-రేపు కేంద్ర మంత్రి జేపీ నడ్డా, ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభం
-10 అత్యవసర చికిత్స కేంద్రాలు.. 12 సమగ్ర ప్రజారోగ్య ప్రయోగశాలలు
-రాష్ట్రంలో 500 అదనపు అత్యవసర చికిత్స పడకలు అందుబాటులోకి
-వ్యాధులను ముందుగానే గుర్తించేందుకు బలమైన పరీక్షా వ్యవస్థ
-మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రజలకు అత్యవసర పరిస్థితుల్లో సకాలంలో మెరుగైన వైద్యం అందించడంతోపాటు, వ్యాధులను తొలిదశలోనే గుర్తించి నియంత్రించేందుకు రూ.249.50 కోట్లతో పూర్తి చేసిన 22 కీలక ఆరోగ్య ప్రాజెక్టులను శనివారం ప్రారంభించనున్నట్లు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఈ ప్రాజెక్టులు ప్రారంభమవుతాయని చెప్పారు. ఈ మేరకు మంత్రి సత్య కుమార్ శుక్రవారం ఓ ప్రకటన జారీచేశారు.
రాష్ట్రంలో ప్రజారోగ్య వ్యవస్థను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య మౌలిక వసతుల పథకం కింద ఈ ప్రాజెక్టులను చేపట్టినట్లు మంత్రి తెలిపారు. రేపు ప్రారంభించనున్న 22 ప్రాజెక్టుల్లో రూ.234.50 కోట్లతో నిర్మించిన 10 అత్యవసర చికిత్స కేంద్రాలు, రూ.15 కోట్లతో ఏర్పాటు చేసిన 12 సమగ్ర ప్రజారోగ్య ప్రయోగశాలలు ఉన్నాయని వివరించారు.
కరోనా అనుభవంతో ప్రత్యేక వసతులపై దృష్టి
కరోనా సమయంలో సాధారణ ఆసుపత్రుల్లోని వార్డులను కూడా కరోనా బాధితులకు కేటాయించాల్సి రావడంతో ఇతర రోగులకు సాధారణ వైద్య సేవలు అందించడంలో ఇబ్బందులు ఎదురయ్యాయని మంత్రి గుర్తు చేశారు. భవిష్యత్తులో ఇలాంటి మహమ్మారులు, వ్యాధుల విజృంభణ, ఇతర ప్రజారోగ్య అత్యవసర పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొంటూనే సాధారణ వైద్య సేవలకు అంతరాయం కలగకుండా ప్రత్యేక ఆరోగ్య వసతులు అవసరమని కరోనా అనుభవం స్పష్టం చేసిందన్నారు.
ఈ అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని అత్యవసర చికిత్స కేంద్రాలు, సమగ్ర ప్రజారోగ్య ప్రయోగశాలలను ఏర్పాటు చేస్తున్నట్లు శ్రీ సత్యకుమార్ తెలిపారు. వీటి ద్వారా ఒకవైపు ప్రాణాపాయ పరిస్థితుల్లో వేగంగా చికిత్స అందించడంతోపాటు, మరోవైపు వ్యాధులను ముందుగానే గుర్తించి వ్యాప్తిని అరికట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకునే సామర్థ్యం పెరుగుతుందన్నారు.
24 అత్యవసర చికిత్స కేంద్రాలు.. 1,275 పడకలు
రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం మొత్తం 24 అత్యవసర చికిత్స కేంద్రాలను మంజూరు చేసిందని, వీటి కోసం రూ.600.35 కోట్లు కేటాయించిందని మంత్రి తెలిపారు. 16 ప్రభుత్వ వైద్య కళాశాలల ఆసుపత్రులు, మూడు జిల్లా ఆసుపత్రులు, ఐదు ప్రాంతీయ ఆసుపత్రుల్లో వీటిని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.
మొత్తం 24 కేంద్రాలు పూర్తిగా అందుబాటులోకి వస్తే రాష్ట్రంలో 1,275 అదనపు అత్యవసర చికిత్స పడకలు సమకూరతాయని వివరించారు. వీటిలో 22 కేంద్రాల్లో ఒక్కొక్కదానిలో 50 పడకలు, ఒక కేంద్రంలో 75, మరో కేంద్రంలో 100 పడకలు ఉంటాయని తెలిపారు.
ఇప్పటికే నిర్మాణం పూర్తయిన 10 అత్యవసర చికిత్స కేంద్రాలు రేపటి ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. వీటి కోసం రూ.234.50 కోట్లు ఖర్చు చేసి 500 అదనపు పడకలను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.
