-కుల మతాలకతీతంగా సేవలందించాలి ,
-ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేయాలి
-ఎమ్మెల్యే సుజనా చౌదరి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి నందిగామ బీజేపీ పార్టీ కార్యాలయం వేదికగా నిలవాలని మాజీ కేంద్ర మంత్రి విజయవాడ పశ్చిమ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ చౌదరి (సుజనాచౌదరి) పిలుపునిచ్చారు. నందిగామ నియోజకవర్గంలో నూతనంగా ఏర్పాటుచేసిన బీజేపీ కార్యాలయాన్ని ఆదివారం సుజనా ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుజనా చౌదరి మాట్లాడుతూ నూతన కార్యాలయం ప్రజాసేవే లక్ష్యంగా కేంద్ర బిందువుగా మారాలని బీజేపీ నాయకులు, కార్యకర్తలు సేవా భావంతో ప్రజల మధ్య ఉంటూ పనిచేయాలని కోరారు. బీజేపీ 1984 లోక్ సభ ఎన్నికల్లో కేవలం 2 స్థానాలతో ప్రారంభమై నేడు అత్యధికంగా 303 స్థానాలకు చేరుకోవడం భారత రాజకీయ చరిత్రలోనే అత్యంత అసాధారణమైన ప్రస్థానం అన్నారు. ప్రతి కార్యకర్త సేవా గుణంతో కష్టపడి పనిచేసి అంచలంచెలుగా ఎదగాలన్నారు. నందిగామ బీజేపీ పార్టీ నాయకుల , కార్యకర్తల సమిష్టి సహకారంతోనే పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయగలిగామన్నారు.. ప్రజలకు అవసరమైన విద్య ,వైద్య రంగాల్లో సుజనా ఫౌండేషన్ ద్వారా సహాయ సహకారాలు అందిస్తున్నామన్నారు.
ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ కోట్లాది మంది సభ్యులతో దేశంలోనే అతి పెద్ద పార్టీగా ఆవిర్భవించిందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోను భారతీయ జనతా పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్క కార్యకర్త కష్టించి పనిచేయాలన్నారు. ప్రతి గ్రామం, వార్డు స్థాయి వరకు బీజేపీ పార్టీను విస్తరించాలన్నారు.
బీజేపీ నాయకులు ఉన్నం గిరిధర్, పోరుగంటి నరసింహారావు, కొల్లు నాగేశ్వరరావు, బర్రె శివ కృష్ణారెడ్డి, సీతారామయ్య, రావూరి రమేష్, బండారు వెంకట నాగ కేదారేశ్వర శర్మ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News