-ఏ ఓటు పోకుండా పారదర్శకంగా ఓటర్ల జాబితా సవరణ పూర్తి చేయాలి
-ఓటరు జాబితా పరిశీలకులు కె మాధవీలత
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
అధికారులు, రాజకీయ పార్టీలు సమన్వయంతో పని చేస్తే నాణ్యమైన, విశ్వసనీయమైన తుది ఓటర్ల జాబితా సిద్ధమవుతుందని తూర్పు గోదావరి జిల్లా ఓటరు జాబితా పరిశీలకులు మాధవీలత పేర్కొన్నారు. తూర్పు గోదావరి జిల్లా ఓటరు జాబితా పరిశీలకులు గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతు బజార్ల చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కె. మాధవీలత మొదటి పర్యటన సందర్భంగా గురువారం రాజమహేంద్రవరం కలెక్టరేట్ PGRS సమావేశ మందిరంలో జిల్లాకు చెందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు, నియోజకవర్గాల ఎలక్టోరల్ నమోదు అధికారులు (EROలు), AEROలు, BLO సూపర్వైజర్లు, BLOలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కె. మాధవీ లత మాట్లాడుతూ ప్రత్యేక సమగ్ర సవరణ (SSR) ప్రక్రియ గత కొన్ని నెలలుగా పారదర్శకంగా కొనసాగుతోందని, ప్రతి దశలో రాజకీయ పార్టీల ప్రతినిధులను భాగస్వాములను చేస్తూ పురోగతిని వివరిస్తున్నామని తెలిపారు. పోలింగ్ స్టేషన్ స్థాయిలో BLOలు, AEROలు, BLAలు అందుబాటులో ఉంటే చాలా సమస్యలు అక్కడికక్కడే పరిష్కారమవుతాయని, స్థానికంగా పరిష్కారం కాని ఫిర్యాదులను వాట్సాప్ ద్వారా నేరుగా తన దృష్టికి తీసుకురావచ్చని సూచించారు. ఏ ఓటు కూడా పోకుండా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని మాధవీలత ఆదేశించారు. అందుబాటులో లేని లేదా హాజరు కాలేని ఓటర్లను వీడియో కాల్ ద్వారా నిర్ధారించి, ఆ ప్రక్రియకు సంబంధించిన పూర్తి డాక్యుమెంటేషన్ నిర్వహించాలని తెలిపారు. ప్రతి నోటీసు, క్లెయిమ్‌కు ప్రత్యేక ఫైల్ తప్పనిసరిగా నిర్వహించాలని, నోటీసు డెలివరీ, అంగీకార పత్రాలు, విచారణలో సమర్పించిన పత్రాలు, వర్చువల్ విచారణ స్క్రీన్‌షాట్‌ల ప్రింట్లు భద్రపరచాలని చెప్పారు. నోటీసులను వేగంగా పరిష్కరించడంతో పాటు క్లెయిమ్ వచ్చిన వెంటనే తదుపరి స్థాయికి అసైన్ చేయడం ద్వారా అవి ప్రాసెస్‌లోకి వస్తాయని వివరించారు. రాజమహేంద్రవరం సిటీ, రూరల్, రాజానగరం మాత్రమే కాకుండా గోపాలపురం, కొవ్వూరు నియోజకవర్గాల్లో కూడా ఎక్కువ నోటీసులు నమోదైన నేపథ్యంలో కారణాలను క్షుణ్ణంగా పరిశీలించాలని అధికారులకు మాధవీలత సూచించారు. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ EROలు పరిష్కరించిన నోటీసులు, క్లెయిమ్‌లు క్వాలిటీ చెక్ కోసం కలెక్టరేట్ లో ప్రత్యేక ఏర్పాటు చేసినట్లు తెలిపారు. చెక్‌లిస్ట్ పాటించకుండా విచారణ ముగించడం లేదా హియరింగ్‌ను తిరస్కరించడం జరగకుండా అధికారులు ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరిస్తున్నామని స్పష్టం చేశారు. కొత్తగా నియమితులైన BLOలకు ERO స్థాయిలో శిక్షణా తరగతులు నిర్వహిస్తామని, ప్రతి AERO పరిధిలోని BLO సూపర్వైజర్లు, BLOలకు తగిన అవగాహన కల్పించాలని సూచించారు. ASD ఓటరు జాబితాలను ప్రతి పోలింగ్ కేంద్రం, సంబంధిత తహసీల్దార్ కార్యాలయంలో అందుబాటులో ఉంచి ప్రజల అభ్యంతరాలు స్వీకరిస్తున్నామని, అదే జాబితాలను జిల్లా వెబ్‌సైట్, భారత ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లలో కూడా అప్లోడ్ చేసినట్లు తెలిపారు. నోటీసుల డెలివరీ, హియరింగ్ పూర్తి తర్వాత వివరాలను ఆన్‌లైన్‌లో అప్లోడ్ చేయడం అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. జిల్లాలోని 8 అసెంబ్లీ నియోజకవర్గాల ఓటర్ల జాబితా పరిశీలనలో మొత్తం 18,46,723 మంది ఓటర్లలో 1,692 మంది (0.09%) మ్యాపింగ్ కాకుండా ఉన్నట్లు గుర్తించారు. మొత్తం 85,205 అనామలీలు (4.61%) గుర్తించగా, వాటికి సంబంధించిన 86,958 నోటీసులు రూపొందించి 100 శాతం జారీ చేశారు. ఇప్పటివరకు 6,035 నోటీసులు (6.94%) పంపిణీ చేయగా, 80,923 నోటీసులు (93.06%) ఇంకా పంపిణీ చేయాల్సి ఉంది. రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో అత్యధికంగా 28,826 అనామలీలు (10.85%) నమోదు కాగా, నిడదవోలులో అత్యల్పంగా 440 (0.21%) మాత్రమే ఉన్నాయి. నోటీసుల పంపిణీలో నిడదవోలు 77.47 శాతంతో ముందంజలో ఉండగా, రాజనగరం 4.60 శాతంతో కనిష్ఠ స్థాయిలో ఉందన్నారు.