ప్రాణాపాయ పరిస్థితుల్లో సత్వర వైద్యం
ఈ అత్యవసర చికిత్స కేంద్రాల్లో గుండెపోటు, గుండెకు సంబంధించిన పక్షవాతం, దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధులు, తీవ్రమైన శ్వాసకోశ ఇబ్బందులు, విషప్రయోగాలు, రక్తంలో తీవ్రమైన ఇన్ఫెక్షన్లు వంటి ప్రాణాపాయ పరిస్థితులకు అత్యవసర వైద్యం అందించవచ్చని శ్రీ సత్యకుమార్ తెలిపారు.
తల్లులు, పిల్లలకు అవసరమైన అత్యవసర వైద్యం, రక్తశుద్ధి చికిత్సకు సంబంధించిన సేవలు కూడా అందుబాటులో ఉంటాయని చెప్పారు. దీంతో తీవ్రమైన అనారోగ్య పరిస్థితుల్లో ప్రజలు దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం తగ్గి, తమ ప్రాంతాలకు దగ్గరలోనే అత్యవసర, నాణ్యమైన వైద్యం పొందే అవకాశం కలుగుతుందన్నారు.
మహమ్మారులు, వ్యాధుల విజృంభణ, ప్రకృతి విపత్తులు వంటి అత్యవసర పరిస్థితుల్లోనూ ఈ కేంద్రాలను ప్రత్యేక చికిత్స కేంద్రాలుగా ఉపయోగించుకోవచ్చని మంత్రి తెలిపారు. సాధారణ పరిస్థితుల్లో తీవ్రమైన అనారోగ్యంతో ఉన్న వారికి ప్రత్యేక చికిత్స అందించడంతోపాటు, అత్యవసర సమయాల్లో ప్రత్యేక వైద్య కేంద్రాలుగా పనిచేసేలా వీటిని రూపొందించినట్లు చెప్పారు.
10 ప్రాంతాల్లో సిద్ధమైన కేంద్రాలు
శనివారం ప్రారంభించనున్న 10 అత్యవసర చికిత్స కేంద్రాలు కడప, నెల్లూరు, శ్రీకాకుళం, విశాఖపట్నం, ఒంగోలు, అనకాపల్లి, రాజమహేంద్రవరం, కర్నూలు, హిందూపురం, విజయవాడల్లో ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు.
వాటిలో కడప ప్రభుత్వ వైద్య కళాశాల, నెల్లూరు ఏసీఎస్‌ఆర్ ప్రభుత్వ వైద్య కళాశాల, శ్రీకాకుళం ప్రభుత్వ వైద్య కళాశాల, విశాఖపట్నం ప్రభుత్వ వైద్య కళాశాల, ఒంగోలు ప్రభుత్వ వైద్య కళాశాల, అనకాపల్లి జిల్లా ఆసుపత్రి, రాజమహేంద్రవరం ప్రభుత్వ వైద్య కళాశాల, కర్నూలు ప్రభుత్వ వైద్య కళాశాల, హిందూపురం జిల్లా ఆసుపత్రి, విజయవాడ ప్రభుత్వ వైద్య కళాశాల ఉన్నాయని వివరించారు.
కడప, నెల్లూరు, శ్రీకాకుళం, విశాఖపట్నం, ప్రకాశం, తూర్పుగోదావరి, కర్నూలు, ఎన్టీఆర్ జిల్లాల్లో ఏర్పాటు చేసిన ఎనిమిది కేంద్రాలకు రూ.23.75 కోట్ల చొప్పున, అనకాపల్లి, శ్రీసత్యసాయి జిల్లాల్లోని రెండు కేంద్రాలకు రూ.22.25 కోట్ల చొప్పున ఖర్చు చేసినట్లు మంత్రి తెలిపారు. ఈ పది కేంద్రాల మొత్తం వ్యయం రూ.234.50 కోట్లు అని చెప్పారు.
12 సమగ్ర ప్రజారోగ్య ప్రయోగశాలలు
రాష్ట్రంలో మొత్తం 26 సమగ్ర ప్రజారోగ్య ప్రయోగశాలలను ఏర్పాటు చేస్తున్నామని, వాటిలో 12 ప్రయోగశాలలు రేపు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని మంత్రి తెలిపారు. ఒక్కో ప్రయోగశాలకు రూ.1.25 కోట్ల చొప్పున మొత్తం రూ.15 కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు.
ప్రతి ప్రయోగశాలలో నిర్మాణ పనులకు రూ.40 లక్షలు, అవసరమైన పరికరాల కోసం రూ.85 లక్షలు కేటాయించినట్లు వివరించారు.
