-నూతన పారిశ్రామికవేత్తలకు పూర్తి సహకారం : ఎంపీ కేశినేని చిన్ని
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అభివృద్ధి పథంలో వేగంగా ముందుకు సాగుతున్న విజయవాడ నగరంలో మరిన్ని నూతన వ్యాపార, వాణిజ్య సంస్థలు ఏర్పాటు కావాలని విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివనాథ్ (చిన్ని) ఆకాంక్షించారు. నగరంలో ఏర్పాటు చేసిన ‘కురువ్ సర్ఫేస్ ప్రొటెక్షన్’ నూతన షోరూమ్‌ను ఆదివారం ఆయన ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో విజయవాడ ఈస్ట్ ఎమ్మెల్యే గద్దె రామమోహన్, చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభి రామ్, సీనియర్ నాయకుడు బొప్పన భవకుమార్‌లతో కలిసి ఎంపీ కేశినేని చిన్ని షోరూమ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు గంటా పవన్ రాఘవేంద్ర కు శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం ఎంపీ మాట్లాడుతూ.. విజయవాడ నగరం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో కొత్త వ్యాపార అవకాశాలు కూడా పెరుగుతున్నాయని అన్నారు. స్థానికంగా నూతన షోరూమ్‌లు, వ్యాపార సంస్థలు ఏర్పాటు కావడం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందడంతో పాటు యువతకు ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉందన్నారు. వ్యాపార రంగంలోకి కొత్తగా అడుగుపెడుతున్న పారిశ్రామికవేత్తలు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని సూచించారు. విజయవాడను మరింత అభివృద్ధి చెందిన నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు కృషి చేస్తున్నారని తెలిపారు. నగరంలో పెట్టుబడులు పెట్టే పారిశ్రామికవేత్తలకు, నూతన వ్యాపార సంస్థల ఏర్పాటుకు తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ఎంపీ కేశినేని చిన్ని స్పష్టం చేశారు.
స్థానిక అవసరాలకు అనుగుణంగా నాణ్యమైన ఉత్పత్తులు, సేవలను అందిస్తూ ‘కురువ్ సర్ఫేస్ ప్రొటెక్షన్’ షోరూమ్ ప్రజల ఆదరణ పొందాలని ఆయన ఆకాంక్షించారు. కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, వ్యాపారవేత్తలు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News