-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజల నుంచి అందే ప్రతి ఫిర్యాదును అత్యంత బాధ్యతతో స్వీకరించి, క్షేత్రస్థాయిలో సమగ్రంగా పరిశీలించి సమస్యకు శాశ్వత పరిష్కారం అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశించారు. సోమవారం ఉదయం వీఎంసీ ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్‌లో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో కమిషనర్ ప్రజల నుంచి వినతులను స్వీకరించి, సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు.
ప్రధాన కార్యాలయంతో పాటు జోనల్ కార్యాలయాల్లో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమాలను కమిషనర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. గతంలో ప్రజల నుంచి అందిన ఫిర్యాదుల పరిష్కార పురోగతిని శాఖాధిపతులను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించే సమస్యలను పెండింగ్‌లో ఉంచకుండా, నిర్దిష్ట కాలవ్యవధిలో పరిష్కరించాలని ఆదేశించారు. ఫిర్యాదు అందిన వెంటనే సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, సమస్యకు మూల కారణాలను గుర్తించి పరిష్కారం చూపాలని సూచించారు.
నగర పరిధిలోని ప్రతి సచివాలయంలో ప్రతి సోమవారం ఉదయం 9.30 గంటలకు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక తప్పనిసరిగా ప్రారంభం కావాలని కమిషనర్ ఆదేశించారు. సచివాలయాలకు వచ్చే ప్రజల నుంచి వినతులను స్వీకరించి, సంబంధిత శాఖలకు వెంటనే పంపిస్తూ, వాటిని సకాలంలో పరిష్కరించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం అనవసరంగా కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి లేకుండా స్థానిక స్థాయిలోనే ఫిర్యాదులను పరిష్కరించే విధంగా అధికారులు పనిచేయాలని తెలిపారు.
మున్సిపల్ సేవల కోసం అందుబాటులో ఉన్న “పురమిత్ర” యాప్‌లో నమోదవుతున్న ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, నిర్ణీత సమయంలో పరిష్కరించాలని కమిషనర్ సూచించారు. ఒక శాఖకు సంబంధించిన ఫిర్యాదును మరో శాఖకు బదిలీ చేస్తూ కాలయాపన చేయకుండా, అవసరమైన చోట శాఖల మధ్య సమన్వయం చేసుకుని సమస్యను పరిష్కరించాలని అధికారులకు స్పష్టం చేశారు. ప్రజలకు నాణ్యమైన సేవలు అందించడంలో శాఖల మధ్య సమర్థవంతమైన సమన్వయం ఎంతో కీలకమని పేర్కొన్నారు.
ఈ సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో మొత్తం 20 ఫిర్యాదులు అందినట్లు అధికారులు తెలిపారు. వీటిలో పట్టణ ప్రణాళిక శాఖకు సంబంధించి అక్రమ నిర్మాణాలు, రోడ్ల ఆక్రమణలకు సంబంధించిన 7 ఫిర్యాదులు, ఇంజనీరింగ్ శాఖకు 6, పబ్లిక్ హెల్త్ శాఖకు 3, రెవెన్యూ శాఖకు 3, ఎస్టేట్ శాఖకు 1 ఫిర్యాదు అందినట్లు కమిషనర్‌కు వివరించారు.
ప్రతి ఫిర్యాదును సంబంధిత అధికారులు స్వయంగా పరిశీలించి, సమస్యకు శాశ్వత పరిష్కారం అందించేలా చర్యలు తీసుకోవాలని కమిషనర్ ఆదేశించారు. తాత్కాలిక చర్యలతో సమస్యను ముగించకుండా, అదే సమస్య తిరిగి పునరావృతం కాకుండా అవసరమైన శాశ్వత చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను కేవలం దరఖాస్తులుగా కాకుండా, నగర పాలనను మరింత మెరుగుపరిచేందుకు వచ్చిన సూచనలుగా పరిగణించాలని తెలిపారు.
ప్రజల నమ్మకాన్ని నిలబెట్టే విధంగా అధికారులు పారదర్శకత, జవాబుదారీతనం, సమర్థవంతమైన పనితీరుతో విధులు నిర్వహించాలని కమిషనర్ ధ్యానచంద్ర సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం, జాప్యానికి తావులేకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ, ప్రజలకు మెరుగైన పౌర సేవలు అందించాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్లు ఏ. రవీంద్రరావు, డాక్టర్ డి. చంద్రశేఖర్, కె. శకుంతల, చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ (ఇన్‌చార్జి) డాక్టర్ గోపాల్ కృష్ణ నాయక్, డిప్యూటీ కమిషనర్ (రెవెన్యూ) సృజన, పర్యవేక్షణ ఇంజనీర్లు చంద్రశేఖర్, కె. దుష్యంత్, అకౌంట్స్ ఆఫీసర్ బి. సత్యనారాయణమూర్తి, ఎస్టేట్ ఆఫీసర్ ఏ. శ్రీధర్, డిప్యూటీ డైరెక్టర్ (హార్టికల్చర్) చంద్రశేఖర్, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ డి. హరీష్, బయాలజిస్ట్ సూర్యకుమార్ నాయక్, స్టేషన్ ఫైర్ ఆఫీసర్ నరేష్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News