Breaking News

త‌ల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ల‌కు మహిళా డ్రైవర్లు

-మహిళా సాధికారతలో మరో ముంద‌డుగు..
-తల్లీబిడ్డల సేవల్లో అత్యాధునిక సౌకర్యాల క‌ల్ప‌న‌
-తప్పుడు లెక్కలతో వైకాపా దుష్ప్రచారం
-డీఎస్సీ నియమాకాలపైనా ఆ పార్టీ వైఖ‌రి గ‌ర్హ‌నీయం
-మంత్రి సత్యకుమార్ యాదవ్ ధ్వ‌జం
-నరసరావుపేటలో నూతన అత్యాధునిక 102 అంబులెన్స్ సర్వీసులను ప్రారంభించిన మంత్రి
-ఒకే రోజు రాష్ట్ర వ్యాప్తంగా 300 వాహనాలు ప్రారంభం
మ‌రో రెండు నెల‌ల్లో 200 కొత్త వాహ‌నాల్ని సిద్దం చేస్తామ‌ని వెల్ల‌డించిన మంత్రి

న‌ర‌స‌రావుపేట‌, నేటి పత్రిక ప్రజావార్త :
మహిళలకు ఉద్యోగావకాశాలు, ఆర్థిక స్వావలంబన కల్పించడంలో భాగంగా 102 తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ వాహనాలకు మహిళా డ్రైవర్లను నియమించే దిశగా చర్యలు చేపడుతున్నామని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి శ్రీ సత్యకుమార్‌ యాదవ్‌ తెలిపారు. మహిళలు అన్ని రంగాల్లోనూ సమర్థంగా పనిచేస్తున్నారని.. డ్రైవింగ్‌ కూడా వారికి సాధ్యమేనని చెప్పారు. 102 వాహనాల నిర్వహణ సంస్థ‌(క‌న్సార్టియం ఆఫ్ విద్యా వేదా ఫౌండేష‌న్ అండ్ శ్రీనివాసా టూర్స్ అండ్ ట్రావెల్స్‌) మహిళా డ్రైవర్ల నియామకానికి ప్రతిపాదన చేసిందని.. ప్రభుత్వం దీనిపై సానుకూలంగా ఉందన్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేట లోని ఏరియా ఆసుపత్రి వద్ద మంగళవారం 102 ఆధునిక అంబులెన్స్ ల సేవలను ప్రారంభించి, మంత్రి మాట్లాడారు.

102.. 104.. 108.. ఒకే లక్ష్యం

గర్భధారణ నుంచి ప్రసవం వరకు 102, అత్యవసర పరిస్థితుల్లో 108, గ్రామస్థాయిలో పరీక్షలు–చికిత్సలకు 104 సేవలను అనుసంధానిస్తూ సమగ్ర ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తెలిపారు. ప్రజలు ఆసుపత్రుల చుట్టూ తిరిగే అవసరం తగ్గించి.. అవసరమైన సేవలను వీలైనంత వరకు వారి వద్దకే తీసుకెళ్లడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.

తల్లీబిడ్డలకు మరింత భరోసా

102 తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ సేవలను ప్రసవం అనంతరం ఆసుపత్రి నుంచి ఇంటికి చేర్చడానికే పరిమితం చేయకుండా గర్భధారణ దశ నుంచే విస్తరిస్తున్నామని మంత్రి తెలిపారు. యాంటీనాటల్‌ చెకప్‌లకు వెళ్లే గర్భిణులు 102 సేవలను వినియోగించుకోవచ్చని చెప్పారు. హైరిస్క్‌ ప్రెగ్నెన్సీ కేసులను ఆసుపత్రికి తరలించడంతోపాటు రక్తహీనతతో బాధపడే గర్భిణులకు అవసరమైన చికిత్స అందేలా సేవలను విస్తరిస్తున్నామని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 500 కొత్త 102 వాహనాలు అందుబాటులోకి తెస్తున్నామని.. తొలి విడతలో 300, మరో రెండు నెలల్లో 200 వాహనాలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. వాహనాల్లో ఏసీ, ఆరు ఎయిర్‌బ్యాగులు, ఫుట్‌రెస్ట్‌, జీపీఎస్‌ ట్రాకింగ్‌, అత్యవసర ఎస్‌వీఎస్‌ బటన్‌ వంటి సదుపాయాలు కల్పించామని తెలిపారు.

