-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ నగర పరిధిలో శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ భవనాలను గుర్తించి తక్షణ చర్యలు చేపట్టాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఎస్టేట్ మరియు టౌన్ ప్లానింగ్ అధికారులను ఆదేశించారు.
గురువారం ఉదయం నగరంలో శిథిలావస్థలో ఉన్న ప్రైవేట్, పబ్లిక్ భవనాల పరిస్థితిపై అధికారులతో సమీక్షించిన కమిషనర్, నిర్మాణపరంగా స్థిరత్వం లేని, ప్రజలకు ప్రమాదకరంగా ఉన్న భవనాలను గుర్తించి, నిబంధనల ప్రకారం సీజ్ చేయడంతో పాటు అవసరమైన తదుపరి చర్యలు చేపట్టాలని సూచించారు.
నగరంలో ప్రభుత్వ, ప్రైవేట్ భవనాల్లో నిర్మాణ స్థిరత్వం లేని, నివాసానికి లేదా వినియోగానికి సురక్షితం కాని భవనాలను సమగ్రంగా గుర్తించి, వాటిలో నివసిస్తున్న లేదా కార్యకలాపాలు నిర్వహిస్తున్న వారిని ఖాళీ చేయించేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
వీఎంసీ పరిధిలోకి రాని, ఇతర ప్రభుత్వ శాఖలు లేదా సంస్థల పరిధిలో ఉన్న ప్రమాదకర భవనాలకు సంబంధించి ఆయా శాఖలకు వెంటనే లేఖలు రాసి, భవనాల పరిస్థితిని తెలియజేయడంతో పాటు అందులో నివసిస్తున్న వారిని ఖాళీ చేయించి, అవసరమైన చర్యలు చేపట్టేలా సమన్వయం చేసుకోవాలని కమిషనర్ ఆదేశించారు.
అదేవిధంగా విజయవాడ నగరపాలక సంస్థకు చెందిన ఎస్టేట్ ఆస్తుల్లో శిథిలావస్థకు చేరిన భవనాలను గుర్తించి, నిబంధనల ప్రకారం వాటిని వెంటనే తొలగించేందుకు (డిమాలిషన్) చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
ప్రజల ప్రాణ భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా శిథిలావస్థలో ఉన్న భవనాలపై నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని, ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న నిర్మాణాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కమిషనర్ స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో స్టేట్ ఆఫీసర్ ఏ శ్రీధర్, డిప్యూటీ సిటీ ప్లానర్ చంద్రబోస్, అసిస్టెంట్ సిటీ ప్లానర్లు రాంబాబు, మోహన్ బాబు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News