24.07.2026 నాటికి తూర్పు గోదావరి జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో EFల డిజిటైజేషన్ మొత్తం 90.20 శాతానికి చేరుకుంది. జిల్లాలో మొత్తం 18,46,723 మంది ఓటర్లలో 16,65,712 EFలు డిజిటైజ్ చేయగా, 1,81,011 EFలు సేకరించలేకపోయినవిగా (9.80%) నమోదయ్యాయి. అత్యధిక డిజిటైజేషన్ రాజనగరం (94.76%), కోవ్వూరు (94.00%), నిడదవోలు (93.60%) నియోజకవర్గాల్లో నమోదైంది. గోపాలపురం 93.23%, మండపేట 92.49%, అనపర్తి 90.71%, రాజమహేంద్రవరం రూరల్ 86.03%గా ఉన్నాయి. రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో డిజిటైజేషన్ 80.25 శాతంతో తక్కువగా ఉండగా, అక్కడే 52,470 EFలు సేకరించలేకపోయినవిగా నమోదై, అన్‌కలెక్టబుల్ శాతం 19.75కు చేరింది. మొత్తం మీద జిల్లాలో ప్రత్యేక సవరణ ప్రక్రియలో డిజిటైజేషన్ పనులు వేగంగా కొనసాగుతున్నప్పటికీ, ముఖ్యంగా రాజమహేంద్రవరం సిటీ మరియు రూరల్ ప్రాంతాల్లో మిగిలిన EFల సేకరణపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. జిల్లాలో మొత్తం 8 నియోజకవర్గాలకు 170 మంది AEROలు, 181 మంది BLO సూపర్వైజర్లు, 2,038 మంది BLOలు నియమించబడినట్లు అధికారులు తెలిపారు. క్లెయిమ్‌లు, అభ్యంతరాల స్వీకరణకు ఆగస్టు 30, 2026 వరకు గడువు ఉండగా, నోటీసుల దశ మరియు క్లెయిమ్‌ల పరిష్కారం జూలై 31 నుంచి సెప్టెంబర్ 28, 2026 వరకు కొనసాగుతుందన్నారు. తుది ఓటర్ల జాబితా అక్టోబర్ 3, 2026న ప్రచురించనున్నట్లు వెల్లడించారు.
ఈ సందర్భంగా వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు కూడా పలు సూచనలు చేశారు. పోలింగ్ కేంద్రాల్లో ఓటర్ల సంఖ్య హేతుబద్ధంగా ఉండాలని, నోటీసుల పంపిణీ పారదర్శకంగా జరగాలని, క్లెయిమ్‌లు మరియు అభ్యంతరాల పరిష్కారం వేగవంతంగా ఉండాలని కోరారు. గ్రామస్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు BLOలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, ప్రజలకు సరైన సమాచారం చేరేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. సమావేశంలో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, టీడీపీ, బీజేపీ, సీపీఐ, కాంగ్రెస్, వైఎస్సార్‌సీపీ, బీఎస్పీ తదితర రాజకీయ పార్టీల ప్రతినిధులు, నియోజక వర్గ ఓటర్ నమోదు అధికారులు 40-అనపర్తి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ (ఎల్‌ఏ), గెయిల్ ఇండియా, రాజమహేంద్రవరం ఎం.రాజా రమేష్ ప్రేమ్‌కుమార్, 48-మండపేటకు పీఏ టు స్పెషల్ కలెక్టర్ (ఎల్‌ఏ), పీఐపీ టి.రాజేశ్వరరావు, 49-రాజానగరానికి రెవెన్యూ డివిజనల్ అధికారి రాజమహేంద్రవరం ఆర్.శివరాముడు, రాజమహేంద్రవరం సిటీకి మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా, 51-రాజమహేంద్రవరం రూరల్‌కు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, కేఆర్‌ఆర్‌సీ ఎస్.భాస్కర్ రెడ్డి, 54-కొవ్వూరు (ఎస్సీ)కి రెవెన్యూ డివిజనల్ అధికారి కొవ్వూరు కె.ఆనందరావు, 55-నిడదవోలుకు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, పీఐపీ, ఎల్‌ఎంసీ కనకరాజు, 66-గోపాలపురం (ఎస్సీ)కి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ (ఎల్‌ఏ), ఓఎన్‌జీసీ, రాజమహేంద్రవరం శ్రీమతి పి.భాగ్యవతి లు సమావేశం లో పాల్గొనడం జరిగింది.
Prajavartha Online Telugu News