అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) మేనేజింగ్ డైరెక్టర్‌గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఐఏఎస్ అధికారి పట్టన్ శెట్టి రవి సుభాష్ సచివాలయంలో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పర్యాటక రంగాభివృద్ధికి తీసుకోవాల్సిన పలు కీలక చర్యలపై వారిద్దరి మధ్య సుదీర్ఘ చర్చ జరిగింది. బాధ్యతలు చేపట్టిన నూతన ఎండీకి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కందుల దుర్గేష్ రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని ముందంజలో నిలిపేందుకు క్షేత్రస్థాయిలో నిరంతరం కృషి చేయాలని సూచించారు. ఈ భేటీలో భాగంగా ఏజెన్సీ, గిరిజన ప్రాంతాల్లో ఉన్న పర్యాటక ప్రాధాన్యత కలిగిన ప్రాంతాలను గుర్తించి, అక్కడ పర్యాటకాభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపకల్పన చేయాలని దిశానిర్దేశం చేసారు. అదే విధంగా ప్రకృతి సమతుల్యత దెబ్బతినకుండా ఎకో-టూరిజం, ఆరోగ్యం-ఆహ్లాదాన్ని అందించే వెల్ నెస్ టూరిజం ప్రాజెక్టులకు పెద్దపీట వేయాలన్నారు. పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్‌షిప్ విధానంలో పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు, ఇప్పటివరకు కుదుర్చుకున్న ఒప్పందాలు త్వరగా పట్టాలెక్కేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. నూతన పర్యాటక పాలసీ, దాని అనుబంధ విధానాలపై సమగ్రంగా చర్చించడంతో పాటు, పర్యాటక రంగ నిపుణులు, ఇన్వెస్టర్ల నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్‌ను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డు, స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ కమిటీ పరిధిలో ఇప్పటివరకు ఆమోదం పొందిన ప్రాజెక్టుల పురోగతిపై సమగ్రంగా చర్చించారు. రాష్ట్ర పర్యాటక వైభవాన్ని చాటిచెప్పేలా ప్రాంతీయ పర్యాటక ఉత్సవాలు నిర్వహించాలని, దేశ విదేశాల్లో ఏపీ టూరిజంకు విస్తృత ప్రచారం కల్పించాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా, మంత్రి దుర్గేష్ దిశానిర్దేశం మేరకు రాష్ట్ర పర్యాటక రంగాన్ని సరికొత్త శిఖరాలకు తీసుకెళ్లేందుకు కట్టుబడి పనిచేస్తానని ఏపీటీడీసీ ఎండీ పట్టన్ శెట్టి రవి సుభాష్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.
Prajavartha Online Telugu News