Breaking News

పనిచేయని అగ్నిమాపక పరికరాలను మూడు రోజుల్లోగా పునరుద్ధరించాలి

-లేనిపక్షంలో అనుమతుల రద్దు : వీఎంసీ ఫైర్ అధికారులు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరంలో ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ అగ్నిప్రమాదాల నివారణకు అవసరమైన ఫైర్ సేఫ్టీ నిబంధనల అమలు, అగ్నిమాపక పరికరాల పనితీరుపై విజయవాడ నగరపాలక సంస్థ ఫైర్ విభాగం ప్రత్యేక దృష్టి సారించింది. కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు సోమవారం నగరంలోని నలిని గ్యాస్ట్రో హాస్పిటల్‌, పటమట లో రీజినల్ ఫైర్ ఆఫీసర్ సిహెచ్ రత్నబాబు ఆకస్మిక తనిఖీ నిర్వహించారు.

ఈ సందర్భంగా హాస్పిటల్‌లో ఏర్పాటు చేసిన అగ్నిమాపక పరికరాలు, ఫైర్ సేఫ్టీ ఏర్పాట్లు, అత్యవసర నిష్క్రమణ మార్గాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తనిఖీల్లో కొన్ని అగ్నిమాపక పరికరాలు సక్రమంగా పనిచేయని స్థితిలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అత్యవసర సమయంలో ఫైర్ సేఫ్టీ పరికరాలు పనిచేయకపోవడం వల్ల ప్రాణ, ఆస్తి నష్టం జరిగే అవకాశం ఉన్నందున దీనిని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

పనిచేయని అగ్నిమాపక పరికరాలను మూడు రోజుల్లోగా పూర్తిస్థాయిలో పునరుద్ధరించి, వినియోగానికి సిద్ధంగా ఉంచాలని హాస్పిటల్ యాజమాన్యాన్ని అధికారులు ఆదేశించారు. నిర్దేశిత గడువులోగా పరికరాలను పునరుద్ధరించకపోతే, సంబంధిత అనుమతుల రద్దు కోసం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారికు సిఫార్సులు పంపిస్తామని అధికారులు స్పష్టం చేశారు.

ప్రజలు అధికంగా రాకపోకలు సాగించే ఆసుపత్రుల్లో ప్రజల భద్రతే ప్రధాన లక్ష్యంగా ఫైర్ సేఫ్టీ ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని అధికారులు సూచించారు. అగ్నిమాపక పరికరాలను క్రమం తప్పకుండా తనిఖీ చేయడంతో పాటు, అవసరమైన సర్వీసింగ్, నిర్వహణను ఎప్పటికప్పుడు చేపట్టాలని తెలిపారు.

అత్యవసర పరిస్థితుల్లో రోగులు, సిబ్బంది, సందర్శకులను సురక్షితంగా బయటకు తరలించేందుకు అత్యవసర నిష్క్రమణ మార్గాలు స్పష్టంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, అవసరమైన సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. హాస్పిటల్ సిబ్బందికి అగ్నిమాపక పరికరాల వినియోగం, అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పించారు.

నగరంలోని ఆసుపత్రులు, వాణిజ్య సముదాయాలు, విద్యాసంస్థలు, సంస్థలు మరియు ఇతర ప్రజా వినియోగ ప్రదేశాల్లో ఫైర్ సేఫ్టీ నిబంధనల అమలుపై ఆకస్మిక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని ఫైర్ విభాగం అధికారులు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై నిబంధనల మేరకు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ పర్యటనలో స్టేషన్ ఫైర్ ఆఫీసర్ నరేష్, ఫైర్ సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *