Breaking News

డిజిటల్ కనెక్టివిటీ పై సమీక్ష.

-రాష్ట్రంలో మారుమూల గ్రామాలకూ వంద శాతం మొబైల్ కనెక్టివిటీ ఉండాలి…కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో డిజిటల్ కనెక్టివిటీ, మొబైల్ నెట్‌వర్క్ విస్తరణపై ఐటీ,ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ శాఖ కార్యదర్శి కాటంనేని భాస్కర్ సమగ్రమైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.రాష్ట్రంలోని ప్రతి ప్రాంతానికీ 4జీ,5జీ సేవలను నిరంతరాయంగా అందించేందుకు చేపట్టిన చర్యలను ఆయన వివరించారు. కేంద్ర ప్రభుత్వ పథకాల కింద బీఎస్ఎన్ఎల్, జియో సంస్థల ద్వారా రాష్ట్రానికి మొత్తం 1,023 టెలికాం టవర్లు మంజూరయ్యాయని తెలిపారు.వీటిలో ఇప్పటికే 143 చోట్ల పనులు పూర్తయి సిగ్నల్స్ వస్తున్నాయని, 428 చోట్ల పనులు జరుగుతున్నాయని, భూమి అప్పగించిన 423 ప్రాంతాల్లో పనులు మొదలుకావాల్సి ఉందని పేర్కొన్నారు. ఇంకా వివిధ జిల్లాల్లో 18 చోట్ల రెవెన్యూ భూమి, మరో 11 చోట్ల అటవీ భూముల క్లియరెన్స్ పెండింగ్‌లో ఉన్నాయని వివరించారు.

ఈ వివరాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందిస్తూ టవర్ల ఏర్పాటులో జాప్యంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.మారుమూల ప్రాంతాలతో సహా రాష్ట్రం నలుమూలలా కనెక్టివిటీ ఉండాలనేది ప్రభుత్వ లక్ష్యమని, అవసరమైతే ఇన్సెంటివ్‌లు కూడా ఇస్తామని ముందే చెప్పినప్పుడు అధికారులు భూమి కేటాయింపుల్లో ఎందుకు ఆలస్యం చేస్తున్నారని ప్రశ్నించారు.బాధ్యతను వేరొకరిపై నెట్టేసే పద్ధతి మానుకుని స్వయంగా బాధ్యత తీసుకుని పని చేయాలని స్పష్టం చేశారు. పెండింగ్‌లో ఉన్న 18 రెవెన్యూ స్థలాలను రాబోయే ఏడు రోజుల్లోగా టెలికాం సంస్థలకు అప్పగించాలని కలెక్టర్లకు గడువు విధించారు.అలాగే అటవీ అనుమతులు పెండింగ్‌లో ఉన్న చోట్ల, అటవీ శాఖ అధికారులతో సమన్వయం చేసుకుని పది రోజుల్లోగా క్లియరెన్స్ పూర్తి చేయాలని ఆదేశించారు. అధికారులు చొరవ తీసుకుని ముందస్తుగా పనిచేయాలని, వచ్చే కలెక్టర్ల సదస్సు నాటికి మళ్లీ ఇలాంటి కారణాలు వినడానికి తాను సిద్ధంగా లేనని హెచ్చరించారు.

రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా భూమి ఇవ్వడంతో పాటు విద్యుత్ ఖర్చులను భరిస్తూ తీసుకొచ్చిన ‘వంద శాతం టెలికాం కనెక్టివిటీ’ పథకం గురించి కూడా ఐటీ కార్యదర్శి వివరించారు.రాష్ట్ర వ్యాప్తంగా 2,359 ప్రాంతాల్లో ఎయిర్‌టెల్, జియో, వొడాఫోన్-ఐడియా, బీఎస్ఎన్ఎల్ ద్వారా టవర్ల నిర్మాణాన్ని కేటాయించామని తెలిపారు.ఒక్కో టవర్‌కు కేవలం 5 నుంచి 5.5 సెంట్ల భూమి మాత్రమే అవసరమవుతుందని, కలెక్టర్లకే నేరుగా భూమి ఇచ్చే అధికారాలు ఉన్నందున ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపకుండా స్థానికంగానే త్వరగా అప్పగించాలని కలెక్టర్లను కోరారు.దీనిపై ముఖ్యమంత్రి స్పందిస్తూ ఈ 2,359 సైట్లకు సంబంధించి నెల రోజుల్లోగా భూముల బదిలీ ప్రక్రియ పూర్తి కావాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. వచ్చే కలెక్టర్ల కాన్ఫరెన్స్ నాటికి రాష్ట్రంలో వంద శాతం కవరేజ్ సాధించాలని ఏజెన్సీ గిరిజన ప్రాంతాల్లో ఒక్క గ్రామంలో కూడా సిగ్నల్ లేని పరిస్థితి కనిపించకూడదని స్పష్టం చేశారు.

రోడ్డు లేదనే కారణంతో టవర్ల నిర్మాణాన్ని ఆపవద్దని, ఉపాధి హామీ పథకం కిందైనా మట్టి రోడ్లను చదును చేసుకుని పనులు ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.

టెలికాం అంశాలతో పాటు పలు ఇతర విభాగాల పనులపై కూడా ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. పేదల ఇళ్ల నిర్మాణానికి సంబంధించి గృహనిర్మాణ శాఖ కార్యదర్శి పది రోజుల్లో కార్యాచరణ ప్రణాళికతో రావాలని, ఏడాదిలోగా ఇళ్ల స్థలాల కేటాయింపు, ఏడాదిన్నరలోగా (2027 నాటికి) ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఇళ్లన్నీ పూర్తి కావాలని నిర్దేశించారు.

అలాగే పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ‘వేస్ట్ టు వెల్త్’ విధానంలో చెత్త రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని, ఎక్కడా చెత్త కనిపించకుండా పారిశుద్ధ్యం మెరుగుపడాలని చెప్పారు. వివిధ గ్రామాల్లో 90 శాతం పూర్తయి, చిన్నచిన్న పనుల వల్ల నిరుపయోగంగా పడి ఉన్న కమ్యూనిటీ భవనాలను గుర్తించి, వెంటనే వాటిని పూర్తి చేసి ప్రజల వినియోగానికి తీసుకురావాలని కలెక్టర్లను ఆదేశించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఈ-ఫైల్స్ క్లియరెన్స్‌లో మంత్రి అచ్చెన్నాయుడికి వరుసగా మూడోసారి మొదటి స్థానం

-వేగవంతమైన ఫైళ్ల పరిష్కారం.. సమర్థవంతమైన పనితీరుకు సీఎం చంద్రబాబు ప్రశంసలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈ-ఫైల్స్ క్లియరెన్స్‌లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *