-‘మీ భూమి–మీ హక్కు’ కార్యక్రమంలో పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీ
-రైతులతో ముఖాముఖి… గ్రామసభలో పాల్గొననున్న సీఎం
-22-A నిషేధిత జాబితా నుంచి గ్రౌండ్ రెంట్ స్థలాల విముక్తికి కీలక అడుగు
-1,416 కుటుంబాలకు లబ్ధి కలిగించే ప్రతిపాదనలు సిద్ధం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజల మధ్యే పాలన సాగిస్తూ ప్రతి నెలా వివిధ ప్రజా కార్యక్రమాల్లో ప్రత్యక్షంగా పాల్గొంటున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా భూ హక్కులకు భరోసా కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ‘మీ భూమి–మీ హక్కు’ కార్యక్రమంలో భాగంగా పి. గన్నవరం నియోజకవర్గంలో జరిగే గ్రామసభలో పాల్గొని పట్టాదారు పాస్‌పుస్తకాలను పంపిణీ చేయనున్నారు. పర్యటనలో భాగంగా రైతులతో ముఖాముఖి నిర్వహించడంతో పాటు, గ్రామసభలో పాల్గొని భూ హక్కుల పరిరక్షణ, రెవెన్యూ సంస్కరణలపై ప్రజలకు వివరించనున్నారు. అనంతరం బుడుంగపేటలో నిర్వహించే కేడర్ సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు.
ప్రజల మధ్యే పాలన…
పాలన అంటే సచివాలయంలో కూర్చోవడం మాత్రమే కాదని, ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరించడమే నిజమైన పాలన అనే విధానంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతి నెలా ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ప్రతి నెలా ఒకటో తేదీన ‘పేదల సేవలో’, మూడో శనివారం ‘స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర’, నాలుగో శనివారం ‘సంజీవని’, ప్రతి నెలా 9వ తేదీన ‘మీ భూమి–మీ హక్కు’ కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రజల కష్టసుఖాలు తెలుసుకుంటున్నారు.
రేపటి ముఖ్యమంత్రి పర్యటన షెడ్యూల్
ఉదయం 9.45 గంటలకు…ఉండవల్లి నివాసం నుంచి డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా పర్యటనకు ముఖ్యమంత్రి బయలుదేరుతారు. ఉదయం 10.30 గంటలకు…అంబాజీపేట మండలం ఇరుసుమండ చేరుకుంటారు. అక్కడ ప్రజాప్రతినిధులు, అధికారులతో సమావేశమవుతారు. ఉదయం 10.45 గంటలకు….ఇరుసుమండ నుంచి రోడ్డు మార్గంలో మాచవరం గ్రామంలోని జయంతి నగర్‌కు బయలుదేరుతారు. ఉదయం 10.55 నుంచి 11.35 గంటల వరకు…మాచవరం గ్రామంలోని జయంతి నగర్లో ఏర్పాటు చేసిన రైతులతో ముఖాముఖి కార్యక్రమానికి చేరుకుంటారు. రైతులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు, అభిప్రాయాలు తెలుసుకుంటారు. వ్యవసాయం, సాగునీరు, భూ హక్కులు, భూ రికార్డులు తదితర అంశాలపై రైతులతో సంభాషిస్తారు.
ఉదయం 11.35 గంటలకు…జయంతి నగర్ నుంచి బయలుదేరి పండువారిపేట గ్రామంలోని గ్రామసభ వేదికకు చేరుకుంటారు. ఉదయం 11.40 నుంచి మధ్యాహ్నం 1.55 గంటల వరకు… ప్రతిష్ఠాత్మక ‘మీ భూమి–మీ హక్కు’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. ఈ సందర్భంగా అర్హులైన రైతులు, లబ్ధిదారులకు పట్టాదారు పాస్‌పుస్తకాలను పంపిణీ చేస్తారు. భూ హక్కుల పరిరక్షణ కోసం ప్రభుత్వం చేపడుతున్న చర్యలు, రీ-సర్వే సమస్యల పరిష్కారం, రెవెన్యూ సంస్కరణలు, అత్యాధునిక సాంకేతికతతో భూ రికార్డుల భద్రత వంటి అంశాలను ప్రజలకు వివరించనున్నారు. మధ్యాహ్నం 3.15 గంటలకు….బుడుంగపేటలో ఏర్పాటు చేసిన కేడర్ సమావేశ వేదికకు చేరుకుంటారు. మధ్యాహ్నం 3.15 నుంచి సాయంత్రం 4.45 గంటల వరకు…కేడర్ సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొని పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తారు. సాయంత్రం 4.50 గంటలకు…ఇరుసుమండ నుంచి బయలుదేరి సాయంత్రం 5.40 గంటలకు…ఉండవల్లి క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు.
‘మీ భూమి–మీ హక్కు’… కేవలం రెవెన్యూ కార్యక్రమం కాదు
‘మీ భూమి–మీ హక్కు’ కార్యక్రమాన్ని ప్రభుత్వం కేవలం పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీ కార్యక్రమంగా చూడటం లేదు. రైతు గౌరవాన్ని, ప్రతి పౌరుడి ఆస్తి హక్కును కాపాడే ప్రజా ఉద్యమంగా అమలు చేస్తోంది. గత ప్రభుత్వంలో రీ-సర్వే ప్రక్రియలో తలెత్తిన సమస్యలను పరిష్కరించి, భూ రికార్డులను సరిచేసి, ప్రతి భూ యజమానికి స్పష్టమైన హక్కును కల్పించేందుకు ప్రభుత్వం రీ-సర్వే 2.0 కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా భూ రికార్డుల ప్రక్షాళనతో పాటు, నిర్దిష్ట కాలపరిమితిలో ప్రతి అర్హుడికి కొత్త పట్టాదారు పాస్‌పుస్తకం అందించేందుకు ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది.
పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీ లక్ష్యం
భూ హక్కులకు శాశ్వత భరోసా కల్పించేందుకు ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా నిర్దిష్ట కార్యాచరణతో కొత్త పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీ చేపట్టింది. ఇప్పటివరకు…
ఈ ఏడాది జనవరి నుంచి రాష్ట్రవ్యాప్తంగా 8,234 గ్రామాల్లో 36 లక్షలకు పైగా పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీ చేపట్టింది. ఈ నెలలో… మరో 783 గ్రామాల్లో దాదాపు 4 లక్షల పట్టాదారు పాస్‌పుస్తకాలు పంపిణీకి సిద్ధం చేసింది. వచ్చే మార్చి నాటికి…రాష్ట్రవ్యాప్తంగా మిగిలిన 8,582 గ్రామాల్లో 56 లక్షలకు పైగా పట్టాదారు పాస్‌పుస్తకాలను అందించి కార్యక్రమాన్ని పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోంది.
గ్రౌండ్ రెంట్ భూముల సమస్యకు పరిష్కారం
ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దశాబ్దాలుగా కొనసాగుతున్న గ్రౌండ్ రెంట్ స్థలాల సమస్య పరిష్కారానికి కీలక అడుగు పడనుంది. అమలాపురం, అంబాజీపేట, ముమ్మిడివరం, రామచంద్రాపురం ప్రాంతాల్లోని కొన్ని నివాస గ్రౌండ్ రెంట్ స్థలాలు పాత రెవెన్యూ వర్గీకరణ కారణంగా రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ 22-A(1)(b) కింద నిషేధిత ఆస్తుల జాబితాలో కొనసాగుతున్నాయి. వాస్తవానికి ఈ స్థలాలు దీర్ఘకాలంగా నివాసాలుగా ఉన్నాయి. అనేక చోట్ల శాశ్వత నిర్మాణాలు ఉన్నాయి. 1984 నుంచే గ్రౌండ్ రెంట్ వ్యవస్థ నిలిచిపోయినప్పటికీ, పాత రెవెన్యూ రికార్డుల్లోని వర్గీకరణ కారణంగా ఆయా కుటుంబాలు ఆస్తి లావాదేవీలలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.
1,416 కుటుంబాలకు లబ్ధి… 56.37 ఎకరాలకు విముక్తి
క్షేత్రస్థాయి విచారణలు, పాత రెవెన్యూ రికార్డులు, సర్వే వివరాలు, గత రిజిస్ట్రేషన్ లావాదేవీలను పరిశీలించిన అనంతరం, నివాస గ్రౌండ్ రెంట్ స్థలాలను గ్రామకంఠం భూములతో సమానంగా పరిగణించి 22-A నిషేధిత జాబితా నుంచి ప్రత్యేక కేటగిరీగా తొలగించే ప్రతిపాదన పరిశీలనలో ఉంది.
ఈ నిర్ణయం అమలైతే:
• 1,416 మంది నివాసితులకు ప్రయోజనం
• 56.37 ఎకరాల భూమికి ఆంక్షల నుంచి విముక్తి
• 1,281 సర్వే నంబర్లకు సంబంధించి సమస్య పరిష్కారం
• అంబాజీపేట, అమలాపురం, ముమ్మిడివరం, రామచంద్రాపురం ప్రాంతాల కుటుంబాలకు లబ్ధి కలగనుంది. మాచవరం గ్రామంలోని జయంతినగర్‌కు ప్రత్యేక చారిత్రక నేపథ్యం ఉండగా, అక్కడ గుర్తించిన 32 మంది అర్హులైన నివాసితులకు కూడా ఈ చర్య ద్వారా ప్రయోజనం కలగనుంది.
రాష్ట్రవ్యాప్తంగా భూ సమస్యలకు పరిష్కారం
రాష్ట్రవ్యాప్తంగా దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న భూ సమస్యలకు ప్రభుత్వం ప్రాధాన్యత క్రమంలో పరిష్కారం చూపుతోంది. గత నెలలో ఏలూరు జిల్లాలో కలిదిండి మండలం గురవాయిపాలెం, ముదినేపల్లి మండలం వైవాక, మండవల్లి మండలం ఉనికిలిలో నిషేధిత జాబితాలో ఉన్న భూములకు 22-A నుంచి విముక్తి కల్పించారు. అదేవిధంగా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోనూ దీర్ఘకాలంగా వివాదాల్లో ఉన్న భూముల సమస్యలను పరిష్కరిస్తూ వేలాది కుటుంబాలకు ప్రభుత్వం ఉపశమనం కల్పిస్తోంది.
నీరు జీవం… భూమి జీవితం
వ్యవసాయానికి సాగునీరు ఎంత ముఖ్యమో, రైతు జీవితానికి భూమిపై స్పష్టమైన హక్కు కూడా అంతే ముఖ్యమనే భావనతో ప్రభుత్వం పనిచేస్తోంది. పంటకు నీటి భరోసా… ఆస్తికి హక్కు భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం. కోనసీమలో రేపటి ముఖ్యమంత్రి పర్యటనలో రైతులతో ముఖాముఖి, గ్రామసభలో పాల్గొనడం, పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీతో పాటు భూ సమస్యలకు పరిష్కారం దిశగా కీలక చర్యలు తీసుకోనున్నారు. ప్రజల మధ్య పాలన… భూమిపై హక్కుకు రాజముద్ర… సమస్యలకు శాశ్వత పరిష్కారం అనే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కోనసీమ పర్యటన సాగనుంది.
Prajavartha Online Telugu News