Breaking News

తోతాపురి మామిడి రైతులకు మద్దతు ధర అమలులో రాష్ట్ర ప్రభుత్వం విఫలం

-లోక్‌సభలో తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి ప్రశ్నతో వెల్లడైన వాస్తవాలు

న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్‌లో, ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో తోతాపురి మామిడి రైతులు ఎదుర్కొంటున్న తీవ్ర ధరల సంక్షోభం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాన్ని మరోసారి బహిర్గతం చేసిందని తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతమైన మార్కెట్ జోక్యం, కొనుగోలు వ్యవస్థను అమలు చేయకపోవడంతో రైతులకు క్షేత్రస్థాయిలో కిలోకు కేవలం రూ.3 నుంచి రూ.6 వరకు మాత్రమే ధర లభించిందని తెలిపారు. తోతాపురి రైతుల సమస్యలపై ఎంపీ గురుమూర్తి లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి రామనాథ్ ఠాకూర్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 2026–27 మార్కెటింగ్ సీజన్‌లో మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద 2,16,250 మెట్రిక్ టన్నుల తోతాపురి మామిడిని కొనుగోలు చేసేందుకు కేంద్రం ఆమోదం తెలిపిందని మంత్రి వెల్లడించారు.

ఈ కొనుగోళ్లకు కిలోకు రూ.17.47 మార్కెట్ ఇంటర్వెన్షన్ ధర నిర్ణయించినట్లు తెలిపారు. అయితే, కేంద్రం నిర్ణయించిన ధరకు, రైతులకు వాస్తవంగా లభించిన రూ.3–6 ధరకు మధ్య భారీ వ్యత్యాసం ఉందని ఎంపీ అన్నారు. జూలై 4న చిత్తూరు మార్కెట్‌లో తోతాపురి ధర రూ.3 నుంచి రూ.6 వరకు నమోదైందని, జూన్‌లో రైతులు కిలోకు కేవలం రూ.4కే పంటను విక్రయించాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. జ్యూస్ ఫ్యాక్టరీల వద్ద వందలాది ట్రాక్టర్లు రోజుల తరబడి వేచి ఉండాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం గతంలో తోతాపురి మామిడికి కిలోకు రూ.12 వరకు ధర వచ్చేలా చర్యలు తీసుకుంటామని ప్రకటించినప్పటికీ, ఆ ధర రైతులకు అందలేదని గురుమూర్తి విమర్శించారు. “ప్రభుత్వం ప్రకటించిన ధర ఒకవైపు.. రైతుకు వాస్తవంగా దక్కిన ధర మరోవైపు” అన్న పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వ మార్కెట్ నిర్వహణలోని లోపాలను స్పష్టంగా చూపిస్తోందన్నారు.

అదేవిధంగా, తోతాపురి రైతులకు శాశ్వత పరిష్కారం కోసం తిరుపతిలో జాతీయ మామిడి బోర్డు, చిత్తూరులో జాతీయ మామిడి పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేయాలని తాను లోక్‌సభలో ప్రశ్నించానని తెలిపారు. అయితే ప్రస్తుతం అలాంటి ప్రతిపాదన ఏదీ కేంద్ర వ్యవసాయ శాఖ పరిశీలనలో లేదని కేంద్రం స్పష్టం చేసిందన్నారు. మామిడి రైతుల ఆదాయాన్ని పెంచేందుకు పాత తోటల పునరుద్ధరణ, మెరుగైన రకాల సాగు, పంట అనంతర నిర్వహణ, నిల్వ, ప్రాసెసింగ్, ఎగుమతుల ప్రోత్సాహం వంటి చర్యలను నిపుణుల కమిటీ సిఫారసు చేసిందని ఎంపీ తెలిపారు. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో టాప్-వర్కింగ్ తోటల అభివృద్ధి కోసం రైతుల ఎంపిక ప్రక్రియను రాష్ట్ర ఉద్యాన శాఖ ఇప్పటికే పూర్తి చేసినట్లు కేంద్రం తెలిపిందన్నారు. ప్రకటించిన ధర రైతులకు క్షేత్రస్థాయిలో అందేలా సమర్థవంతమైన కొనుగోలు వ్యవస్థను ఏర్పాటు చేసి, భవిష్యత్తులో ఇలాంటి ధరల సంక్షోభం పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *