Breaking News

సెప్టెంబర్ 11 నుంచి 24 వరకు జిల్లావ్యాప్తంగా ఇంటింటి కుష్ఠు వ్యాధి గుర్తింపు సర్వే

-తొలిదశలోనే కుష్ఠు వ్యాధిని గుర్తించి చికిత్స అందిస్తే అంగవైకల్యాన్ని నివారించవచ్చు
-జిల్లా కలెక్టర్ డా.జి.లక్ష్మీశ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో సెప్టెంబర్ 11వ తేదీ నుంచి 24వ తేదీ వరకు నిర్వహించనున్న ఇంటింటి కుష్ఠు వ్యాధి గుర్తింపు సర్వేకు సంబంధించిన గోడ పత్రికను జిల్లా కలెక్టర్ డా.జి.లక్ష్మీశ సోమవారం కలెక్టరేట్‌లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా.జి.లక్ష్మీశ మాట్లాడుతూ, “అంగవైకల్యాన్ని నివారించడానికి ముందుగానే కుష్ఠు వ్యాధిని గుర్తించి చికిత్స అందిస్తాము” అనే లక్ష్యంతో జిల్లావ్యాప్తంగా రెండు వారాల పాటు ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కుష్ఠు వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించి, సకాలంలో చికిత్స అందించడం ద్వారా వ్యాధి తీవ్రతను తగ్గించడంతో పాటు అంగవైకల్యాన్ని నివారించవచ్చని పేర్కొన్నారు. ప్రజలు ఈ సర్వేకు పూర్తి సహకారం అందించాలని, ఆరోగ్య సిబ్బంది తమ ఇళ్లకు వచ్చినప్పుడు కుటుంబ సభ్యుల ఆరోగ్య వివరాలను తెలియజేసి పరీక్షలకు సహకరించాలని జిల్లా కలెక్టర్ కోరారు. శరీరంపై స్పర్శ తెలియని లేదా స్పర్శ తగ్గిన అనుమానాస్పద మచ్చలు కనిపించినట్లయితే వాటిని నిర్లక్ష్యం చేయకుండా సర్వే బృందానికి తెలియజేసి పరీక్షలు చేయించుకోవాలని కలెక్టర్ సూచించారు. కుష్ఠు వ్యాధికి సంబంధించిన లక్షణాలను ప్రారంభ దశలోనే గుర్తించడం ద్వారా వ్యాధి ఇతరులకు వ్యాప్తి చెందకుండా నియంత్రించడంతో పాటు, బాధితులకు సకాలంలో చికిత్స అందించే అవకాశం ఉంటుందని తెలిపారు. సర్వేలో భాగంగా ఆశా కార్యకర్తలు, ఎంపిక చేసిన పురుష ఆరోగ్య కార్యకర్తలు బృందాలుగా ఏర్పడి జిల్లాలోని ప్రతి ఇంటినీ సందర్శించనున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. ప్రతి కుటుంబంలోని సభ్యులను ఆరోగ్య సిబ్బంది పరిశీలించి, కుష్ఠు వ్యాధికి సంబంధించిన అనుమానాస్పద లక్షణాలు ఉన్న వ్యక్తులను గుర్తిస్తారని చెప్పారు. ప్రజలు ఎటువంటి భయాందోళనలకు గురికాకుండా ఆరోగ్య సిబ్బందికి సహకరించాలని కోరారు. ఇంటింటి సర్వేలో భాగంగా అనుమానిత కేసులను గుర్తించిన అనంతరం, సంబంధిత ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య బృందం ద్వారా మరోసారి వైద్య పరీక్షలు నిర్వహిస్తారని జిల్లా కలెక్టర్ వివరించారు. వైద్య పరీక్షల్లో కుష్ఠు వ్యాధి నిర్ధారణ అయిన వారికి వెంటనే మల్టీ డ్రగ్ థెరపీ – బహుళ ఔషధ చికిత్స అందించనున్నట్లు తెలిపారు. చికిత్సను క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా వ్యాధిని పూర్తిగా నియంత్రించవచ్చని పేర్కొన్నారు. కుష్ఠు వ్యాధికి సంబంధించిన పరీక్షలు, చికిత్సను ప్రభుత్వం పూర్తిగా ఉచితంగా అందిస్తోందని జిల్లా కలెక్టర్ తెలిపారు. వ్యాధి నిర్ధారణ అయిన వ్యక్తులు చికిత్స విషయంలో ఎటువంటి నిర్లక్ష్యం చేయకుండా వైద్యుల సూచనల మేరకు మందులు వినియోగించాలని సూచించారు. కుష్ఠు వ్యాధి పట్ల ప్రజల్లో ఉన్న అపోహలు, భయాలను తొలగించి, వ్యాధి లక్షణాలు ఉన్నవారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పరీక్షలు చేయించుకునేలా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లాలో నిర్వహించనున్న ఇంటింటి కుష్ఠు వ్యాధి గుర్తింపు సర్వేను విజయవంతం చేయడానికి అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. ఆరోగ్య సిబ్బంది తమ ఇళ్లకు వచ్చినప్పుడు కుటుంబ సభ్యులందరూ పరీక్షలకు సహకరించి, అనుమానాస్పద లక్షణాలు ఉంటే ఎటువంటి సంకోచం లేకుండా తెలియజేయాలని సూచించారు. తొలిదశలో వ్యాధిని గుర్తించడం – సకాలంలో చికిత్స అందించడం – అంగవైకల్యాన్ని నివారించడం అనే లక్ష్యంతో జిల్లా యంత్రాంగం, వైద్య ఆరోగ్య శాఖ సమన్వయంతో ఈ సర్వేను సమర్థవంతంగా నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ, డిఆర్ఓ ఎం.లక్ష్మీనరసింహం, జిల్లా లెప్రసీ, టీబీ, ఎయిడ్స్ నియంత్రణ అధికారి డాక్టర్ బి.భాను నాయక్, డీఈఓ ఎల్.చంద్రకళ, పలువురు జిల్లా అధికారులు, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఈ-ఫైల్స్ క్లియరెన్స్‌లో మంత్రి అచ్చెన్నాయుడికి వరుసగా మూడోసారి మొదటి స్థానం

-వేగవంతమైన ఫైళ్ల పరిష్కారం.. సమర్థవంతమైన పనితీరుకు సీఎం చంద్రబాబు ప్రశంసలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈ-ఫైల్స్ క్లియరెన్స్‌లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *