-సాంకేతిక విద్యా శాఖ కమీషనర్ చదలవాడ నాగరాణి
-రాష్ట్రంలోని పాలిటెక్నిక్ ల ప్రిన్సిపల్స్ తో ఉన్నత స్ధాయి సమీక్ష
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అక్టోబర్ చివరి నాటికి రాష్ట్రంలోని ప్రతి పాలిటెక్నిక్ నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడేషన్ (ఎన్ బిఎ) గుర్తింపును పొందాలని రాష్ట్ర సాంకేతిక విద్య శాఖ కమీషనర్ చదలవాడ నాగరాణి అన్నారు. విద్యాసంస్దలకు ఎన్ బిఎ అక్రిడిటేషన్ అత్యావశ్యకమని తద్వారా విద్యార్ధులకు ఎన్నో లాభాలు ఉన్నాయని స్పష్టం చేసారు. ఎన్ బిఎ అక్రిడేషన్ కు సంబంధించిన పురోగతిపై గురువారం కమీషనర్ రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ పాలిటెక్నిక్ ల ప్రిన్సిపాల్స్ తో కమీషనరేట్ నుండి దృశ్య శ్రవణ విధానంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నారరాణి మాట్లాడుతూ ప్రస్తుతం 7 పాలిటెక్నిక్‌లు నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషన్ నుండి గుర్తింపును అందుకున్నాయని. రానున్న మూడు నెలల్లో ఎన్ బిఎ ప్రమాణాలకు అనుగుణంగా ప్రతి విద్యా సంస్ధ సిద్దంకావాలన్నారు. ఇప్పటికే ఎన్ బిఎ బృందం మరో ఆరు పాలిటెక్నిక్ ల సందర్శనకు సమయం ఇచ్చినందున , అయా ప్రిన్సిపల్స్ ప్రత్యేక దృష్టి సారించవలసిన అవసరం ఉందన్నారు.ప్రాంగణాలను పరిశుభ్రంగా ఉంచుకోవటంతో పాటు, ప్రతి చిన్న విషయంపైనా శ్రద్ధ పెట్టాలన్నారు. మిగిలిన పాలిటెక్నిక్ లు సైతం వెంటనే ఎన్ బిఎ బృందం సందర్శనకు తేదీలు లభించేలా కార్యాచరణ వేగవంతం చేయాలన్నారు. లైవ్ ప్రాజెక్ట్‌ల ప్రదర్శన విద్యార్థుల విజయాలను ప్రతిబింబిస్తుందని, ఇది ప్రాక్టికల్ లెర్నింగ్‌కు శక్తివంతమైన ప్రాతినిధ్యం అని నాగరాణి పేర్కొన్నారు. ఇన్నోవేషన్ , సృజనాత్మకత కీలక థీమ్‌లుగా ఉద్భవించిన నేపధ్యంలో విధ్యా సంస్థలోని అన్ని అంశాలలో ఈ లక్షణాలను ప్రదర్శించేలా చూసుకోవాలన్నారు. కార్యక్రమంలో సాంకేతిక విద్యా శాఖ సంయిక్త సంచాలకులు వెలగా పద్మారావు, సాంకేతిక విద్యా, శిక్షణా మండలి కార్యదర్శి రమణ బాబు. సంయిక్త కార్యదర్శులు జానకి రామయ్య, సత్యన్నారాయణ మూర్తి, సాంకేతిక విద్యా శాఖ ఉపసంచాలకులు విజయ భాస్కర్ , ఓఎస్ డి నాగేశ్వరరావు తదితరులు కేంద్ర కార్యాలయం నుండి పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News