Breaking News

3 దశాబ్దాల వెలిగొండ కల సాకారం

-ఆగస్టు 31న వెలిగొండ ద్వారా నీళ్లు విడుదల
-మూడో విడతలో రూ.250 కోట్ల పరిహారం అందించిన సీఎం చంద్రబాబు
-నిర్వాసితులకు చెక్కును అందజేసిన ముఖ్యమంత్రి
-48 రోజుల్లో రూ.768 కోట్లు చెల్లించిన కూటమి ప్రభుత్వం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల ప్రజల 30 ఏళ్ల ఆకాంక్షలు నెరవేరేలా వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశ ప్రారంభం కానుంది. ఆగస్టు 31వ తేదీన వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశను ప్రారంభించి నీళ్లు విడుదల చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. క్యాంపు కార్యాలయంలో శుక్రవారం వెలిగొండ నిర్వాసితులకు మూడో విడతలో రూ.250 కోట్ల పరిహారం చెక్కును సీఎం చంద్రబాబు అందించారు. దీంతో ఇప్పటి వరకూ 6,206 నిర్వాసిత కుటుంబాలకు రూ.768 కోట్లను ప్రభుత్వం చెల్లించింది. మొదటి విడతలో 2,557 కుటుంబాలకు రూ.318 కోట్లు, రెండో విడతలో 1,622 కుటుంబాలకు రూ.200 కోట్లను ప్రభుత్వం చెల్లించింది. శుక్రవారం మూడో విడతగా 2,027 కుటుంబాలకు రూ.250 కోట్లు పరిహారాన్ని సీఎం చేతుల మీదుగా అందించారు. 48 రోజుల్లోనే నిర్వాసితులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.768 కోట్లను చెల్లించింది. నిర్వాసితులకు మరో రూ.132 కోట్లు మాత్రమే చెల్లించాల్సి ఉంది. వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ద్వారా మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లోని 1.19 లక్షల ఎకరాల ఆయకట్టుకు, 4 లక్షల మందికి తాగునీరు అందనుంది. వెలిగొండ నిర్వాసితులతో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ.. “ఆయా జిల్లాల ప్రజల 30 ఏళ్ల కలను సుసాధ్యం చేసి చూపించాం. సీఎంగా 1995లో ఆ ప్రాంతానికి వెళ్లినప్పుడు రైతులు సాగు, తాగునీరు ఇవ్వాలని కోరారు. 1996లో నేనే ప్రాజెక్టుకు రూపకల్పన చేసి శంకుస్థాపన చేసి… 2026లో ప్రారంభిస్తున్నాను. వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ పూర్తి చేసి ఇప్పుడు ప్రారంభించేలా రెండేళ్లలో రూ.2,250 కోట్లు ఖర్చు చేశాం. నాడు ఎన్టీఆర్ శంకుస్థాపన చేసిన వివిధ ప్రాజెక్టులను పూర్తి చేసి ప్రారంభించటం నా అదృష్టం. ఈ ఏడాది ఎల్ నినో కారణంగా 50 శాతం లోటు వర్షపాతం ఉంది. శ్రీశైలం, నాగార్జున సాగర్‌లకు నీళ్లు రాలేదు. చాలా పొదుపుగా నీటిని వినియోగించుకోవాల్సి ఉంది. ఇబ్బందులు ఉన్నా ఎట్టి పరిస్థితుల్లోనూ వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసి నీరు ఇవ్వాలని సంకల్పించుకున్నాం. 2021లోనే దీనిని పూర్తి చేసి నీరివ్వాల్సి ఉన్నా గత పాలకులు చేసిన డ్రామాలతో అది సాధ్యం కాలేదు. పోలవరం పూర్తి చేసి కృష్ణాడెల్టాకు, శ్రీశైలంలో నీరు పొదుపు చేసి ప్రకాశం, నెల్లూరు, కడప, రాయలసీమ ప్రాంతానికి నీరు ఇవ్వొచ్చు. గంగా-గోదావరి- కావేరి అనుసంధానించాలని సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో ప్రతిపాదించాను. ఐదు నదులను అనుసంధానిస్తే నాలుగు రాష్ట్రాల్లో సమస్యలు తీరిపోతాయి. దేశానికే నీటి సమస్య పరిష్కారమై నీటి భద్రత వస్తుంది. వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు మేలు జరిగేలా ప్రయత్నం చేస్తున్నాం. ఈ నెల 31 తేదీన వెలిగొండ ద్వారా నీళ్లు విడుదల చేస్తాం. మార్కాపురం జిల్లాలో జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతీ ఇంటికి కుళాయి నీరు ఇస్తాం. సెప్టెంబరులోనే హార్టికల్చర్ హబ్‌కు ఫౌండేషన్ వేస్తాం. రామాయపట్నం పోర్టు ద్వారా రైతులు ఉద్యాన ఉత్పత్తుల్ని ఎగుమతి చేసుకునే అవకాశం ఉంటుంది. గత పాలకులు ఆర్ధిక వ్యవస్థకు తీవ్ర నష్టం చేశారు. ఆర్ధిక ఇబ్బందులు ఉన్నా సూపర్ సిక్స్ లాంటి పథకాలు అమలు చేస్తున్నాం. అభివృద్ధితో పాటు ప్రాజెక్టులు కూడా పూర్తి చేయాల్సి ఉంది. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. మంచి చేసే ప్రభుత్వాన్ని గుర్తించాలని ప్రజల్ని కోరుతున్నాను.”అని ముఖ్యమంత్రి అన్నారు.

