విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ నూతన కార్యాలయ నిర్మాణానికి నిర్వహించిన భూమి పూజ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురామ్, ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధ, ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యేలు తంగిరాల సౌమ్య, శ్రీరాం రాజగోపాల్, గద్దె రామమోహన్, ఎన్టీఆర్ జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి చెన్నుబోయిన చిట్టిబాబు, కృష్ణా జిల్లా టీడీపీ అధ్యక్షుడు వీరంకి గురుమూర్తి, ఇతర ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నెట్టెం రఘురామ్ మాట్లాడుతూ, ఎన్టీఆర్ జిల్లాలో తెలుగుదేశం పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేయడంతో పాటు, నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలకు మరింత చేరువగా సేవలందించేందుకు నూతన కార్యాలయం కీలక వేదికగా నిలుస్తుందని అన్నారు. కార్యకర్తలే తెలుగుదేశం పార్టీకి వెన్నెముక అని పేర్కొంటూ, పార్టీ కోసం అంకితభావంతో పనిచేస్తున్న ప్రతి కార్యకర్తకు అండగా నిలవడం, వారి సమస్యలను పరిష్కరించడం, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడటం పార్టీ నాయకత్వం బాధ్యత అని అన్నారు.
ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మార్గదర్శకత్వంలో ఎన్టీఆర్ జిల్లాలో తెలుగుదేశం పార్టీని మరింత శక్తివంతంగా తీర్చిదిద్దేందుకు నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. నూతన కార్యాలయం ప్రజలకు–పార్టీకి మధ్య వారధిగా, కార్యకర్తలకు ఆత్మీయ నిలయంగా, పార్టీ కార్యక్రమాలకు శాశ్వత కేంద్రంగా నిలవాలని ఆకాంక్షించారు. ఎన్టీఆర్ జిల్లా టీడీపీ నూతన కార్యాలయానికి భూమి పూజ చేయడం పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపే చారిత్రాత్మక శుభారంభమని నాయకులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామ స్థాయి నాయకులు, అనుబంధ విభాగాల నాయకులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News