Breaking News

పరిశ్రమలు తమ ఖాళీ స్థలాలను హరిత వనాలుగా మార్చాలి

-స్థానిక వృక్ష జాతులతో గ్రీన్‌ బెల్ట్‌ను మరింత విస్తరించాలి
-నాటిన మొక్కల సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి
-మియావాకి పద్ధతిలో దట్టమైన వనాలను అభివృద్ధి చేయాలి
-దివిస్‌లో గ్రీన్‌బెల్ట్ అభివృద్ధి, ప్లాంటేషన్ కార్యక్రమాలపై ఏపీ గ్రీన్ ఛైర్మన్ నాగబాబు సమీక్ష
-ఉద్యోగులతో కలిసి మొక్కలు నాటిన నాగబాబు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
పర్యావరణ పరిరక్షణ, జీవవైవిధ్య పరిరక్షణకు పరిశ్రమలు తమ గ్రీన్ ‌బెల్ట్‌ను మరింత విస్తరించి, స్థానిక వృక్ష జాతులతో దట్టమైన పచ్చదనాన్ని అభివృద్ధి చేయాలని ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్  నాగబాబు స్పష్టం చేశారు. పరిశ్రమల యాజమాన్యాలు, ఉద్యోగులు సమష్టి బాధ్యతతో నిరంతరం కృషి చేసినప్పుడే పర్యావరణానికి మేలు చేసే స్థిరమైన గ్రీన్‌బెల్ట్‌ను అభివృద్ధి చేయడం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. మంగళవారం కాకినాడ జిల్లా తొండంగి మండలం ఒంటిమామిడి గ్రామంలోని దివిస్ లేబొరేటరీస్ ను సందర్శించి, పరిశ్రమలో కొనసాగుతున్న గ్రీన్ బెల్ట్ అభివృద్ధి, ప్లాంటేషన్ కార్యక్రమాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ “పరిశ్రమలు తమ పరిధిలోని ఖాళీ ప్రదేశాలను వినియోగించుకుని గ్రీన్‌ బెల్ట్‌ను మరింత విస్తరించాలి. పెద్దగా పెరిగే స్థానిక వృక్ష జాతులకు ప్రాధాన్యం ఇచ్చి మొక్కలు నాటాలి. అనుకూలమైన ప్రతి చోట మియావాకి పద్ధతిలో దట్టమైన వనాలను అభివృద్ధి చేయాలి. పరిశ్రమలలో అందుబాటులో ఉన్న ఖాళీ స్థలాలన్నింటినీ దశలవారీగా హరిత వనాలుగా మార్చాలి. నాటిన మొక్కల సంరక్షణ, మనుగడపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి” అన్నారు.
దివీస్ ల్యాబ్స్‌లో గ్రీన్ బెల్ట్‌ పరిశీలించిన నాగబాబు
అంతకు ముందు నాగబాబు దివీస్ పరిశ్రమ ప్రాంగణాన్ని సందర్శించి, ఇప్పటికే అభివృద్ధి చేసిన గ్రీన్ బెల్ట్, మొక్కలు నాటిన ప్రాంతాలను పరిశీలించారు. అలాగే భవిష్యత్‌లో మరింత హరిత ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు అందుబాటులో ఉన్న ఖాళీ స్థలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా పరిశ్రమ ప్రతినిధులు ప్రస్తుతం చేపడుతున్న ప్లాంటేషన్ కార్యక్రమంతోపాటు, భవిష్యత్‌లో గ్రీన్ బెల్ట్‌ను మరింత విస్తరించేందుకు రూపొందించిన ప్రణాళికలను నాగబాబు కి వివరించారు. అనంతరం దివిస్ లేబొరేటరీస్‌కు చెందిన 100 మందికి పైగా ఉద్యోగులతో కలిసి నాగబాబు మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ఉద్యోగులు చురుకుగా పాల్గొనడాన్ని ఆయన అభినందించారు. ఇప్పటి వరకు పరిశ్రమ ప్రాంగణంలో వివిధ జాతులకు చెందిన మొత్తం 25,150 మొక్కలను నాటినట్లు పరిశ్రమ ప్రతినిధులు నాగబాబు కి తెలిపారు. అనంతరం దివిస్ లేబొరేటరీస్ ప్రతినిధులు పరిశ్రమ చేపడుతున్న సీఎస్‌ఆర్ కార్యక్రమాలపై నాగబాబు కి వివరాలను అందించారు. పర్యావరణ పరిరక్షణ, సామాజిక సేవల కోసం కేటాయిస్తున్న సీఎస్‌ఆర్ నిధులు, వాటి వినియోగం, అలాగే సీఎస్‌ఆర్‌లో భాగంగా అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఈ-ఫైల్స్ క్లియరెన్స్‌లో మంత్రి అచ్చెన్నాయుడికి వరుసగా మూడోసారి మొదటి స్థానం

-వేగవంతమైన ఫైళ్ల పరిష్కారం.. సమర్థవంతమైన పనితీరుకు సీఎం చంద్రబాబు ప్రశంసలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈ-ఫైల్స్ క్లియరెన్స్‌లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *