-ఇంటింటికీ తిరుగుతూ ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల కరపత్రాల పంపిణీ
-రూ.9.5 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించిన ఎమ్మెల్యే
-చాగంటిపాడు తూర్పు డొంక రోడ్డు నిర్మాణానికి రూ.50 లక్షలు కేటాయింపు
-జల జీవన్ మిషన్ కింద వాటర్ ట్యాంక్ అభివృద్ధికి మరో రూ.50 లక్షలు మంజూరు
-గ్రామంలో మిగిలిన సిమెంట్ రోడ్ల కోసం రూ.18.65 లక్షలు మంజూరు చేశాం : ఎమ్మెల్యే
-చాగంటిపాడును ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే లక్ష్యం: యార్లగడ్డ
-గత ఎన్నికల్లో 327 ఓట్ల మెజారిటీ ఇచ్చిన చాగంటిపాడు ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు
-పవన్ కళ్యాణ్‌ను ఉంగుటూరు మండలానికి తీసుకురావడానికి ప్రయత్నిస్తా : యార్లగడ్డ
గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఉంగుటూరు మండలం చాగంటిపాడు గ్రామంలో నిర్వహించిన ‘2 ఏళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం’ కార్యక్రమంలో ఏపీ ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పాల్గొన్నారు. కూటమి నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటికీ తిరుగుతూ గత రెండేళ్లలో ఎన్డీయే ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, గన్నవరం నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి పనులను కరపత్రాల ద్వారా ప్రజలకు వివరించారు. అనంతరం రూ.9.50 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాజకీయ విమర్శల కంటే అభివృద్ధి కార్యక్రమాలే ప్రజలకు మేలు చేస్తాయని అన్నారు. చాగంటిపాడు గ్రామ ప్రజలు ఎన్నో ఏళ్లుగా కోరుతున్న తూర్పు డొంక రహదారి సమస్యను పరిష్కరించేందుకు రూ.50 లక్షలు కేటాయించినట్లు తెలిపారు. గతంలో పలుమార్లు శంకుస్థాపనలు జరిగినా పనులు పూర్తి కాలేదని, ఈసారి నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించే దశకు తీసుకొచ్చామని చెప్పారు. జల జీవన్ మిషన్ కింద వాటర్ ట్యాంక్ అభివృద్ధికి మరో రూ.50 లక్షలు మంజూరు చేసినట్లు వెల్లడించారు. గ్రామంలో మిగిలి ఉన్న 264 మీటర్ల సిమెంట్ రోడ్డు నిర్మాణానికి రూ.18.65 లక్షలు ఆమోదించామని, అవి పూర్తయితే గ్రామంలో ప్రధాన రహదారి సమస్యలు పూర్తిగా పరిష్కారమవుతాయని తెలిపారు. ఇప్పటికే గ్రామంలో రూ.68 లక్షల విలువైన అభివృద్ధి పనులు చేపట్టినట్లు వివరించారు. విద్యుత్ సమస్యల పరిష్కారానికి రూ.40 లక్షలతో 152 విద్యుత్ స్తంభాల మార్పిడి చేపట్టామని, గ్రామస్తులు కోరిన బోర్‌వెల్ ఏర్పాటు కోసం అధికారులకు ఆదేశాలు ఇచ్చామని చెప్పారు. ఒక ప్రాంతంలో ఉన్న డ్రైనేజీ సమస్యను కూడా త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. గ్రామంలో పరిశుభ్రత నిర్వహణలో అధికారులు, సచివాలయ సిబ్బంది బాగా పనిచేస్తున్నారని అభినందించారు. చాగంటిపాడు తనకు ఎంతో ప్రత్యేకమైన గ్రామమని, గత ఎన్నికల్లో 327 ఓట్ల మెజారిటీ ఇచ్చి అండగా నిలిచిన ప్రజల విశ్వాసాన్ని ఎప్పటికీ మరవలేనని అన్నారు. గన్నవరం నియోజకవర్గంలో కూటమికి అత్యధిక శాతం మద్దతు తెలిపిన గ్రామాల్లో చాగంటిపాడు ఒకటని పేర్కొన్నారు. అధిక విద్యుత్ బిల్లుల సమస్యను ఎదుర్కొంటున్న కుటుంబాలు సౌర విద్యుత్ పథకాలను వినియోగించుకోవాలని సూచించారు. గత ప్రభుత్వ హయాంలో గ్రామాలను నిర్లక్ష్యం చేశారని, తాము మాత్రం సమస్యలను గుర్తించి పరిష్కరిస్తూ ముందుకు సాగుతున్నామని విమర్శించారు. రాబోయే కాలంలో తూర్పు డొంక రహదారి, వాటర్ ట్యాంక్, సిమెంట్ రోడ్లు తదితర పనులతో గ్రామంలో మరో రూ.1.35 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలు అమలులోకి వస్తాయని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడమే తన లక్ష్యమని స్పష్టం చేసిన యార్లగడ్డ వెంకట్రావు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అవకాశం లభిస్తే భవిష్యత్తులో పవన్ కళ్యాణ్‌ను ఈ ప్రాంతానికి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువత, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News