ఈ ప్రయోగశాలలు జిల్లా స్థాయిలో ప్రజారోగ్య పరీక్షలకు కీలక కేంద్రాలుగా పనిచేస్తాయని తెలిపారు. వ్యాధుల నిర్ధారణతోపాటు వివిధ ఆరోగ్య కార్యక్రమాలకు అవసరమైన పరీక్షలు నిర్వహిస్తాయన్నారు. వ్యాధి ముప్పును ముందుగానే గుర్తించి, వ్యాధి వ్యాప్తిని అరికట్టేందుకు తక్షణ చర్యలు తీసుకునే అవకాశం వీటి ద్వారా కలుగుతుందని చెప్పారు.
సీతంపేట నుంచి గూడూరు వరకు
శనివారం ప్రారంభించనున్న 12 సమగ్ర ప్రజారోగ్య ప్రయోగశాలలను రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు.
పార్వతీపురం మన్యం జిల్లాలోని సీతంపేట, అనంతపురం జిల్లాలోని గుంతకల్లు, చిత్తూరు జిల్లాలోని పలమనేరు, విశాఖపట్నం జిల్లాలోని అగనంపూడి, ఎన్టీఆర్ జిల్లాలోని నందిగామ, బాపట్ల జిల్లాలోని చీరాల, అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అరకు, పల్నాడు జిల్లాలోని నరసరావుపేట, నంద్యాల జిల్లాలోని బనగానపల్లి, తూర్పుగోదావరి జిల్లాలోని అనపర్తి, కాకినాడ జిల్లాలోని తుని, నెల్లూరు జిల్లాలోని గూడూరులో ఈ ప్రయోగశాలలు ఏర్పాటు చేసినట్లు వివరించారు.
ఇప్పటికే 14 ప్రజారోగ్య ప్రయోగశాలల నిర్మాణం పూర్తై పనిచేస్తున్నాయని, మిగిలిన 12 ప్రయోగశాలల నిర్మాణం కూడా పూర్తయి ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని చెప్పారు.
వ్యాధులపై నిఘా మరింత బలోపేతం
ఈ ప్రయోగశాలల ద్వారా వ్యాధులపై నిఘా వ్యవస్థ మరింత బలోపేతమవుతుందని శ్రీ సత్యకుమార్ తెలిపారు. వ్యాధుల విజృంభణను తొలిదశలోనే గుర్తించడం, పరీక్షల ద్వారా వ్యాధులను నిర్ధారించడం, పరీక్షల ఫలితాల ఆధారంగా ప్రజారోగ్య చర్యలు చేపట్టే సామర్థ్యం పెరుగుతుందన్నారు.
జిల్లా పరిధిలోని ఇతర పరీక్షా కేంద్రాలకు సాంకేతిక సహకారం అందించడం, నమూనాలు సేకరించడం, పరీక్షలు నిర్వహించడం, అవసరమైన సందర్భాల్లో తదుపరి పరీక్షల కోసం నమూనాలను పంపించడం వంటి కీలక సేవలను ఈ ప్రయోగశాలలు అందిస్తాయని చెప్పారు.
ఆరోగ్య మౌలిక వసతులపై ఎనిమిది రెట్లు అధిక వ్యయం
రాష్ట్రంలో ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య మౌలిక వసతుల పథకం అమలును ప్రభుత్వం వేగవంతం చేసిందని మంత్రి తెలిపారు.
2019–24 మధ్య కేవలం రూ.28.85 కోట్లు ఖర్చు కాగా.. 2024 జూన్ నుంచి ఇప్పటివరకు రూ.229.29 కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించారు. గత కాలంతో పోలిస్తే ఇది దాదాపు ఎనిమిది రెట్లు అధికమని చెప్పారు.
ప్రజలకు ప్రభుత్వ వైద్య సేవలను మరింత చేరువ చేయడంతోపాటు, అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనే సామర్థ్యాన్ని పెంచేందుకు ఆరోగ్య మౌలిక వసతుల పనులను వేగంగా పూర్తి చేస్తున్నట్లు సత్యకుమార్ తెలిపారు.
మిగిలిన 14 కేంద్రాలకు 2027 ఏప్రిల్ 30 గడువు
రాష్ట్రానికి మంజూరైన 24 అత్యవసర చికిత్స కేంద్రాల్లో ఇప్పటికే 10 కేంద్రాలు ప్రారంభానికి సిద్ధమయ్యాయని మంత్రి తెలిపారు. మిగిలిన 14 కేంద్రాల నిర్మాణాన్ని 2027 ఏప్రిల్ 30లోగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు.
Prajavartha Online Telugu News