Breaking News

అసెంబ్లీకి రా…నీకు నచ్చిన అంశంపై చర్చిద్దాం

-నీలా మేం దూషించం… అవమానించం
-ఒకరోజు కాకపోతే రెండ్రోజులైనా చర్చకు మేం రెడీ
-కళ్లున్న కబోదిలా .. ప్రెస్ మీట్ ల్లో మాట్లాడడం కాదు
-పులివెందుల ఎమ్మెల్యేగా సభకు రా…
-జగన్ కు మంత్రి సవిత సవాల్
-గ్రూప్ 1 లో అక్రమాలు బయటకు రావడంతోనే గొడ్డలి పార్టీ డ్రామాలు
-మెగా డీఎస్సీపై డైవర్షన్ రాజకీయాలు
-విద్యార్థులతో ధర్నాలు సిగ్గు చేటు
-రైజింగ్ రాయలసీమే సీఎం చంద్రబాబు లక్ష్యం : మంత్రి సవిత
-అర్హులందరికీ ‘నేతన్నల సేవలో’ అందిస్తాం
-పథకాలను లబ్దిదారులు అందజేయాల్సిన బాధ్యత అధికారులదే..
-ఆర్ అండ్ బి రహదారులు, బీసీ సంక్షేమంపై సమీక్షలో మంత్రులు సవిత, జనార్దన్ రెడ్డి

పులివెందుల/కడప, నేటి పత్రిక ప్రజావార్త :
‘కళ్లున్న కబోదుల్లా మాట్లాడడం కాదు… ప్రెస్ మీట్లు పెట్టడం కాదు.. దమ్ముంటే అసెంబ్లీకి రా… రాయలసీమ, పులివెందుల అభివృద్ధి, మెగా డీఎస్సీ, గ్రూప్ 1 పోస్టుల్లో అక్రమాలు… మీకు నచ్చిన ఏ అంశంపైనైనా చర్చకు సిద్ధంగా ఉన్నాం. గతంలో టీడీపీ సభ్యులను, వారి కుటుంబ సభ్యులను మీరు దూషించినట్లు మీ కుటుంబ సభ్యులను మేం దూషించం… గౌరవంగా సభను నిర్వహిస్తున్నాం…ఒకరోజు కాకుంటే రెండ్రోజులు చర్చిద్దాం… సభకు రా..’ అని జగన్ ను జిల్లా ఇన్చార్జి మంత్రి సవిత సవాల్ విసిరారు. ప్రతిపక్ష హోదా ఇచ్చేది ప్రజలు మాత్రమే, తాము కాదని అన్నారు. పులివెందుల ప్రజలు ఎమ్మెల్యేగా జగన్ కు అవకాశమిచ్చారని, తమ నియోజకవర్గవాసుల ఆకాంక్షలను నెరవేర్చేలా అసెంబ్లీకి రావాల్సిన బాధ్యత ఆయన ఉందన్నారు. గ్రూప్ 1 జవాబు పత్రాల మూల్యాంకనంలో జరిగిన అక్రమాలను కప్పిపుచ్చడానికే జగన్, ఆయన బ్యాచ్ మెగా డీఎస్సీలో అక్రమాలంటూ డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో అభివృద్ధిని, సంక్షేమాన్ని సీఎం చంద్రబాబునాయుడు పరుగులు పెట్టిస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరవాత కడప జిల్లాలో రూ.220 కోట్లకుపైగా ఆర్ అండ్ బి రోడ్లు, ఇతర రోడ్ల నిర్మాణాలు చేపట్టామన్నారు. ఆ పనులన్నీ 80 శాతం పూర్తి కావొచ్చాయని, మిగిలిన 20 శాతం త్వరలోనే పూర్తి చేస్తామని తెలిపారు. పులివెందులలో ఒకరోజు పర్యటన నిమిత్తం వచ్చిన జిల్లా ఇన్చార్జి మంత్రి సవిత… మరో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డితో కలిసి ఆర్ అండ్ బి రహదారులు, బీసీ సంక్షేమ పథకాలపై శుక్రవారం సమీక్షలు నిర్వహించారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో పులివెందుల నియోజక వర్గ ఇన్చార్జి బీటెక్ రవితో కలిసి మంత్రులు మాట్లాడారు. జిల్లా ఇన్చార్జి మంత్రి సవిత మాట్లాడుతూ, రాష్ట్రంతో పాటు రాయలసీమ అభివృద్ధికి సీఎం చంద్రబాబునాయుడు అధిక ప్రాధాన్యమిస్తున్నారన్నారు. రైజింగ్ రాయలసీమే లక్ష్యంగా ఒకవైపు సాగునీటి ప్రాజెక్టులు నిర్మిస్తూనే, మరోవైపు పరిశ్రమలను స్తాపిస్తున్నారన్నారు. కర్నూలు, ఉమ్మడి అనంతపురం, చిత్తూరు, కడప జిల్లాల్లో పరిశ్రమలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తూ, రాయలసీమను పారిశ్రామిక హబ్ గా అభివృద్ధి చేస్తున్నారని మంత్రి సవిత కొనియాడారు.

మెగా డీస్సీపై డైవర్షన్ పాలిటిక్స్

తాను చేసిన తప్పిదాలను కప్పిపుచ్చుకోడానికి జగన్ రెడ్డి డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతున్నారని మంత్రి సవిత మండిపడ్డారు. గ్రూప్ 1 మెయిన్స్ మూల్యాంకనంలో జరిగిన అక్రమాలను సిట్ బట్టబయలు చేసిందన్నారు. ఈ అక్రమాల నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికే మెగా డీఎస్సీలో అక్రమాలు అంటూ జగన్, ఆయన బ్యాచ్ పెద్ద డ్రామాకు తెరతీసిందన్నారు. గొడ్డలి పార్టీ నాయకులు ఎన్ని డ్రామాలు ఆడినా ప్రజలు పట్టించుకోవడం లేదన్నారు. చివరికి విద్యార్థులను, కూలీలను ధర్నాలకు తరలించే దుస్థితికి వైసీపీ నాయకులు దిగజారిపోయారని మంత్రి సవిత ఎద్దేవా చేశారు.

అసెంబ్లీకి రా…నీకు నచ్చినంత సమయం ఇస్తాం

తమకు ప్రతిపక్ష హోదా లేదని, అందుకే శాసనసభకు వెళ్లడం లేదని జగన్ అనడం విడ్డూరంగా ఉందని మంత్రి సవిత అన్నారు. ప్రతిపక్ష హోదా ఇచ్చేది కూటమి ప్రభుత్వం కాదని, ప్రజలను స్పష్టంచేశారు. ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్ కు ఈ విషయం తెలియదా..? అని ప్రశ్నించారు. కళ్లున్న కబోదుల్లా మాట్లాడడం కాకుండా, ప్రెస్ మీట్లు పెట్టడం కాకుండా దమ్ముంటే అసెంబ్లీకి రావాలని జగన్ కు మంత్రి సవిత సవాల్ చేశారు. ఆయనకు నచ్చిన అంశంపై చర్చించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. రాయలసీమ, పులివెందుల అభివృద్ధి, మెగా డీఎస్సీ, గ్రూప్ 1 పోస్టుల్లో అక్రమాలు… ఇలా ఏ అంశంపైనైనా చర్చకు సిద్ధంగా ఉన్నామన్నారు. వైసీపీ హయాంలో టీడీపీ సభ్యులను, వారి కుటుంబ సభ్యులను గొడ్డలి పార్టీ నాయకులు దూషించినట్లు తమ వ్యవహరించబోమన్నారు. జగన్ కుటుంబ సభ్యుల ఊసే ఎత్తబోమని, సభను ఇంటిళ్లపాది చూసేలా గౌరవంగా సభను నిర్వహిస్తున్నామన్నారు. జగన్ కు ఎంతసమయం కావాలంటే అంతసేపు మైక్ ఇస్తామని, ఒకరోజు కాకుంటే రెండ్రోజులు చర్చిద్దామని, సభకు రావాలని కోరారు.

గడువులోగా రోడ్ల నిర్మాణాలు పూర్తి కావాల్సిందే…

అంతకుముందు పులివెందుల ఆర్ అండ్ గెస్ట్ హౌస్ లో కడప జిల్లాలో రోడ్ల నిర్మాణాలపై మంత్రి బీసీ జనార్దన్ రెడ్డితో కలిసి మంత్రి సవిత సమీక్షించారు. ఏయే ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణాలు ఏయే దశల్లో ఉన్నాయో..? అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ఎల్ నినో కారణంగా వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయని, దీన్ని అనుకూలంగా తీసుకుని సకాలంలో రోడ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని ఆదేశించారు. ఆర్ధిక ఇబ్బందులున్నా రహదారుల నిర్మాణానికి సీఎం చంద్రబాబు ప్రాధాన్యమిస్తున్నారన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఒక్క రోడ్డును కూడా నిర్మించలేదన్నారు. దీనివల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కున్నారని మంత్రి సవిత గుర్తు చేశారు.

అర్హులైన నేతన్నలందరికీ ఆర్థిక సాయం

అర్హులైన నేతన్నలందరికీ నేతన్నల సేవలో పథకం కింద రూ.25 వేలు ఆర్థిక సాయం అందిస్తామని మంత్రి సవిత స్పష్టం చేశారు. లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేస్తున్నామని, ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని మంత్రి సవిత స్పష్టంచేశారు. ఇంకా అర్హులు ఉంటే గుర్తించి, వారికి కూడా నేతన్నల సేవలో పథకాన్ని వర్తింపజేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. బీసీ హాస్టళ్లు, గురుకులాల నిర్వహణపైనా మంత్రి సవిత సమీక్షించారు. విద్యార్థులను కంటికి రెప్పల చూసుకోవాలని ఆదేశించారు. వాతావరణ పరిస్థితుల్లో మార్పులతో తాజా ఆహారం, వేడి చేసి చల్లార్చిన నీటిని అందివ్వాలన్నారు. బయట ఆహారం హాస్టళ్లు, ఎంజేపీ గురుకులాల్లోకి అనుమతివ్వొద్దని స్పష్టం చేశారు. హాస్టళ్లను, గురుకులాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. వచ్చే టెన్త్, ఇంటర్ లో అత్యుత్తమ ఫలితాలను రాబట్టడానికి ఇప్పటి నుంచే సిద్దమవ్వాలని మంత్రి సవిత దిశా నిర్దేశం చేశారు. ఈ సమీక్షా సమావేశాల్లో ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షులు భూపేశ్ రెడ్డి, పులివెందుల నియోజక వర్గ ఇన్చార్జి బీటెక్ రవి, ఆర్ అండ్ బి, బీసీ సంక్షేమ, చేనేత, జౌళి శాఖాధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *