-జిల్లా ఓటరు జాబితా పరిశీలకులు SIR కార్యక్రమంపై క్షేత్రస్థాయి సమీక్ష
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు గోదావరి జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాల ఓటరు జాబితా పరిశీలకులు శ్రీమతి కె. మాధవీలత గురువారం సాయంత్రం రాజమహేంద్రవరం అర్బన్, రూరల్ నియోజకవర్గాల పరిధిలోని పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించి, ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) కార్యక్రమం అమలును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కె మాధవీలత , బూత్ స్థాయి అధికారులు (BLOలు) ఓటరు జాబితా పరిశీలన, మార్పులు- చేర్పులు, కొత్త ఓటర్ల నమోదు, మరణించిన వారి పేర్ల తొలగింపు తదితర ప్రక్రియలను ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు నిర్వహిస్తున్న తీరును ఆమె సమీక్షించారు. రాజమహేంద్రవరం అర్బన్ నియోజకవర్గంలోని గోపాల్‌నగర్ పుంత పరిధిలో ఉన్న పోలింగ్ స్టేషన్ నెం.155ను మున్సిపల్ కమిషనర్ శ్రీ రాహుల్ మీనా సమక్షంలో పరిశీలించారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో ఉన్న ఓటర్ల సంఖ్య, SIR కార్యక్రమంపై ఓటర్లకు ఎలా అవగాహన కల్పిస్తున్నారో, ఇంటింటి పరిశీలన పురోగతి ఎలా ఉందో BLOలను అడిగి తెలుసుకున్నారు. ఓటర్లకు మార్పులు, చేర్పులు, తొలగింపులు, సవరణలపై స్పష్టమైన సమాచారం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
అలాగే రాజమహేంద్రవరం రూరల్ నియోజక వర్గంలోని హుకుంపేట పోలింగ్ స్టేషన్ నెం.100ను జిల్లా రెవెన్యూ అధికారి/ రూరల్ ERO ఎస్. భాస్కర్ రెడ్డి, తహసీల్దార్ (రూరల్) శ్రీ శ్రీనివాస్‌లతో కలిసి సందర్శించి SIR కార్యక్రమం పురోగతిని సమీక్షించారు. 18 సంవత్సరాలు పూర్తి చేసిన యువతి, యువకులు తప్పనిసరిగా ఓటరు నమోదుకు దరఖాస్తు చేసుకునేలా ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. SIR మొబైల్ యాప్ ద్వారా BLOలు డేటాను ఎలా అప్లోడ్ చేస్తున్నారో కూడా పరిశీలించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఎలాంటి జాప్యం లేకుండా ఓటరు నమోదు పూర్తి చేయాలని, ఓటరు జాబితాలో తప్పులు లేకుండా అత్యంత జాగ్రత్తతో పని చేయాలని మాధవీలత ఆదేశించారు. మరణించిన వారి పేర్ల తొలగింపులో ఒకటికి రెండుసార్లు ధృవీకరణ చేసి, గ్రామ పెద్దలతో సంప్రదించి పంచనామాల ఆధారంగా మాత్రమే ప్రతిపాదనలు పంపాలని స్పష్టం చేశారు. ప్రతి ఓటుకు సంబంధించిన డాక్యుమెంటేషన్ తప్పనిసరిగా నిర్వహించాలనీ, పారదర్శకతతో కూడిన ఖచ్చితమైన ఓటరు జాబితా తయారీ ఎన్నికల ప్రక్రియకు అత్యంత కీలకమని పేర్కొన్నారు. ఈ పర్యటన లో మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా, రూరల్ ERO / dro ఎస్. భాస్కర్ రెడ్డి, తహసీల్దార్ (రూరల్) శ్రీనివాస్, ఎంపిడిఓ ఆర్మ్ స్ట్రాంగ్, సంబంధిత ఎన్నికల అధికారులు, సూపర్వైజర్లు మరియు బూత్ స్థాయి అధికారులు పాల్గొన్నారు
Prajavartha Online Telugu News