-పతాకావిష్కరణలో పాల్గొననున్న రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్
-ఫుల్ డ్రెస్ రిహార్సల్స్‌ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ, పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖర్ బాబు
-ఆకట్టుకున్న పోలీస్ బైక్ విన్యాసాలు, వివిధ శాఖల శకటాల ప్రదర్శన, డ్రమ్స్ ప్రదర్శన
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్టీఆర్ జిల్లాలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. విజయవాడ సింగ్‌నగర్‌లోని మాకినేని బసవ పున్నయ్య స్టేడియంలో ఆగస్టు 15న నిర్వహించనున్న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు సంబంధించి శుక్రవారం నిర్వహించిన ఫుల్ డ్రెస్ మాక్ రిహార్సల్స్‌ను జిల్లా కలెక్టర్ డా.జి.లక్ష్మీశ, విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖర్ బాబు పరిశీలించారు. పెరేడ్ వాహనంలో ప్రయాణించిన జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్ రిహార్సల్స్‌ను ఆసాంతం పరిశీలించారు. ఈ సందర్భంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమం, పోలీస్ బైక్ విన్యాసాలు, సిద్ధార్థ కళాశాల మహిళల డ్రమ్స్ ప్రదర్శన, పోలీస్ పెరేడ్, వందన స్వీకరణ, వివిధ ప్రభుత్వ శాఖల పెరేడ్ తదితర కార్యక్రమాలను వీక్షించారు. ప్రదర్శనల్లో పాల్గొన్న పోలీసు సిబ్బంది, విద్యార్థులు, వివిధ శాఖల అధికారులు, సిబ్బందిని జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్ అభినందించారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను అత్యంత క్రమశిక్షణతో, ఆకట్టుకునే రీతిలో నిర్వహించేలా తుది ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా.జి.లక్ష్మీశ మాట్లాడుతూ, ఎన్టీఆర్ జిల్లాలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను రాష్ట్రస్థాయి వేడుకలను తలపించేలా ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. ఆగస్టు 15న నిర్వహించనున్న ప్రధాన కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పతాకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొని జిల్లా ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారని తెలిపారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా వివిధ ప్రభుత్వ శాఖలు అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించేలా శకటాల ప్రదర్శన నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. వివిధ శాఖల అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రతిబింబించే శకటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయని చెప్పారు. అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలు, పోలీస్ బైక్ విన్యాసాలు, డ్రమ్స్ ప్రదర్శనలు, వివిధ శాఖల పెరేడ్ తదితర కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ప్రజలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని జాతీయ స్ఫూర్తిని, దేశభక్తిని, ఐక్యతా భావాన్ని చాటాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ వేడుకలను విజయవంతం చేయడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖర్ బాబు మాట్లాడుతూ, స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. వేడుకలకు హాజరయ్యే ప్రజలు, విద్యార్థులు, అతిథులు పోలీస్ అధికారులు, సిబ్బంది సూచనలను పాటించి సహకరించాలని కోరారు. ట్రాఫిక్ నియంత్రణ, వాహనాల పార్కింగ్, భద్రతా చర్యలకు సంబంధించి పోలీసుల సూచనలను పాటించడం ద్వారా వేడుకలు సజావుగా, విజయవంతంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ హెచ్.ఎం. ధ్యాన్ చంద్ర, డీసీపీ కె.జి.వి. సరిత, విజయవాడ ఆర్డీఓ వెన్నెల శీను, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, పోలీస్ ఉన్నతాధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News