108, 104లోనూ మార్పులు

అత్యవసర వైద్య సేవల్లో 108ను బలోపేతం చేశామని మంత్రి తెలిపారు. అంబులెన్సుల సంఖ్యను 602 నుంచి 733కు పెంచామని.. సుమారు 170 అధునాతన జీవనాధార సదుపాయాలున్న వాహనాలు ఉన్నాయని చెప్పారు. పట్టణ, గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో అంబులెన్స్‌ చేరే సమయాన్ని కూడా తగ్గించామని తెలిపారు. 104 మొబైల్‌ మెడికల్‌ యూనిట్ల ద్వారా గ్రామాల్లోనే 41 రకాల పరీక్షలు ఉచితంగా నిర్వహించేలా సేవలను విస్తరిస్తున్నామని చెప్పారు. పరీక్షల ఫలితాల ఆధారంగా తదుపరి వైద్య సేవలను అందించేలా సంజీవని వేదికను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.

102 ఖర్చుపై వైకాపా ఆరోపణలను వాస్తవ లెక్కలతో తిప్పికొట్టిన మంత్రి

102 నిర్వహణకు ప్రభుత్వం ఎక్కువ ఖర్చు (రెట్టింపు) చేస్తోందంటూ వస్తున్న విమర్శలను మంత్రి శ్రీ సత్యకుమార్ తిప్పికొట్టారు. కొత్త వాహనాలు, ఏసీ, ఆరు ఎయిర్‌బ్యాగులు, జీపీఎస్‌, అత్యవసర స్పందన వ్యవస్థ వంటి అదనపు సదుపాయాలతో సేవల ప్రమాణాలను పెంచామని చెప్పారు. పెరిగిన వాహనాల ధరలు, కల్పించిన ఆధునిక సేవల కారణంగా ధరలు పెరిగాయని పేర్కొన్నారు. “వాహనాలు కొత్తవి.. సదుపాయాలు కొత్తవి.. పర్యవేక్షణ కొత్తది. గతంలో ఉన్న ఖర్చుతోనే ఇప్పుడు అదే స్థాయి సేవలు ఇవ్వడం ఎలా సాధ్యం?” అని మంత్రి ప్రశ్నించారు. కార్య‌క్ర‌మం అనంత‌రం విలేక‌ర్ల‌కు అంబులెన్సులో ఉన్న అత్యాధునిక సౌక‌ర్యాల (ఎయిర్ బ్యాగులు, బాలింతులు ఎక్కేందుకు ఏర్పాటు ఇత‌ర‌) గురించి వివ‌రించారు.

వైకాపా హయoలో లేని వాహనాలకు బిల్లుల చెల్లింపులు చేశారు

గతంలో 102లో 500 వాహనాలు ఉండాల్సి ఉండగా 300లోపే వాహనాలు అందుబాటులో ఉన్నా.. 500 వాహనాలకు బిల్లులు చెల్లించిన పరిస్థితి ఉందని ఆరోపించారు. ఇప్పుడు ప్రతి వాహనం ఎక్కడుందో, ఎప్పుడు బయలుదేరిందో, ఎక్కడికి వెళ్లిందో జీపీఎస్‌తో పర్యవేక్షిస్తున్నామని తెలిపారు.

ఎన్టీఆర్‌ వైద్యసేవలపై విమర్శలు అర్ధరహితం, అవాస్తవం

ఎన్టీఆర్‌ వైద్యసేవలను ప్రభుత్వం నిలిపివేసిందంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారాన్ని మంత్రి ఖండించారు. “ఆరోగ్యశ్రీ ఆగలేదు.. పేరు మాత్రమే ఎన్టీఆర్‌ వైద్యసేవగా మారింది” అని మంత్రి శ్రీ సత్యకుమార్ స్పష్టం చేశారు. 2019–24 మధ్య ఐదేళ్లలో ఎన్టీఆర్‌ వైద్యసేవల కింద సుమారు రూ.9 వేల కోట్లు ఖర్చు కాగా.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే సుమారు రూ.7 వేల కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. గతంలో ఏడాదికి సగటున 8.2 లక్షల మంది లబ్ధి పొందితే.. ప్రస్తుతం ఏడాదికి సగటున 14.5 లక్షల మంది లబ్ధి పొందుతున్నారని చెప్పారు.
“సేవలు ఆగిపోయాయని ఎలా అంటారు? ఖర్చు పెరిగింది.. లబ్ధిదారుల సంఖ్య కూడా పెరిగింది. మరి సేవలు నిలిచిపోయాయని చెప్పడం ఎలా సాధ్యం?” అని మంత్రి ప్రశ్నించారు.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో పెరిగిన సేవలు

