న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ (లేపాక్షి) చైర్మన్, జనసేన పార్టీ PAC సభ్యులు, రాష్ట్ర జాయినింగ్ కమిటీ సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ న్యూఢిల్లీలో కేంద్ర జౌళి, హస్తకళల శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో హస్తకళల అభివృద్ధి, కళాకారులకు మార్కెటింగ్ అవకాశాలు, క్రాఫ్ట్ విలేజీల ఏర్పాటు తదితర అంశాలపై కేంద్ర మంత్రితో చర్చించారు. ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో హస్తకళాకారులు తయారు చేస్తున్న ఉత్పత్తులకు దేశవ్యాప్తంగా మరింత విస్తృతమైన మార్కెట్ కల్పించేందుకు చేపడుతున్న చర్యలను డా. హరిప్రసాద్ కేంద్ర మంత్రికి వివరించారు. తిరుపతిలో అంతర్జాతీయ స్థాయి హస్తకళల షోరూమ్‌ను త్వరలో అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.
రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలైన శ్రీశైలం, శ్రీకాళహస్తి, కాణిపాకం వంటి ప్రాంతాల్లో హ్యాండీక్రాఫ్ట్ బిజినెస్ సెంటర్లను ఏర్పాటు చేయడం ద్వారా హస్తకళాకారులు తయారు చేస్తున్న ఉత్పత్తులకు విస్తృత మార్కెట్ కల్పించవచ్చని తెలిపారు. దీనివల్ల కళాకారుల ఉత్పత్తుల విక్రయాలు పెరగడంతో పాటు వారి ఆదాయం మెరుగుపడుతుందని వివరించారు. లేపాక్షి ద్వారా హస్తకళా ఉత్పత్తుల విక్రయాలను మరింత విస్తరించేందుకు ఈ-కామర్స్ వ్యాపారాన్ని అభివృద్ధి చేస్తున్నామని డా. హరిప్రసాద్ తెలిపారు.
అన్నమయ్య జిల్లాలోని మదనపల్లి ప్రాంతంలోని అంగళ్లు వద్ద క్రాఫ్ట్ విలేజ్ ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి, సహకారం అందించాలని డా. హరిప్రసాద్ కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ ని కోరారు. అదేవిధంగా ఏటికొప్పాక, కొండపల్లి ప్రాంతాల్లో క్రాఫ్ట్ విలేజీలను ఏర్పాటు చేసేందుకు అవసరమైన అనుమతులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ అభ్యర్థనలపై కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ సానుకూలంగా స్పందించారు.
ఆంధ్రప్రదేశ్‌లో హస్తకళా రంగాన్ని మరింత అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రి సవిత ఆదేశాల మేరకు చర్యలు కొనసాగుతున్నాయని డా. హరిప్రసాద్ తెలిపారు. హస్తకళాకారులకు మెరుగైన ఉపాధి, వారి ఉత్పత్తులకు విస్తృత మార్కెట్, సంప్రదాయ హస్తకళల పరిరక్షణ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సమన్వయంతో ముందుకు సాగుతున్నాయని డా. హరిప్రసాద్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ హస్తకళా రంగ అభివృద్ధికి సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ కి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
Prajavartha Online Telugu News