-పురాతత్వ శాఖ మరియు మ్యూజియం కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం సచివాలయంలో మంత్రిని కలిసిన రేవు ముత్యాలరాజు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర పురాతత్వ శాఖ మరియు మ్యూజియమ్స్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం సీనియర్ ఐఏఎస్ అధికారి రేవు ముత్యాలరాజు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ను సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా బాధ్యతలు చేపట్టిన ముత్యాలరాజుకు మంత్రి కందుల దుర్గేష్ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం రాష్ట్రంలో చారిత్రక, పురావస్తు ఆధారాలు, మ్యూజియంల అభివృద్ధికి సంబంధించిన అంశాలపై ముత్యాలరాజుతో మంత్రి దుర్గేష్ చర్చించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రాచీన పురావస్తు సంపదను, చారిత్రక కట్టడాలను, శాసనాలను భవిష్యత్ తరాల కోసం భద్రపరిచి, పరిరక్షించాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మ్యూజియంలను ఆధునీకరించి, పర్యాటకులను ఆకట్టుకునేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. మన సంస్కృతి, చరిత్ర ప్రసిద్ధిని చాటిచెప్పే పురాతన కళాఖండాలను సంరక్షించడంలో ఆర్కియాలజీ శాఖ మరింత క్రియాశీలకంగా వ్యవహరించాలని తెలిపారు. మంత్రి దుర్గేష్ సూచనలపై కమిషనర్ రేవు ముత్యాలరాజు స్పందిస్తూ… రాష్ట్రంలోని పురావస్తు సంపద పరిరక్షణకు, మ్యూజియంల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణతో ముందుకుసాగుతామని మంత్రి దుర్గేష్ కి వివరించారు.
Prajavartha Online Telugu News