ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొంది. ప్రతి నెల రూ.30 కోట్లకు పైగా నిధులు ట్రస్ట్‌కు క్రమం తప్పకుండా అందితే ఆసుపత్రులకు 2–3 రోజుల్లోనే చెల్లింపులు జరిగే అవకాశం ఉంటుందని, తద్వారా వైద్య సేవలు మరింత మెరుగుపడతాయని ఈ నిర్ణయం వల్ల ఉద్యోగులు, పెన్షనర్లు మరియు వారి కుటుంబ సభ్యులు కలిపి దాదాపు 24 లక్షల మందికి మెరుగైన వైద్య సేవలు అందే పరిస్థితి ఏర్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేసారు.హెల్త్ కార్డులకు సంబంధించిన మిగిలిన సమస్యల పరిష్కారం కోసం చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీ సమావేశం ఏర్పాటు చేయాలని కూడా కోరినట్లు తెలిపారు
అలాగే పీఆర్సీ కమిటీ నియామకంతో పాటు ఇంటరిమ్ రిలీఫ్ (IR) ప్రకటించాలని ముఖ్యమంత్రిని కోరినట్లు జేఏసీ పేర్కొంది. గత పీఆర్సీల చరిత్రను ప్రస్తావిస్తూ, సాధారణంగా పీఆర్సీ కమిటీ నియామకంతో పాటు ఐఆర్ ప్రకటించే ఆనవాయితీ లేదని ముఖ్యమంత్రి పేర్కొన్నప్పటికీ, ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం సానుకూల దృక్పథంతో ఉందని, తగిన సమయంలో ఐఆర్ అంశాన్ని కూడా పరిశీలిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు
ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను మరిన్ని సంక్షేమ పథకాల పరిధిలోకి తీసుకురావడం, వారికి ప్రయోజనం చేకూరే చర్యలు చేపట్టడం, అలాగే కొన్ని విభాగాల్లో పదవీ విరమణ వయస్సును 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచే అంశాన్ని కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు .
డిమాండ్ల సాధన అనేది నిరంతర ప్రక్రియ అని, ముఖ్యమంత్రి సమావేశంలో ఇచ్చిన హామీలకు సంబంధించిన ఉత్తర్వులు త్వరలో వెలువడతాయని ఆశిస్తున్నామని జేఏసీ తెలిపింది. అదే సమయంలో హామీలు అమలు కాకపోయినా, లేదా డిమాండ్ల పరిష్కారంలో జాప్యం జరిగినా, ఉద్యమ కార్యాచరణ చేపట్టడంలో వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది.
ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సమస్యలపై తదుపరి కార్యాచరణను నిర్ణయించేందుకు సెప్టెంబర్ మూడవ వారంలో ఏపీ జేఏసీ రాష్ట్ర సమావేశాన్ని నిర్వహించనున్నట్లు ప్రకటించింది.
ఏపీజేఏసీ సెక్రటరీ జనరల్ కె.ఎస్.ఎస్. ప్రసాద్ మాట్లాడుతూ* ఉద్యోగులు, పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి ఏపీజేఏసీ నిరంతరం కృషి చేస్తోందన్నారు. పెన్షనర్లకు సంబంధించిన అంశాలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఉద్యోగులు, పెన్షనర్ల సంక్షేమానికి సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం ఏపీజేఏసీ తరఫున చర్చలు, ప్రయత్నాలు కొనసాగుతాయని తెలిపారు.
పెన్షనర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డి.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ 70 ఏళ్లు పైబడిన పెన్షనర్లకు అదనపు క్వాంటమ్ పెన్షన్ మంజూరు చేయడం వల్ల రాష్ట్రంలోని వృద్ధాప్య పెన్షనర్లకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. వయస్సు పెరిగే కొద్దీ వైద్య ఖర్చులు, ఇతర జీవన వ్యయాలు పెరుగుతున్న నేపథ్యంలో అదనపు క్వాంటమ్ వారికి ఆర్థికంగా అండగా నిలుస్తుందని పేర్కొన్నారు.
గత ప్రభుత్వ హయాంలో జీఓ నంబర్ 1 ద్వారా కల్పించిన ప్రయోజనాలను సైతం వెనక్కి తీసుకున్నారని వెంకటేశ్వర్లు తెలిపారు. ఆ సమయంలో ఏపీజేఏసీ ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఉద్యమం చేపట్టడంతో ప్రభుత్వం చర్చలకు ముందుకు వచ్చిందన్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో సెప్టెంబర్ 5న ఏపీజేఏసీ ఉద్యమ కార్యాచరణకు సిద్ధమవుతున్న సమయంలోనే ప్రభుత్వం చర్చలకు పిలవడం, అనంతరం పెన్షనర్ల సమస్యలపై సానుకూలంగా స్పందించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.
పెన్షనర్ల సమస్యలను అర్థం చేసుకుని, అదనపు క్వాంటమ్ అంశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేసిన ఏపీజేఏసీ చైర్మన్ విద్యాసాగర్‌కు వెంకటేశ్వర్లు కృతజ్ఞతలు తెలిపారు. పెన్షనర్ల సమస్యలపై సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి పెన్షనర్ల సంఘం తరఫున ధన్యవాదాలు తెలిపారు.
పెన్షనర్లు ఎదుర్కొంటున్న ఇతర సమస్యల పరిష్కారానికి కూడా ఏపీజేఏసీ నిరంతరం కృషి చేస్తుందని, ప్రభుత్వంతో చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తామని విద్యాసాగర్, కె.ఎస్.ఎస్. ప్రసాద్, వెంకటేశ్వర్లు తెలిపారు.
సమావేశంలో కె.ఎస్.ఎస్. ప్రసాద్ (ఆంధ్రప్రదేశ్ యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్), డి.వి. రమణ (ఏపీ నాన్-గెజిటెడ్, గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్), సి.హెచ్. మంజుల (ఏపీఎస్‌టీఎఫ్–257), ఎ. సాంబశివరావు (ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సెక్టార్ ఎంప్లాయీస్ ఫెడరేషన్), డి. వెంకటేశ్వర్లు (రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘం, ఆంధ్రప్రదేశ్) తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News