పునరావాస ప్యాకేజీ పై నిర్వాసితుల సంతృప్తి

గత ప్రభుత్వం పరిహారం ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టిందని.. నాటి సీఎం ప్రకాశం జిల్లాకు వచ్చినప్పుడు పరిహారం అడుగుతామని నోటీసులు ఇచ్చి బయటకు రాకుండా చేశారని.. ప్రాజెక్టు కింద పొలాలను కోల్పోయినా కూటమి ప్రభుత్వం ఇచ్చిన పరిహారం సంతోషం కలిగించిందని వెలిగొండ నిర్వాసిత రైతు కాశిరెడ్డి అన్నారు. చంద్రబాబు చేతుల మీదుగా శంకుస్థాపన చేసిన ప్రాజెక్టును ఆయనే ఇప్పుడు ప్రారంభిస్తున్నారని.. తాము కలగా భావించిన ప్రాజెక్టు తమ కళ్ల ముందే సాకారమైందని..తమ ప్రాంతానికి సాగునీరు, తాగునీరు రావటం సంతోషంగా ఉందని నిర్వాసిత రైతు బోగెం శ్రీనివాసులు అన్నారు. తమకు పరిహారం పూర్తిగా అందించిందని.. కాలనీల్లో వసతుల కల్పన బాగుందని నిర్వాసితులకు ప్రభుత్వం అండగా నిలవటం సంతృప్తిగా ఉందని మహిళా నిర్వాసితురాలు ఉషమ్మ తెలిపారు. ఈ సమావేశంలో జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి, గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి, కనిగిరి ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డి, ఎర్రగొండపాలెం ఇంచార్జి ఎరిక్షన్ బాబు, ఆర్ అండ్ ఆర్ కమిషనర్ ప్రశాంతి, వెలిగొండ నిర్వాసితులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విశాఖ వేదికగా బ్రిక్స్ కొత్త క్రీడా బంధం ఆవిష్కరిద్దాం

-బ్రిక్స్ యూత్ అండ్ స్పోర్ట్స్ ఇన్నోవేషన్ నెట్వర్క్ ఏర్పాటుకు పిలుపు -బ్రిక్స్ దేశాల యువజన, క్రీడల మంత్రుల సాంస్కృతిక కార్యక్రమంలో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *