-ఇంధన శాఖ స్పెషల్ సి.ఎస్. కె. విజయానంద్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
8వ కలెక్టర్ల సదస్సులో రాష్ట్ర ఇంధన రంగానికి సంబంధించి SIPB ఆమోదించిన పెట్టుబడుల పురోగతిని ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ వివరిస్తూ రాష్ట్రంలో ఆమోదం పొందిన పెట్టుబడులను వేగంగా వాస్తవిక ప్రాజెక్టులుగా మార్చేందుకు జిల్లా కలెక్టర్లు సంబంధిత శాఖలు, NREDCAP నోడల్ అధికారులతో సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
AP ICE Policy–2024 కింద ఇప్పటివరకు 6 ప్రాజెక్టులు రూ.11,284 కోట్ల పెట్టుబడితో ప్రారంభమై, సుమారు 4,970 మందికి ఉపాధి అవకాశాలు కల్పించే స్థాయికి చేరుకున్నాయని తెలిపారు. ప్రస్తుతం 38 ప్రాజెక్టుల్లో భూసేకరణ ప్రక్రియ కొనసాగుతుండగా, మరో 9 ప్రాజెక్టులు DPR/Pre-feasibility Study దశలో ఉన్నాయని వివరించారు.
జూన్ 2024 నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో ఇంధన రంగానికి సంబంధించి 93 ప్రాజెక్టులకు రూ.4.10 లక్షల కోట్ల పెట్టుబడులు, 4.72 లక్షల ఉపాధి అవకాశాలతో భూకేటాయింపులు జరిగాయని తెలిపారు. వీటిలో 25.58 GW సౌర విద్యుత్, 5.78 GW పవన విద్యుత్, 18.95 GW పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులు, 2.2 MMTPA గ్రీన్ హైడ్రోజన్ మరియు దాని డెరివేటివ్స్, 2 GW ఎలక్ట్రోలైజర్లు, 11,497 TPD CBG సామర్థ్యం వంటి కీలక పెట్టుబడులు ఉన్నాయని పేర్కొన్నారు.
ఈ 93 ప్రాజెక్టుల్లో 33 ప్రాజెక్టులు ఇప్పటికే గ్రౌండింగ్/కమిషనింగ్ దశకు చేరుకున్నాయని, మిగిలిన 54 ప్రాజెక్టులను కూడా వేగవంతంగా గ్రౌండింగ్ చేయాల్సిన అవసరం ఉందని శ్రీ విజయానంద్ తెలిపారు. 38 ప్రాజక్టులకు భూ సేకరణ పనులు పూర్తి అయ్యాయన్నారు. మొత్తం SIPB ఆమోదిత ఇంధన ప్రాజెక్టుల్లో అక్టోబర్ చివరి నాటికి కనీసం 80% ప్రాజెక్టుల గ్రౌండింగ్‌ను సాధించడమే లక్ష్యంగా జిల్లా కలెక్టర్లు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
జిల్లాల వారీగా శ్రీ సత్యసాయి జిల్లాలో 9 ప్రాజక్టులు, కడపలో 6 ప్రాజక్టులు మరియు అనంతపురంలో 11 గ్రౌండ్ చేయాల్సి ఉందని, సంబందిత జిల్లా కలెక్టర్లు వీటిగ్రౌండింగ్పై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన కోరారు.
ప్రాజెక్టుల గ్రౌండింగ్‌కు జిల్లా కలెక్టర్ల సహకారం
ప్రతి ప్రాజెక్టుకు NREDCAP తరఫున Project Director/Designated Officerను నోడల్ అధికారిగా నియమించినందున, జిల్లా కలెక్టర్లు సంబంధిత నోడల్ అధికారులతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ ప్రాజెక్టుల గ్రౌండింగ్‌కు అవసరమైన సహాయ సహకారాలను అందించాలని విజయానంద్ కోరారు.
అలాగే, ప్రతి ప్రాజెక్టును డెవలపర్లు మరియు సంబంధిత జిల్లా శాఖలతో క్రమం తప్పకుండా సమీక్షించి, సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలు, బాధ్యతలు, గడువులను స్పష్టంగా నమోదు చేసి, వాటి అమలును పర్యవేక్షించాలని సూచించారు.
ప్రాజెక్టులకు అవసరమైన భూముల విషయంలో జాయింట్ సర్వే, భూమి స్థితిగతుల ధృవీకరణ, ప్రతిపాదిత భూమి అనుకూలంగా లేని సందర్భాల్లో ప్రత్యామ్నాయ భూముల గుర్తింపు, భూకేటాయింపు/బదలాయింపుకు సంబంధించిన ప్రతిపాదనలను వేగవంతం చేయడం వంటి చర్యలను కాలపరిమితిలో పూర్తి చేయాలని తెలిపారు.
ఇంధన ప్రాజెక్టుల వేగవంతమైన అమలుకు అవసరమైన ట్రాన్స్‌మిషన్ కారిడార్లు, అప్రోచ్ రోడ్లు, నీటి పైప్‌లైన్లు, ప్రాజెక్టు ప్రాంగణానికి రాకపోకలు, రైట్ ఆఫ్ వే (RoW) సమస్యలు తదితర స్థానిక అంశాలను జిల్లా స్థాయిలో సమన్వయంతో పరిష్కరించాలని కోరారు. అలాగే స్థానిక సంస్థలు, సంబంధిత శాఖల నుంచి అవసరమైన అనుమతులను త్వరితగతిన పొందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
భూమి కేటాయింపు నుంచి అనుమతులు, మౌలిక వసతులు, రైట్ ఆఫ్ వే, స్థానిక సమస్యల పరిష్కారం వరకు ప్రతి దశను జిల్లా స్థాయిలో నిరంతరం పర్యవేక్షించడం ద్వారా మాత్రమే ఇంధన రంగంలోని భారీ పెట్టుబడులను వేగంగా గ్రౌండింగ్ చేయగలమని కె. విజయానంద్ పేర్కొన్నారు.
రాష్ట్రంలో భారీ స్థాయిలో ప్రతిపాదితమైన పునరుత్పాదక ఇంధనం, పంప్డ్ స్టోరేజ్, గ్రీన్ హైడ్రోజన్, ఎలక్ట్రోలైజర్, CBG వంటి ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్‌ను స్వచ్ఛ ఇంధనం మరియు గ్రీన్ ఎనర్జీ రంగాల్లో అగ్రగామి పెట్టుబడి గమ్యస్థానంగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తాయని, ఈ ప్రాజెక్టుల ద్వారా పెద్ద ఎత్తున పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు సృష్టించేందుకు జిల్లా యంత్రాంగం సమన్వయంతో వేగవంతమైన చర్యలు చేపట్టాలని ఇంధన శాఖ కార్యదర్శి కె. విజయానంద్ సూచించారు.
Prajavartha Online Telugu News