విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రతి క్రీడాకారుడు ఛాంపియన్ కాలేక పోయినా, క్రీడలు జీవితంలో ఎలా రాణించాలో నేర్పుతాయని సి.ఆర్. మీడియా అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేశ్ కుమార్ అన్నారు. స్థానిక ఇందిరాగాంధీ స్టేడియుం లో “యూత్ స్పోర్ట్స్ రిక్రియేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సౌత్ ఇండియా టెన్నిస్ పోటీలలో విజేతలను ఉద్దేశించి ఆయన ఆదివారం ప్రసంగించారు. క్రీడలు జీవితంలో లక్ష్యాన్ని ఏర్పరుచుకోవడానికి, వాటిని సాధించడానికి పట్టుదలతో, క్రమశిక్షణ తో పనిచేసేందుకు దోహద పడతాయని ఆయన అన్నారు. క్రీడాకారులుగా ఎదిగే ప్రతి ఒక్కరూ ఉన్నత లక్ష్యాల్ని నిర్దేశించుకుని వాటిని సాధించేందుకు కృషిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.
ప్రస్తుతం ఆధునిక యుగంలో ఉన్నక్రీడాకారులందరూ తమకు అందుబాటులోవున్న స్పోర్ట్స్ ఛానెల్స్ ద్వారా తమ ప్రతిభకు పదునుపెట్టుకునే అవకాశాన్ని అందిపుచ్చుకోవాలన్నారు. టెన్నిస్ వంటి పవర్ గేమ్ కు సరైన ప్రోత్సాహం అవసరమన్నారు. స్పాన్సరర్లు క్రీడాకారులనుఁ ప్రోత్సహించేందుకు ముందుకు రావాలని ఆయన పిలుపు నిచ్చారు. దేశంలో క్రికెట్ కు ఉన్నంత ప్రోత్సాహం మరే ఇతర క్రీడకు లేకపోవడం సరైందికాదని అన్నారు. క్రీడల పట్ల ఈ తరం పిల్లల్ని ప్రోత్సహిస్తున్న దుర్గాకుమార్ వంటి వ్యక్తులు అభినందనీయులని ఆయన ప్రశంసించారు. విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు బహుమతులు అందచేశారు.
“యూత్ స్పోర్ట్స్ రిక్రియేషన్ ట్రస్ట్ అధ్యక్షులు ఎస్. దుర్గా కుమార్ మాట్లాడుతూ, ఆరు విభాగాలుగా క్రీడాకారులకు పోటీలు ప్రతినెలా, రెండో ఆదివారం నిర్వహిస్తున్నామని తెలిపారు. స్పాన్సరర్లు లేకుండా, కేవలం వ్యక్తిగతంగానే ఈ పోటీల నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. టెన్నిస్ క్రీడ పట్ల తమకున్న మక్కువతో పుస్తకాలు రచించామని ఆయన పేర్కొన్నారు. ప్రాధమిక దశలో వున్న టెన్నిస్ క్రీడాకారులకు సరైన మార్గనిర్దేశం చేయడం తమ అభిమతమని అన్నారు. కోచ్ శ్రీనివాస రావు , అనురాధ, పలువురు క్రీడాకారులు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News