Breaking News

స్వచ్ఛ గ్రామాల‌తోనే స్వ‌ర్ణాంధ్ర సాధ్యం

– ప్లాస్టిక్‌కు దూరంగా.. పరిశుభ్రతకు చేరువగా ముంద‌డుగు వేయాలి
– పరిశుభ్రమైన పరిసరాలతో ఆరోగ్యకర సమాజ నిర్మాణం
– స్వ‌చ్ఛ‌తా ర్యాలీలో జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్వచ్ఛమైన గ్రామాల నిర్మాణంతోనే స్వర్ణాంధ్ర లక్ష్యం సాకార‌మ‌వుతుంద‌ని.. ప్రతిఒక్కరూ పరిశుభ్రతను సామాజిక బాధ్యతగా భావించి భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్‌ డా. జి.లక్ష్మీశ పిలుపునిచ్చారు.
ఇబ్రహీంపట్నం మండలం జూపూడి గ్రామంలో మంగళవారం జిల్లా పంచాయతీ కార్యాలయం ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర అవ‌గాహ‌న కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ డా. జి.లక్ష్మీశ పాల్గొని గ్రామంలో నిర్వహించిన అవగాహన ర్యాలీలో ప్రజలు, అధికారులు, సిబ్బందితో కలిసి నడిచారు. స్వ‌చ్ఛ‌తా ర్యాలీలో భాగంగా ప్లాస్టిక్‌ వినియోగాన్ని నివారించాలి.. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచాలి.. చెత్తను సక్రమంగా నిర్వహించాలి అంటూ సందేశాలు ఇచ్చే ప్లకార్డులను ప్రదర్శించారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ గ్రామంలో ఉత్పత్తి అయ్యే చెత్తను సక్రమంగా వేరుచేసి నిర్వహించడం ద్వారా చెత్త నుంచి సంపదను సృష్టించవచ్చని పేర్కొన్నారు. చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రాన్ని సందర్శించిన ఆయన, అక్కడ మొక్కలు నాటారు. గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ, వ్యర్థాల సేకరణ, వేరు చేయడం, పునర్వినియోగం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టిసారించాలని అధికారులను ఆదేశించారు. ఇంటి నుంచే చెత్తను వేరు చేయడం ద్వారా పారిశుద్ధ్య నిర్వహణ మరింత సమర్థవంతంగా మారుతుందని చెప్పారు. సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ వల్ల పర్యావరణానికి కలిగే నష్టాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్లాస్టిక్‌ కవర్లకు బదులుగా జ్యూట్‌, క్లాత్‌ బ్యాగులు వంటి పర్యావరణహిత ప్రత్యామ్నాయాలను వినియోగించాలని సూచించారు. ప్లాస్టిక్‌ వినియోగాన్ని తగ్గించడం ప్రతి పౌరుడి బాధ్యతగా గుర్తించి, గ్రామాన్ని ప్లాస్టిక్‌ రహితంగా తీర్చిదిద్దేందుకు ప్రజలు సహకరించాలని కలెక్టర్‌ కోరారు. పరిశుభ్రత అనేది కేవలం ప్రభుత్వ శాఖల బాధ్యత కాదని, ప్రజల భాగస్వామ్యంతోనే స్వచ్ఛమైన గ్రామాలను నిర్మించగలమని కలెక్టర్‌ తెలిపారు. ఇంటి పరిశుభ్రత నుంచి గ్రామ పరిశుభ్రత.. గ్రామ పరిశుభ్రత నుంచి ఆరోగ్యకరమైన సమాజం.. ఆరోగ్యకరమైన సమాజం నుంచి స్వర్ణాంధ్ర దిశగా ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ‌ పిలుపునిచ్చారు. కార్య‌క్ర‌మంలో డీపీవో టి.సీతామ‌హాల‌క్ష్మి, ఎంపీడీవో శ‌కుంతుల‌, డీఎల్‌పీవో రాఘ‌వ‌న్‌, డిప్యూటీ ఎంపీడీవో మ‌నోజ్‌, స్థానిక ప్ర‌జ‌లు త‌దిత‌రులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఈ-ఫైల్స్ క్లియరెన్స్‌లో మంత్రి అచ్చెన్నాయుడికి వరుసగా మూడోసారి మొదటి స్థానం

-వేగవంతమైన ఫైళ్ల పరిష్కారం.. సమర్థవంతమైన పనితీరుకు సీఎం చంద్రబాబు ప్రశంసలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈ-ఫైల్స్ క్లియరెన్స్‌లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *