-పరిశుభ్రమైన ఆరోగ్యకరమైన ఆంధ్రప్రదేశ్
-తాళ్లపూడిలో స్వచ్ఛ ఆంధ్రా – స్వర్ణ ఆంధ్రా కార్యక్రమంలో కలెక్టర్ కీర్తి చేకూరి
తాళ్లపూడి, నేటి పత్రిక ప్రజావార్త :
“పరిశుభ్రత అనేది ప్రభుత్వ కార్యక్రమం మాత్రమే కాదు.. ప్రతి ఒక్కరి బాధ్యత అని పరిశుభ్రమైన పాఠశాలలు, పరిశుభ్రమైన గ్రామాలు, పరిసరాలు ఉంటేనే ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించగలం” అని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అన్నారు. ప్రతి నెల మూడో శనివారం నిర్వహించే స్వచ్ఛ ఆంధ్రా – స్వర్ణ ఆంధ్రా (SASA) కార్యక్రమంలో భాగంగా శనివారం తాళ్లపూడి గ్రామంలోని జెడ్పీ హైస్కూల్ ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలోని పారిశుధ్య కార్మికులతో కలెక్టర్ ముఖాముఖి మాట్లాడి, వారు ఎదుర్కొంటున్న సమస్యలు, గ్రామ పారిశుధ్య నిర్వహణ, ప్రజలకు అందిస్తున్న సేవలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. పరిశుభ్రత ఇంటి నుంచి.. పాఠశాల నుంచి ప్రారంభం కావాలని కలెక్టర్ సూచించారు. విద్యార్థులు తమ పాఠశాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు, తమ ఇళ్లలోనూ, పరిసర ప్రాంతాల్లోనూ పరిశుభ్రతపై తల్లిదండ్రులకి అవగాహన కల్పించాలని తెలిపారు. తడి, పొడి చెత్తను వేరు చేసి నిర్దేశిత విధానంలో పారవేయడం, మరుగుదొడ్లను పరిశుభ్రంగా ఉంచడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం వంటి అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ చిన్నారులతో కలిసి మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. పచ్చదనం పెంపొందించడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని పిలుపునిచ్చారు. “ఆరోగ్యకరమైన పాఠశాలలు – ఆరోగ్యకరమైన ఆంధ్రప్రదేశ్”
అనంతరం విద్యార్థులు, అధికారులు, ప్రజా ప్రతినిధులు, గ్రామస్థులతో కలిసి ఆగస్టు 2026 SASA ప్రతిజ్ఞ చేశారు. “నేను నా పాఠశాలను, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతాను. వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తాను. చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కుంటాను. పరిశుభ్రమైన తాగునీటిని మాత్రమే వినియోగిస్తాను. చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా తడి–పొడి చెత్తను వేరు చేసి సరైన విధంగా పారవేస్తాను. మరుగుదొడ్లను పరిశుభ్రంగా ఉంచుతాను. పచ్చదనాన్ని పెంపొందిస్తూ పర్యావరణాన్ని పరిరక్షిస్తాను. నా పాఠశాల పరిశుభ్రతను కాపాడటంలో ఇతరులకు కూడా అవగాహన కల్పిస్తాను” అని ప్రతిజ్ఞ చేశారు. “పరిశుభ్రమైన పాఠశాల – ఆరోగ్యకరమైన విద్యార్థి – స్వచ్ఛమైన ఆంధ్రప్రదేశ్” అనే లక్ష్య సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి వి. శాంతామణి, డివిజనల్ అభివృద్ధి అధికారి కె. శ్రీనివాసరావు, ఇతర అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, విద్యార్థినీ విద్యార్థులు, గ్రామస్థులు, మహిళలు, పారిశుధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News