-పాత్రికేయరంగంలో ఫోటో జర్నలిస్టుల పాత్ర కీలకం..
-ఫోటోలు లేని న్యూస్ పేపర్ వెలుగు లేని దివిటీ లాంటిది..
-జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు.
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పాత్రికేయ రంగంలో ఫోటో జర్నలిస్టుల పాత్ర కీలకమని, ఫోటోలు లేని న్యూస్ పేపర్ వెలుగు ఇవ్వని దివిటీ లాంటిదని ఒకే ఒక చాయచిత్రం వేయి పదాల అర్థాన్నిస్తుందని ఫోటో జర్నలిస్టు తీసిన చిత్రం ప్రచరించబడి ఎన్నో జీవితాలలో మార్పు తీసుకువచ్చిన సంఘటనలు ఉన్నాయని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు అన్నారు.ప్రపంచ ఫ్రోటోగ్రఫీ దినోత్సవ సందర్భంగా శనివారం నగరంలోని జిల్లా కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో కలెక్టర్ ఎస్ డిల్లీరావు ఫోటో జర్నలిస్టులను ఘనంగా సత్కారించారు.అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కేవలం ఒక్క ఫోటోతో ఎన్నో భావాలను బాహ్య ప్రపంచానికి తెలియజేసే అద్భుత శక్తి ఒక్క ఫోటోగ్రఫీకే ఉంటుందన్నారు. మానవ జీవితానికి ఫోటోగ్రఫీకి అవినాభావ సంబంధం ఉంటుందన్నారు. ఫోటోలు భద్రపరచడం అంటే చరిత్రను భద్రపరచుకున్నట్లేనన్నారు. కాలగర్భంలో కలిసిపోయే ఎన్నో మధుర స్మృతులను పదిలంగా ఉంచగల శక్తి ఫోటోలకే ఉంటుందన్నారు. ఫ్రాన్స్‌కు చెందిన లూయిస్ ఓ.ఎం.డాగ్యూరే 1837లో ఫోటోగ్రఫిని కనుగొనిన నాడు బ్లాక్ అండ్ వైట్‌తో ప్రారంభమైన ఫోటోగ్రఫీ కాలానుగుణంగా సాంకేతికతను జోడిరచుకుని కొత్త పుంతలు తొక్కుతోందన్నారు. పాత్రికేయుల రంగంలో పనిచేసే ఫోటో జర్నలిస్టులు వారి ఆలోచన సరళికి పదునుపెట్టి ఓర్పు నేర్పుతో తీసిన ఫోటోలు పత్రికలో ప్రచురించడం ద్వారా ఎన్నో జీవితాలలో వెలుగులు నింపిన సంఘటనలు ఉన్నాయన్నారు. పత్రికలలో ప్రచురించబడే వార్తలలో ఎంత మంచి వార్త అయిన ఫోటో లేనిదే పాఠకులను అంతగా ఆకర్షించదన్నారు. పాఠకులను ఆకర్షించడంలో ఫోటో జర్నలిస్టులదే ప్రధాన భూమిక అన్నారు. ప్రజా ప్రతినిధులు, ఫోటో జర్నలిస్టులకు ప్రతినిత్యం అవినాభవ సంబంధాలు కలిగి ఉంటాయన్నారు. ఫోటో జర్నలిస్టుల సమస్యలను తీర్చవలసిన భాధ్యత ప్రజా ప్రతినిధులపై ఉందన్నారు. ఫోటో జర్నలిస్టులు ఆహర్నిసలు ఉత్తమ ఫోటోలు కోసం తపించే జర్నలిస్టులు కొన్ని సమయాలలో అనేక ఇబ్బందులను ఎదుర్కొవాల్సి వస్తుందన్నారు. సరైన ఆర్థిక ప్రోత్సహాం లేనప్పటికి ఫోటోగ్రఫీపై ఉన్న మక్కువతో మొక్కవోని ధీక్షతో పనిచేస్తున్నారన్నారు. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని అందరికి జిల్లా కలెక్టర్ డిల్లీరావు శుభాకాంక్షలు తెలిపారు.కార్యక్రమంలో జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి యు సురేంద్రనాద్, డిపిఆర్‌వో ఎస్. వి. మోహన్‌రావు, పబ్లిసిటీ అసిస్టెంట్ వి. వి ప్రసాద్ సీనియర్ ఫోటో జర్నలిస్టులు సిహెచ్ విజయభాస్కర్, వైడి ఆనంద్, రూబెన్ బెసాలియల్, సిహెచ్ నారాయణరావు, కెవిఎస్‌గిరి, దుర్గాప్రసాద్, జివి నారాయణ, సిహెచ్‌వి మస్తాన్, వివిధ దినపత్రికలకు చెందిన ఫోటోజర్నలిస్టులు, పాత్రికేయులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News