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైద్య, నర్సింగ్‌, పారామెడికల్‌ తదితర విభాగాల్లో సుమారు 12 వేల నియామకాలు చేపట్టామని మంత్రి తెలిపారు. సిబ్బంది అందుబాటులోకి రావడంతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఓపీ, ఐపీ సేవలు పెరిగాయని చెప్పారు. నరసరావుపేట ఆసుపత్రిలో మేజర్‌ సర్జరీలు 3,248 నుంచి 4,321కు, ఎక్స్‌రేలు 14 వేల నుంచి 15,450కు, ఈసీజీలు 5,832 నుంచి 6,900కు పెరిగాయని వివరించారు.

‘డీఎస్సీ’పై అనర్హులతో దుష్ప్రచారం

డీఎస్సీ నియామకాలపై ప్రతిపక్షం చేస్తున్న ఆరోపణలను మంత్రి శ్రీ సత్యకుమార్‌ ఖండించారు. నియామక ప్రక్రియలో అవకతవకలు జరిగాయని ఎవరైనా భావిస్తే ఆధారాలతో ముందుకు రావాలని రాష్ట్ర మంత్రి శ్రీ లోకేష్ స్పష్టంగా చెప్పినప్పటికీ ప్రతిపక్షం ముందుకు రాలేదన్నారు.
‘ ఆరోపణలు చేయడం కాదు.. ఆధారాలతో చర్చకు రండి. డీఎస్సీ నియామకాలపై బహిరంగ చర్చకు ప్రభుత్వం సిద్ధం. నిజంగా బాధితులు ఉంటే వారు ముందుకు రావాలి. అనర్హుల ద్వారా తప్పుడు ప్రచారం చేయిస్తు న్నారు ‘ అని మంత్రి మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ చక్రధర్ బాబు మాట్లాడుతూ ప్ర‌భుత్వాసుప‌త్రుల్లో స‌దుపాయాల‌ను మెరుగుప‌రుస్తోంద‌ని, దానిక‌నుగుణంగా వైద్య స‌దుపాయాల‌ను కూడా ప్ర‌జ‌ల‌కు చేరువ చేసేందుకు వైద్య సిబ్బంది కృషి చేయాల‌ని కోరారు. ఈ కార్యక్ర‌మంలో జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా, ఎమ్మెల్యే అరవింద్ బాబు, జాతీయ ఆరోగ్య మిషన్ రాష్ట్ర ప్రాజెక్ట్ మేనేజర్ జె. విజయలక్ష్మి, ఇతర అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

300 వాహనాల ప్రారంభo

మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ నరసరావుపేటలో 50 వాహనాలు ప్రారంభించారు. దీనికి అనుగుణoగా జిల్లాల్లోనూ అంబులెన్సు ల సేవలు (మొత్తం 300) అధికారులు, ప్రజాప్రతినిధుల ద్వారా ప్రారంభo అయ్యాయి. ఈ సంద‌ర్భాన్ని పుర‌స్క‌రించుకుని న‌ర‌స‌రావుపేట‌లో నిర్వ‌హ‌ణ సంస్థ ముఖ్య ప్ర‌తినిధి రంగ‌నాధ‌బాబు న‌ర‌స‌రావుపేట‌లో మాట్లాడుతూ వాహ‌నాల‌ను త‌యారు చేసిన సంస్థ ద్వారానే అంబులెన్సులకు మ‌ర‌మ్మ‌తులు, ఇత‌ర చ‌ర్య‌లు ఉండేలా ఒప్పందాన్ని చేసుకున్నామ‌ని చెప్పారు. దీనివ‌ల్ల త‌మ స‌ర్వీసుల‌కు ఎటువంటి అవ‌రోధం ఏర్ప‌డ‌ద‌ని తెలిపారు.

అంబులెన్సును నడిపిన మంత్రి శ్రీ సత్యకుమార్

ఏరియా ఆసుపత్రి నుంచి ఎమ్మెల్యే అరవింద్ బాబు ఇంటి వరకు మంత్రి స్వయంగా అంబులెన్సు నడిపారు. ఈ దృశ్యాలు స్థానికులను ఆకట్టుకున్నాయి.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *